
Pawan Kalyan Chances To Contest For 2 Seats: ఏపీ ఎన్నికలు మరో రెండు నెలల్లో జరగబోతున్నాయి. రాష్ట్రంలో ప్రధాన పార్టీల్లోని కీలక నేతలు పోటీ చేసే స్థానాలపై క్లారిటీ ఉంది. కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి బరిలోకి దిగుతారనేది మిస్టరీగానే మారింది. 2014లో పార్టీ ఏర్పాటు చేసిన పవన్.. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో పోటీకి దిగలేదు. టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతుగా నిలిచారు. 2019లో టీడీపీ, బీజేపీతో బంధం తెచ్చుకుని ఒంటరి బరిలోకి దిగారు. అయితే ఆ పార్టీకి ఒక్క సీటు మాత్రమే దక్కింది. భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ ఓడిపోయారు.
ఇప్పుడు ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఇంతవరకు జనసేనాని ఎక్కడ నుంచి పోటీ చేస్తారో తేలలేదు. మరోవైపు టీడీపీ-జనసేన సీట్ల సర్దుబాటుపై మంతనాలు సాగుతున్నాయి. టీడీపీ కీలక నేతలు పోటీ చేసే స్థానాలపై క్లారిటీ వచ్చేసింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి బరిలోకి దిగనున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తానని ఎప్పుడో ప్రకటించేశారు. గత ఎన్నికల్లో లోకేశ్ అక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు . అయినా సరే మళ్లీ మంగళగిరి నుంచి బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి పోటీ చేయడం ఖాయమే. పవన్ సోదరుడు నాగబాబు అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్థఇగా పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది.
Read More: బూచేపల్లికి వైసీపీ టిక్కెట్.. జనసేన వైవు ఎమ్మెల్యే మద్దిశెట్టి చూపు..
పవన్ కల్యాణ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఇంకా స్పష్టత లేదు. గతంలో ఓటమిపాలైన భీమవరం నుంచి పోటీ చేయాలని పవన్ కు కొందరు సలహాలు ఇస్తున్నారని తెలుస్తోంది. అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న సంకల్పంతో ఉన్న జనసేనానికి బీజేపీ నేతలు కీలక సూచనలు చేశారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగానూ బరిలోకి దిగాలని సూచించారని టాక్ నడుస్తోంది. మరోవైపు పవన్ భీమవరం, పిఠాపురం, తిరుపతి నియోజకవర్గాల్లో సర్వేలు చేయించారని తెలుస్తోంది. కాకినాడలో పార్టీ బలంపై సమాచారం సేకరించారని అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో పవన్ భీమవరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా, కాకినాడ నుంచి ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇలా చేస్తే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఆ ప్రభావం ఉంటుందని అంటున్నారు. ఈ నెల 14 నుంచి జనసేనాని గోదావరి జిల్లాల్లో పర్యటించబోతున్నారు. ఈ సమయంలో రెండు స్థానాల్లో పోటీపై స్పష్టత ఇస్తారని తెలుస్తోంది. అందుకే పవన్ పోటీ చేసే స్థానాలపై జనసైనికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.