
Kotamreddy: రెబెల్ ఎమ్మెల్యే ప్రభుత్వంపై పోరు బాట మొదలెట్టారు. ప్రజా సమస్యలపై ఉద్యమానికి సిద్ధమయ్యారు. పొట్టేపాలెం కలుజు బ్రిడ్జ్ నిర్మాణం కోసం జలదీక్ష చేస్తానన్నారు. ఆయన చేస్తానంటే.. సర్కారు చేయనిస్తుందా? ఉదయాన్నే పోలీసులు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇంటిని చుట్టు ముట్టారు. జలదీక్ష చేసేందుకు ఇంటి నుంచి బయటకు రాకుండా హౌజ్ అరెస్ట్‌తో కట్టడి చేశారు. రద్దీగా ఉన్న రూట్లో దీక్ష చేపడితే.. ట్రాఫిక్ కి ఇబ్బంది కలుగుతోందనేది పోలీసుల పాయింట్.
అటు.. కోటంరెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకొని ఆందోళన చేస్తున్నారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే కోటంరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా జలదీక్ష చేపడితే.. పోలీసులు బలప్రయోగం చేస్తున్నారని ఫైరఱ్ అయ్యారు. పోలీసుల తీరు మారకపోతే.. హైకోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందని కోటంరెడ్డి హెచ్చరించారు.
హౌస్ అరెస్ట్ లో ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి స్థానిక జనసేన నేతల మద్దతు తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న శ్రీధర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమని జనసేన నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు. సమస్యలపై గలమెత్తిన గొంతును ప్రభుత్వం నొక్కే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. వైసీపీ హయాంలో శాంతియుత నిరసనలకు కూడా అనుమతి లేకుండా పోయిందని మండిపడ్డారు. త్వరలోనే ప్రజలు వైసీపీకి బుద్ది చెబుతారన్నారు జనసేన నేతలు.