Manmohan Singh dies: భారతదేశ మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోషన్ సింగ్ గురువారం రాత్రి కన్ను మూశారు. ఆయన పార్థివ దేహాన్ని రాత్రి ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ మార్గ్ వద్ద ఉన్న ఆయన నివాసానికి తీసుకువచ్చారు. శుక్రవారం సామాన్య జనం, విఐపిలు.. డాక్టర్ మన్మోహన్ సింగ్ చివరి చూపు కోసం ఆయన పార్థివ దేహాన్ని చూసేందుకు వీలు కల్పించారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రేపు శనివారం అన్ని ప్రభుత్వ లాంఛనాలతో జరిగే అవకాశాలున్నాయి. దీని గురించి కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రకటన చేయనుంది. మన్మోహన్ సింగ్ మృతి పట్ల కేంద్ర ప్రభుత్వం ఏడు రోజుల సంతాపం ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మన్మోహన్ సింగ్ నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు.
రెండు సార్లు భారతదేశ ప్రధాన మంత్రి పదవి చేపట్టిన డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ప్రొటొకాల్ ప్రకారం అన్ని జాతీయ మర్యాదలతో ప్రభుత్వ లాంఛనాలతో జరుగనున్నాయి. ప్రొటొకాల్ ప్రకారం.. ఆయన పార్థివ దేహంపై జాతీయ జెండా కప్పుతారు. ఆ తరువాత 21 ఫిరంగుల పేలుళ్లతో సెల్యూట్ చేస్తారు. ఈ సెల్యూట్ కేవలం దేశాన్ని ఉన్నత సేవలు అందించిన వారికి మాత్రమే లభిస్తుంది. ఒక ప్రధాన మంత్రి చనిపోతే వారి అంతిమ యాత్రలో ప్రొటొకాల్ ప్రకారం గట్టి బందోబస్తు ఉంటుంది. ఈ అంతిమయాత్రలో సాధారణ జనం, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలందరూ పాల్గొనవచ్చు.
వీటితోపాటు భారత సైనికులు కూడా మాజీ ప్రధాని అంతిమ యాత్రలో ప్రొటొకాల్ ప్రకారం పాల్గొంటారు. మాజీ ప్రధాన మంత్రుల అంత్యక్రియలు సాధారణంగా ఢిల్లీలోని రాజ్ ఘాట్ పరిసరాల్లో చేయబడుతుంది. మాజీ ప్రధాన మంత్రులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీల అంతక్రియలు ఇక్కడే జరిగాయి. అయితే చనిపోయిన వ్యక్తి మతం, కుటుంబ సంప్రదాయాలను కూడా పాటిస్తారు.
ప్రధాని అంత్యక్రియల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు, ఇతర కీలక రాజకీయ నాయకులు పాల్గొనున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి.. ఇద్దరూ మన్మోహన్ సింగ్ అంతక్రియల కోసం ఢిల్లీ వెళ్లనున్నారని సమాచారం. ఇద్దరు ముఖ్యమంత్రులు మన్మోహన్ సింగ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
దేశానికి తీరని లోటు: చంద్రబాబు నాయుడు
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. “భారత మాజీ ప్రధాన మంత్రి ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ గతించారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. అపర మేధావి అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ వినయానికి, విజ్ఞానానికి ప్రతి రూపం. కోట్లాది మంది భారతీయుల జీవితాలను దారిద్య్రం నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ఆయన ఎంతో కృషి చేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు” అని సిఎం చంద్రబాబు ఎక్స్‌లో ట్వీట్ చేశారు.