Amaravati: డ్రైవింగ్ లైసెన్స్ కోసం సామాన్యులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఎల్ఎల్ఆర్ నుంచి లైసెన్సు చేతికి వచ్చేవరకు అదొక పెద్ద సాహసం చేయాల్సి వుంటుంది. ఏ ఒక్కటి తప్పైనా మళ్లీ మొదటి నుంచి చేయాల్సిందే. ఇకపై ఎల్ఎల్ఆర్ పరీక్ష మరింత తేలిక చేసింది ఏపీ ప్రభుత్వం. ఇంటి నుంచి టెస్టుకు అటెండ్ కావచ్చు, అదెలా సాధ్యమని అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.
యువతీ యువకులకు ఏపీ రవాణా శాఖ శుభవార్త చెప్పింది. కొత్తగా డ్రైవింగ్ లైసెన్సు కావాలనుకుంటున్నారా? గతంలో మాదిరిగా ఎల్‌ఎల్‌ఆర్-లైర్నర్స్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఆర్టీవో ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. అందుకోసం ఇంటి దగ్గర నుంచి ఆన్‌లైన్‌లో పరీక్ష రాయవచ్చు. ఈ విధానాన్ని కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. ఎల్ఎల్ఆర్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు కొన్ని నిబంధనలు పాటిస్తే చాలు. కొత్త విధానం ద్వారా ఎలాంటి అక్రమాలు జరగవని చెబుతున్నారు అధికారులు.
తొలుత ఎల్ఎల్ఆర్ కోసం sarathi.parivahan.gov.in పోర్టల్‌కి వెళ్లాలి. అందులో రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత ఆధార్ వివరాలు నమోదు చేసి నంబర్ లింక్ చేసి ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ఎల్ఎల్ఆర్ అప్లికేషన్ జనరేట్ అవుతుంది. ఆ తర్వాత కెమెరా ఉన్న కంప్యూటర్, ల్యాప్‌టాప్ వద్ద ఇంటి నుంచి అప్లికేషన్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత మొబైల్ ఫోన్‌కు వచ్చిన నంబరుకు పిన్ ఎంటర్ చేయాలి. కూర్చొని ఆన్‌లైన్‌లో పరీక్ష రాయవచ్చు. ఇచ్చిన ప్రశ్నల్లో కనీసం 112 ప్రశ్నలకు సమాధానాలు కరెక్టుగా రాస్తే పాసవుతారు. క్షణాల వ్యవధిలో ఎల్ఎల్ఆర్ జారీ చేస్తుంది రవాణా శాఖ.
ఎల్ఎల్ఆర్ కోసం ఇంటి దగ్గర నుంచి పరీక్ష రాయడం నార్మల్ విషయం కాదు. ప్రతీ విషయాన్ని కెమెరా ద్వారా రవాణా శాఖ అధికారులు గమనిస్తారు. తల ఏమాత్రం పక్కకు తిప్పినా, ఎవరి మాటైనా వినిపించినా ఫెయిలైపోతారు. ఐపీ అడ్రస్‌తో ఒక రోజుకు ఇద్దరు పరీక్ష రాయాలి. ఆధార్ అథంటికేషన్ సరిపడకపోతే ఆర్టీవో కార్యాలయానికి వెళ్లాల్సిందే. ఆధార్, ఈ-కేవైసీ చేయకపోయినా తప్పకుండా ఆర్టీవో ఆఫీసుకు వెళ్లాలి.
ALSO READ: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. రాగల 12 గంటల్లో ఏపీకి వర్షసూచన
సమీపంలోని గ్రామ, స్వర్ణ వార్డు సచివాలాయలకు వెళ్లి ఎగ్జామ్ పూర్తి చేయవచ్చు. పరీక్షకు ముందు సారథి పోర్టర్‌లో మాక్ టెస్ట్ రాసే అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఎల్‌ఎల్‌ఆర్ తీసుకున్నవారు 6 నెలలలోపు డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్‌టీవో ఆఫీసులో ట్రాక్‌పై డ్రైవింగ్ టెస్ట్ చేయాల్సి వుంటుంది. దేశంలో 26 రాష్ట్రాల్లో కొత్త విధానం అమలు చేస్తోంది. ఏపీలో కొత్త విధానం ఆదివారం నుంచి మొదలైంది.