Pastor Praveen Pagadala : పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. హత్యా? ప్రమాదమా? సహజ మరణమా? మూడు రోజులు అవుతున్నా డెత్ మిస్టరీ వీడలేదు. రాజమండ్రి టూ హైదరాబాద్.. మినిట్ టు మినిట్ హైటెన్షన్. పోస్ట్‌మార్టం నుంచి అంత్యక్రియల వరకూ.. అన్నిచోట్లా తీవ్ర ఉద్రిక్తత. క్రైస్తవ సంఘాలు ఏకమై ఆందోళన చేస్తున్నాయి. సోషల్ మీడియాలో మత విధ్వేశాలు రగులుతున్నాయి. సీఎం చంద్రబాబు సమగ్ర విచారణకు ఆదేశించారు. హోంమంత్రి అనిత ఆదేశాలతో కొవ్వూరు డీఎస్పీ ఆధ్వర్యంలో ఎంక్వైరీ నడుస్తోంది. వైసీపీ అధినేత జగన్ నిష్పాక్షిక విచారణకు డిమాండ్ చేశారు. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఎంట్రీ ఇచ్చారు. ఏపీ సర్కారు హైప్రయారిటీ బేస్డ్‌గా పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసును దర్యాప్తు చేస్తోంది.
చాలా సెన్సిటివ్ కేసు. చనిపోయింది పాస్టర్. చంపేశారనే ఆరోపణలు. తల తీసేస్తాం.. నరికేస్తామంటూ ప్రవీణ్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చేవని ఆయన పీఏ స్వర్ణలత చెబుతున్నారు. ఆ బెదిరించిన వాళ్లే చంపేశారని క్రైస్తవ వర్గాలు అనుమానిస్తున్నాయి.
సీసీకెమెరా ఫూటేజ్ కీలకమా?
మార్చి 24 రాత్రి 11.31కి కొవ్వూరు టోల్‌ప్లాజాను క్రాస్ అయినట్టు సీసీకెమెరాలో రికార్డ్ అయింది. 11.42కి ఓ పెట్రోల్ బంక్ సీసీఫూటేజ్‌లో ప్రవీణ్ బుల్లెట్‌ను ఓ 5 వాహనాలు క్రాస్ చేసి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ ఐదు వెహికిల్స్‌ను గుర్తిస్తే.. వారి నుంచి ఏదైనా సమాచారం దొరకొచ్చని పోలీసులు ఆ దిశగా ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్ టీమ్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకైతే నో క్లూ. పోస్ట్‌మార్టం రిపోర్ట్ మార్చి 29న రావొచ్చని చెబుతున్నారు. అది వస్తే కానీ.. కనీసం ప్రవీణ్ ఎలా చనిపోయారో తెలుస్తుంది.
సీబీసీఐడీ రంగంలోకి దిగాల్సిందేనా?
ప్రవీణ్ శరీరంపై గాయాలు ఉన్నాయంటున్నారు. ఆయన నడిపిన బుల్లెట్ బండి మాత్రం పెద్దగా డ్యామేజ్ కాలేదు. ప్రవీణ్ ఎలా చనిపోయారు? ఎవరైనా కారుతో గుద్దేశారేమో అంటున్నారు. ఇన్సిడెంట్ టైమ్ లో బుల్లెట్ పక్కనుంచి వెళ్లిన రెడ్ కలర్ కారును గుర్తిస్తే క్లారిటీ రావొచ్చు. ప్రస్తుతం డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో స్పెషల్ టీమ్ దర్యాప్తు చేస్తోంది. కేసు సున్నితత్వం దృష్ట్యా సీబీసీఐడీ విచారణ జరిపించాలనే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
Also Read : పాస్టర్ ప్రవీణ్‌ను చంపేశారు.. షర్మిల సంచలనం
ఇక, పాస్టర్ ప్రవీణ్ పగడాల చివరి చూపుల కోసం క్రైస్తవ సంఘాల నేతలు, ఆయన అనుచరులు, క్రైస్తవులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇది ముమ్మాటికీ హత్యనే అని ఆయా సంఘాలు ఆరోపిస్తున్నాయి. వరుస ఘటనలతో క్రైస్తవ సమాజం అభద్రతలో ఉందని అంటున్నారు. క్రిష్టియన్స్‌ను తక్కువ చూపు చూస్తున్నారని ఆ వర్గంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ మరణం వారిని మరింత కలిచివేస్తోంది. ఘటనపై సమగ్ర విచారణ జరగాలని.. మరణానికి కారణం తేల్చాలని కోరుతున్నారు. తమ పాస్టర్ లేరనే విషయం తెలిసి కన్నీళ్లు పెడుతున్నారు.
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై తీవ్ర విచారణ వ్యక్తం చేశారు వైసీపీ నాయకురాలు దివ్యవాణి. చంద్రబాబుపై తనకు నమ్మకం ఉందని.. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు ఆయన పనితీరును తాను చూశానని చెప్పారు. సీబీసీఐడీతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో న్యాయం జరుగుతుందని దివ్యవాణి విశ్వాసం వ్యక్తం చేశారు.