AP Liquor Case: ఏపీ లిక్కర్ స్కామ్ సెగ వైసీపీ కీలక నేతలకు తగిలింది.వైసీపీ ప్రభుత్వం వేల కోట్లకు తెరతీసిన మద్యం కుంభకోణంలో ప్రిలిమినరీ ఛార్జ్‌షీట్ ను న్యాయస్థానంలో దాఖలు చేశారు సిట్ అధికారులు. సిట్ దాఖలు చేసిన ఛార్జిషీటులో పలుమార్లు మాజీ సీఎం జగన్ పేరు ప్రస్తావించారు.
ముడుపులు కొల్లగొట్టేందుకు అనుగుణంగా మద్యం పాలసీ తీసుకొచ్చారని ప్రస్తావించారు. అందుకు అనుగుణంగా కీలక నేతలు వేసిన ప్లాన్, ముడుపుల సొమ్ము ఎలా వసూలు చేశారు? వంటి విషయాలను ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించింది సిట్. పేరైతే ప్రస్తావించిందిగానీ, అభియోగపత్రంలో ఎక్కడా నిందితుడిగా ఆయన్ని చేర్చలేదు.
శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో దాదాపు 305 పేజీలు, 70 వాల్యూమ్స్ తో కూడిన ఛార్జిషీటును ఏసీబీ కోర్టుకు సమర్పించారు అధికారులు. దీనికితోడు 28కి పైగా ఎఫ్ఎస్ఎల్ నివేదికలు ఉన్నట్లు సమాచారం. ఎలక్ట్రానిక్ పరికరాల విశ్లేషణలు, ఎక్సైజ్ శాఖ జారీ చేసిన జీవోలు, వైసీపీ ప్రభుత్వ మద్యం పాలసీ డాక్యుమెంట్లు పొందుపరిచినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో 40 మంది వ్యక్తులు, వివిధ సంస్థలను నిందితులుగా చేర్చింది. మరో 8 మందిని నిందితులుగా ప్రస్తావించింది. ఓవరాల్‌గా 16 మందిపై అభియోగాలు మోపారు. ఛార్జిషీటులో కీలక అంశాల విషయానికొస్తే.. నూతన మద్యం పాలసీ, ప్రైవేటు వ్యక్తుల నివాసాల్లో జరిగిన సమావేశాలు, పాల్గొన్న వ్యక్తుల పేర్లు ఉన్నాయి. ఇప్పటివరకు 11 మందిని అరెస్టు చేశారు సిట్ అధికారులు.
ALSO READ: ముద్రగడ ఆరోగ్య పరిస్థితి ఏంటి? హైదరాబాద్‌లో ట్రీట్‌మెంట్
అలాగే ముడుపుల వసూళ్లపై సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, మద్యం సరఫరాలో పారదర్శకతకు తిలోదకాలివ్వటంపై అభియోగ పత్రంలో పేర్కొంది సిట్. మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు, డిస్టిలరీల నుంచి నిధులు ఎలా వసూలు చేశారు? అందులో భాగస్వాములు ఎవరు?
ముడుపుల సొమ్ము ఎక్కడ ఉంచారు? డొల్ల కంపెనీలకు ఏ విధంగా మళ్లించారు? వంటి వివరాలు క్లియర్‌గా పేర్కొన్నారు. దీనికితోడు వివిధ రాష్ట్రాల్లో బంగారం కొనుగోలు, రియల్ ఎస్టేట్ కంపెనీల ఖాతాల్ని అడ్డం పెట్టుకుని ముడుపులు తీసుకోవడాన్ని వివరించారు. అలాగే ముంబై, ఢిల్లీ కేంద్రాలుగా జరిగిన లావాదేవీలను బయటపెట్టారు. మొత్తం తొమ్మిది డెన్లు ఉన్నాయి. వాటిలో దుబాయ్, తాడేపల్లి ఒకొక్కటి కాగా, మిగతా ఏడు హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలిపారు.
ఇప్పటివరకు 62 కోట్ల రూపాయలను జప్తు చేశారు అధికారులు. అదంతా ముడుపుల సొమ్ములేనని అభియోగపత్రంలో ప్రస్తావించారు. తీసుకున్న సొమ్ము ఎక్కడెక్కడ ఉంచారు? వాటి వివరాలు వెల్లడించారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు ఆ సొత్తు తరలింపు విషయాలను పూర్తి ఆధారాలతో వివరించారు.
ముడుపులకు సంబంధించిన నోట్ల కట్టలతో నిందితులున్న వీడియోలను అందజేశారు. ప్రభుత్వ ఖజానాకు కలిగించిన నష్టం, హవాలా ద్వారా ముడుపుల సొమ్ము తరలించిన తీరుని పేర్కొన్నారట. మొత్తం వ్యవహారంలో ఎవరి పాత్ర ఏ మేరకు ఉందో కూడా తెలిపారు.
ఆడియో, వీడియో, ఫోరెన్సిక్ నివేదికలు, సీడీఆర్ వివరాలు అందజేశారు. ఇది కేవలం ప్రాథమిక ఛార్జిషీటు మాత్రమే. పూర్తి వివరాలతో మరికొన్ని అభియోగపత్రాలు దాఖలు చేయనున్నారు. నెక్ట్స్ ఛార్జిషీటులో ముడుపులు ఎవరికి చేరాయి? ఎవరు లబ్దిపొందారు? అనేది ప్రస్తావించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.