Lady Aghori: రెండు తెలుగు రాష్ట్రాలలో వైరల్ గా మారిన అఘోరీ మాత, ఆత్మార్పణకు ప్రయత్నించారు. అది కూడా ఏకంగా శ్రీకాళహస్తిలో. ఏపీలో పర్యటిస్తున్న అఘోరీ మాత శ్రీకాళహస్తి రాగా, స్థానిక సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోగా వివాదం చెలరేగింది. దీనితో తన కారులో గల పెట్రోల్ క్యాన్ ఓపెన్ చేసి, శరీరంపై పెట్రోల్ పోసుకున్నారు. స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.
సోషల్ మీడియా ద్వారా వైరల్ గా మారిన అఘోరీ మాత తెలియనివారు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండరు. ఇటీవల కార్తీకమాసం సందర్భంగా ఏపీలోని అన్ని దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న అఘోరీ మాత, శ్రీకాళహస్తి ఆలయం వద్ద ఆత్మార్పణకు యత్నించారు. దీనితో పోలీసులు, స్థానికులు ఎట్టకేలకు అప్రమత్తమై, ఆ ప్రయత్నాన్ని నివారించారు.
అసలేం జరిగిందంటే…
ఏపీలోని ఆలయాలను దర్శిస్తున్న అఘోరిమాత శ్రీకాళహస్తి ఆలయానికి గురువారం చేరుకున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది మహిళా అఘోరీని ఆలయంలోకి అనుమతించకుండా అడ్డు తగిలారు. దీనితో కొద్దిసేపు సెక్యూరిటీ సిబ్బందికి అఘోరి మాతకు వాగ్వివాదం సాగింది. తాము ఇలా నేరుగా ఆలయంలోకి అనుమతించబోమని సెక్యూరిటీ సిబ్బంది తేల్చి చెప్పారు. ఈ వాగ్వివాదం సాగుతుండగా, ఆలయానికి వచ్చిన భక్తులు సైతం అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.
ఆత్మార్పణకు అఘోరీ మాత యత్నం..
సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వివాదం జరుగుతున్న సమయంలోనే, ఆత్మార్పణకు యత్నించారు అఘోరి మాత. తన కారులో ఉన్న పెట్రోల్ డబ్బాను తీసుకొని, ఒంటిపై వేసుకున్నారు. దీనితో ఒక్కసారిగా పోలీసులు సైతం అప్రమత్తమై, ఆత్మార్పణకు సిద్ధమైన అఘోరీ మాతను నివారించారు. వెంటనే నీటి డబ్బాను తీసుకువచ్చి, అఘోరి మాత కారుపై వేసి, దుస్తులను సైతం ధరింపజేశారు.
Also Read: Tirumala Updates: కార్తీకమాసం ఎఫెక్ట్.. తిరుమలకు భారీగా భక్తులు.. దర్శనానికి ఎన్ని గంటల సమయమంటే?
ఈ ఘటనపై ఆలయ సెక్యూరిటీ సిబ్బంది మాట్లాడుతూ.. అఘోరి మాత సాధారణంగా భక్తుల వలె స్వామి వారిని దర్శనం చేసుకుంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, కానీ అఘోరీ మాత వస్త్రధారణ పాటించకపోవడంతోనే తాము అడ్డు తగిలినట్లు వారి వాదన వినిపించారు. స్థానిక పోలీసులు సైతం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. ఈ వివాదం పై అఘోరిమాత కూడా స్పందిస్తూ.. తాను వైజాగ్ పర్యటనలో వస్త్రధారణ పాటించానని, అసలు విషయాన్నీ తెలపకుండా, తనను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నట్లు ఆరోపించారు. మొత్తం మీద ఆత్మార్పణయత్నానికి పాల్పడ్డ అఘోరిమాతను, స్థానిక పోలీసులు నివారించడంతో పెను ప్రమాదం తప్పింది.
చివరికి పోలీసులు వస్త్రధారణ చేయించి, అనంతరం వైద్యపరీక్షల నిమిత్తం అంబులెన్స్ లోకి ఎక్కించారు. అఘోరీ మాతను శ్రీకాళహస్తి దాటించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నట్లు సమాచారం.