Tomatoes at Rs 50 Paisa: ఔను మీరు విన్నది నిజమే. మీ జేబులో రూపాయి ఉంటే చాలు.. ఓసారి మార్కెట్ కు వెళ్లి వస్తే సరి. ఒకటి కాదు ఏకంగా రెండు కేజీల తెచ్చుకోవచ్చు. చేతి సంచి ఖచ్చితంగా నిండి పోవడం ఖాయం. ఏమిటి ఒక్క రూపాయికి రెండు కేజీలు వస్తాయా అని మాత్రం ఆగవద్దు. ఖచ్చితంగా ఓసారి వెళ్లిరండి అప్పుడు మీకు తెలుస్తుంది. ఇలా రెండు కేజీలు వచ్చే కూరగాయ ఏమిటో తెలుసా.. మనం ప్రతి కూరలో ఉపయోగించే టమాటా.
కర్నూల్ జిల్లాలోని పత్తికొండకు టమాటా సాగు రైతులు తమ పంటను విక్రయించేందుకు వచ్చారు. రేటు పలకాలి.. పెట్టుబడి రావాలని కోరుకుంటూ అడుగు పెట్టిన ఆ రైతులకు షాకిచ్చింది మార్కెట్. మొన్నటి వరకు అంతో ఇంతో ధర పలికిన టమాటా ధర.. ఒక్కసారిగా కేజీ అర్ధ రూపాయి పలికింది. మార్కెట్ కు వచ్చిన ఆటో ఛార్జీలు కూడా రావని, ఇవేమి ధరలంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
గత నెల క్రితం వరకు బాక్స్ టమాటా ధర రూ. 700 వరకు పలికిందని, ప్రస్తుతం రూ. 50 లు కూడా పలకని పరిస్థితి ఉన్నట్లు రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. పంట దిగుబడి వచ్చిందని ఆశలు పెట్టుకుంటే, సరిగ్గా పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఉందని మార్కెట్ వద్ద రైతులు తెలుపుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని, అలాగే ధరలను కూడా స్థిరీకరణ చేయాలని వారు కోరుతున్నారు.
ఇది ఇలా ఉంటే కేజీ అర్ధ రూపాయికి మార్కెట్ లో విక్రయించడం కంటే, ప్రజలకు ఉచితంగా ఇచ్చినా పుణ్యం వస్తుందంటూ కొందరు రైతులు ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని అక్కడే కొనసాగించడం విశేషం. కరోనా కాలంలో కేజీ రూ. 200 కూడా టమాటా ధర ఇప్పుడు మాత్రం 50 పైసలకు పడిపోవడం చూస్తే.. ఉంటే అతివృష్టి లేకుంటే అనావృష్టి రీతిలో ఉందని రైతులు తెలుపుతున్నారు.
ఇదే పరిస్థితి ఏపీలోని పలు మార్కెట్ లలో ఉందని, వెంటనే ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే త్వరలోనే ఆందోళన బాట పట్టి టమాటా దిగుబడి మొత్తం, నేలపాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు రైతులు. అయితే ఇదే అదునుగా భావించిన ప్రజలు కూడా.. మార్కెట్ వద్దకు చేరుకొని కేజీలు, కేజీలు కవర్లలో తీసుకు వెళ్ళడం విశేషం. మరి రైతుల డిమాండ్స్ కి ప్రభుత్వ రిప్లై ఎలా ఉంటుందో వేచి చూడాలి.