
Taneti Vanitha news(Breaking news in Andhra Pradesh) :
దళిత యువకుడు బొంతు మహేంద్ర ఆత్మహత్యతో తూర్పు గోదావరి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఫ్లెక్సీ వివాదంలో పోలీసుల విచారణతో మనస్తాపానికి గురైన మహేంద్ర అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన హోంమంత్రి తానేటి వనిత ఇలాఖాలో జరిగింది. అయితే,.. బాధిత కుటుంబాన్ని పరామర్శించి.. వారికి పరిహారం ఇచ్చేందుకు వెళ్లిన వనితను స్థానికులు అడ్డుకున్నారు. ఆమెకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఘోరావ్ చేశారు. మహేంద్రను పోలీసులు అక్రమంగా నిర్భంధించారని చెప్పినా పట్టించుకోలేదని.. ఒకవేళ స్పందించి ఉంటే మహేంద్ర ప్రాణాలు పోయేవి కాదని హోమంత్రిపై మండిపడ్డారు. ఆమెను రోడ్డుపైనే నిలిపేశారు.
ఈ క్రమంలో పోలీసులు వారిని నిలువరించేందుకు ప్రయత్నించగా.. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్థానికులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు విసరడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఉద్రిక్తత కారణంగా తానేటి వనిత అక్కడే ఆగిపోగా.. మంత్రి మేరుగు నాగార్జున, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావులు వెళ్లి బాధిత కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.
ఈ నెల 6వ తేదీన కొవ్వూరు మండలం దొమ్మేరులో గడప గడపకు కార్యక్రమం సందర్భంగా వైసీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే.. ఫ్లెక్సీలో పార్టీ నేతలు నాగరాజు, సతీష్ ముఖాలను కత్తిరించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా ఈ నెల 13న దొమ్మేరుకు వెళ్లిన ఎస్‌ఐ భూషణం మహేంద్రను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి నిర్బంధించారు. దీంతో అవమానంగా భావించిన మహేంద్ర పురుగుల మందు తాగాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు .