Nara Lokesh: దేశం కాని దేశమది. చేతిలో పాస్ పోర్ట్ లేదు. బిక్కు బిక్కుమంటూ కన్నీళ్లు కారుస్తోంది ఆ మహిళ. మరోవైపు యజమాని ఇబ్బందులకు తాళలేక రోదిస్తోంది ఆమె. ఎవరో వస్తారని, తనను ఆదుకుంటారని ఆ మహిళ రోదించని రోజు లేదు. అయితే ఎలాగోలా తన సమస్యను కుటుంబ సభ్యులకు చేరవేసింది. వారు వెంటనే మంత్రి నారా లోకేష్ దృష్టికి తెచ్చారు. ఆ తర్వాత ఏమి జరిగిందంటే..
పొట్టకూటి కోసం గల్ఫ్ కు వెళ్లిన ఆ మహిళ, రక్షించాలంటూ కన్నీరు మున్నీరైంది. ఎలాగైనా తనను కుటుంబసభ్యుల వద్దకు చేర్చాలని వేడుకుంది. ఈ మహిళ ఆవేదన అర్థం చేసుకున్న మంత్రి నారా లోకేష్ స్పందించి, ఆ మహిళను సురక్షితంగా ఇంటికి చేరేలా చర్యలు తీసుకున్నారు. కోనసీమ జిల్లా పోలెకుర్రు పంచాయతీ తూర్పుపేటకు చెందిన పద్మ బ్రతుకు దెరువు కోసం మస్కట్ కు వెళ్ళింది. మస్కట్ కు వెళ్లిన కొద్ది రోజులకే, తన పాస్ పోర్ట్ పోగొట్టుకుంది.
కుటుంబ భారాన్ని మోసేందుకు తప్పక మస్కట్ వెళ్లిన ఆమెను కష్టాలు వెంటాడాయి. అక్కడి యజమాని ఇబ్బందులు రోజురోజుకు అధికమయ్యాయి. కానీ తన కుటుంబం కోసం వాటిని ఓర్చుకొని అలాగే జీవితం సాగించేది. యజమాని ఇబ్బందులు మరింత ఎక్కువ కావడంతో, దేశం కాని దేశంలో ఏమి చేయాలో తెలియని పరిస్థితి. నిద్రాహారాలు లేకుండా కన్నీటి పర్యంతమయ్యేది పద్మ. ఎలాగైనా కుటుంబ సభ్యుల వద్దకు చేరాలని అనుకుంది. అయితే తనకు ఎవరూ తెలియదు. ఏమి చేయాలో పాలుపోలేదు. తన ఇంటికి మాత్రం ఫోన్ చేసి, తన ఇబ్బందులు చెప్పింది.
వెంటనే కొందరు ఆమెకు సలహా ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ కు తన ఇబ్బందులను వివరిస్తూ, ఆమె ఓ వీడియో విడుదల చేసింది. తాను మస్కట్ కు వచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు, తనను ఎలాగైనా రక్షించాలని ఆమె వేడుకొంది. ఆమె వీడియోను కుటుంబసభ్యులు లోకేష్ కు ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి లోకేష్ వెంటనే స్పందించి, తన టీంని అలర్ట్ చేశారు. వేరే దేశానికి వెళ్లిన మహిళ పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న లోకేష్ టీమ్ కూడా, హుటాహుటిన ఆమెకు ఆపన్నహస్తం అందించారు. పద్మను క్షేమంగా ఇంటికి తిరిగివచ్చేలా చర్యలు తీసుకున్నారు.
ఇంటికి చేరిన పద్మ, కుటుంబ సభ్యులను చూసి కన్నీటి పర్యంతమైంది. తాను ప్రాణాల మీద ఆశ వదులుకున్న సమయంలో, మంత్రి నారా లోకేష్ స్పందించి రక్షించారని పద్మ తెలిపారు. సకాలంలో స్పందించి తనను ఇంటికి తిరిగి వచ్చేలా చేసిన మంత్రి లోకేష్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఏదిఏమైనా ఒక్క ట్వీట్ ఆమె ప్రాణాలు కాపాడిందని చెప్పవచ్చు.
మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం బ్రతుకుతెరువు కోసం మస్కట్ దేశానికి వెళ్లి అక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న వాసంశెట్టి పద్మ అనే మహిళను క్షేమంగా రాష్ట్రానికి తిరిగి తీసుకువచ్చి వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు.#NaraLokesh #NaraLokeshForPeople #IdhiManchiPrabhutvam https://t.co/16Y3gV0KpY pic.twitter.com/ZX4QxQEc7T
— Office of Nara Lokesh (@OfficeofNL) December 26, 2024