
Tirumala : తిరుమలలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపుతోంది. చంద్రగిరి మండలంలోని శ్రీవారిమెట్టు మార్గంలో చిరుతను సోమవారం సాయంత్రం భక్తులు గుర్తించారు. వేగంగా రోడ్డు దాటుతున్న చిరుతను పులివెందులకు చెందిన భక్తులు చూశారు.దీంతో తీవ్ర భయాందోళనకు గురవయ్యారు. ఆ తర్వాత తేరుకుని టీటీడీ సెక్యూరిటీ అధికారులకు సమాచారం ఇచ్చారు.
చిరుత సంచారంపై టీటీడీ అధికారుల అప్రమత్తమయ్యారు. కాలినడక భక్తులను గుంపులుగా అనుమతిస్తున్నారు. వాటర్ హౌస్ వద్ద భక్తులను నిలిపివేస్తున్నారు. అక్కడ నుంచి గుంపులుగా పంపుతున్నారు. చిరుత సంచారంతో శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్నారు.
కొద్ది రోజుల క్రితం చిరుత దాడిలో చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోయింది. ఆ అంతకుముందు ఓ బాలుడిపైనా దాడి చేసింది. ఆ రెండు ఘటనల తర్వాత టీటీడీ అధికారులు ఫారెస్ట్ సిబ్బంది సహాయంతో ఆపరేషన్ చిరుతను చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో 6 చిరుతలను బంధించారు. దీంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు భక్తులు. అయితే మరోసారి చిరుత సంచారంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
.
.
.