Jagan: దేనికైనా ఒక హద్దు ఉంటుంది. శృతి మించితే పర్యవసానాలు ఎలా ఉంటాయో చెప్పేందుకు జగన్ టూర్లు ఒక ఎగ్జాంపుల్. మాజీ సీఎం జగన్ పర్యటనకు పర్మీషన్ ఇవ్వరాదని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదో విధంగా శాంతి భద్రతల ఇష్యూ తెచ్చి, ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడాన్ని అధికారులు తట్టుకోలేక పోతున్నారు.
ఏపీలో వైసీపీ అధికారం పోయిన తర్వాత అప్పుడప్పుడు జనంలోకి వెళ్తున్నారు వైసీపీ అధినేత జగన్. ఆయన వెళ్లిన ప్రతీసారి శాంతి భద్రతల సమస్యను క్రియేట్ చేస్తున్నారు. ఆయన పర్యటనకు జనాలు పోగేసి ప్రత్యర్థులపై దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో పర్మీషన్లు ఇవ్వరాదని కొన్ని జిల్లాల పోలీసు అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఆ మధ్య అనంతపురం టూర్‌కి హెలికాఫ్టర్‌లో వెళ్లారు జగన్. ఆ సమయంలో ఏం జరిగిందో తెలీదుగానీ, హెలికాప్టర్ డ్యామేజ్ అయ్యింది. దీనిపై పెద్ద రగడ జరుగుతోంది. ప్రస్తుతం ఆ ఘటనపై లోతుగా విచారణ జరుగుతోంది. హెలికాప్టర్ డ్యామేజ్ వెనుక అసలు నిందితులను బయటకు తీసే పనిలోపడ్డారు పోలీసులు.
గతవారం ప్రకాశం జిల్లా పొదిలికి వెళ్లారు జగన్. అక్కడి పొగాకు రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లారు. ఆ సమయంలో వైసీపీ కేడర్ రెచ్చిపోయి, టీడీపీ మద్దతుదారులపై దాడులు చేశారు. ఈ ఘటన తెలియగానే కూటమి సర్కార్ షాక్ అయ్యింది. వెంటనే జిల్లా పోలీసులను పిలిచిన ప్రభుత్వ పెద్దలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ALSO READ: ఏపీ డీఎస్సీ అప్డేట్స్.. ప్రాథమిక ‘కీ’లు విడుదల
ఇలా జగన్ ఏ టూర్ వెళ్లినా శాంతి భద్రతల సమస్యకు క్రియేట్ చేయడం పోలీసులకు అంతబట్టడం లేదు. జరిగిన పరిణామాలను గమనించిన కొన్ని జిల్లాల అధికారులు ఆయన పర్యటనకు పర్మిషన్ ఇవ్వరాదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బుధవారం పల్నాడు జిల్లా జగన్ పర్యటనకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదని తెలుస్తోంది.
జగన్ పర్యటన గురించి పల్నాడు జిల్లా ఎస్పీ ఏమన్నారు? బుధవారం అంటే జూన్ 18న పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకి వైసీపీ అధినేత జగన్ రానున్నారు. అధినేత పర్యటనకు సత్తెనపల్లి వైసీపీ అనుమతి కోరలేదని అధికారులు చెబుతున్నారు. మాజీ సీఎం పర్యటనపై తాము ఇప్పటివరకు అడిగిన పూర్తి వివరాలు ఇవ్వలేదని, అందుకే పర్మిషన్ ఇవ్వలేదని చెప్పుకొచ్చారు.
అసలు కార్యక్రమానికి ఎంత మంది వస్తున్నారు? ఎన్ని వాహనాలు వస్తున్నాయి? అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశారా లేదా? వంటి వివరాలు అడిగామని అధికారుల వెర్షన్. 30 వేల మంది వస్తారని చెప్పారని, ఆ రహదారిలో అంతమందికి అవకాశం లేదని చెప్పామన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని భావించి అనుమతి ఇవ్వలేదని అంటున్నారు.
గతంలో జరిగిన కొన్ని ఘటనలు దృష్టిలో పెట్టుకొని అనుమతి ఇవ్వలేదన్నారు. తాము అడిగిన పత్రాలు ఇస్తే అప్పుడు పరిశీలన చేస్తామన్నారు. పోలీసుల అనుమతి లేకుండా కార్యక్రమం చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అసలు విషయం బయటపెట్టారు.
జగన్ ఏ జిల్లాకు వెళ్లినా శాంతి భద్రతలు లేవంటూ ఒకటే రీసౌండ్ చేస్తున్నారు. తన టూర్లలో ఏదోవిధంగా రగడ క్రియేట్ చేసి కూటమి సర్కార్ పై దుమ్మెత్తిపోయాలన్నది ఆయన ఎత్తగడగా కనిపిస్తోంది. దీన్ని పసిగట్టిన అధికారులు, టూర్‌కి సంబంధించి వివరాలు అందజేస్తే పర్మిషన్ ఇస్తామని అంటున్నారు. ఈలెక్కన జగన్ జిల్లాల టూర్లకు క్రమంగా చెక్ పడినట్టేనని అంటున్నారు.