Ramprasad Reddy: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయం కాకరేపుతోంది. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, వారి వైఖరిపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతిలో విలేకరులతో మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రతిపక్షం తీరును ఘాటుగా విమర్శించారు.
వైసీపీ వైఫల్యాలు, కోర్టు డ్రామాలు
ప్రజల్లోకి వెళ్లి పనిచేసే సత్తా వైసీపీకి లేదని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల మద్దతు కోల్పోవడంతోనే ఆ పార్టీ నేతలు నిరంతరం కోర్టుల చుట్టూ తిరుగుతూ ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి సిద్ధపడటంతో ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు కోర్టులను ఆశ్రయిస్తున్నారని, బీసీల సంక్షేమం, రాజకీయ సాధికారతపై ఆ పార్టీకి ఎన్నడూ చిత్తశుద్ధి లేదని స్పష్టం చేశారు.
బీసీల సాధికారత, రాజ్యాంగ హక్కులు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీకి కట్టుబడి, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని మంత్రి తెలిపారు. వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించడంతో పాటు వారికి ప్రాతినిధ్యం పెంచడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు.
అభివృద్ధి వేగవంతం, నిధుల సమీకరణ
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే నిలిచిపోయిన 15వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి విడుదలయ్యాయని మండిపల్లి పేర్కొన్నారు. పల్లె పండుగ-3.0 కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, పేదల ఇళ్ల నిర్మాణంతో పాటు సుమారు లక్ష కోట్లతో హార్టికల్చర్ రంగాన్ని పురోగతి పథంలోకి తీసుకెళ్తున్నామని వివరించారు.
స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం
రాష్ట్రంలో ఎప్పుడు స్థానిక ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు కూటమి భాగస్వామ్య పక్షాలు సంపూర్ణ సిద్ధంగా ఉన్నాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. వార్డు స్థాయి నుంచి మేయర్ స్థాయి వరకు, అలాగే అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూటమి జెండా ఎగురవేస్తామని స్పష్టం చేశారు. స్థానిక పోరులో సాధించే చారిత్రాత్మక విజయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బహుమతిగా అందిస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
Also Read: హోంగార్డు ఉద్యోగాల పేరుతో రూ.6.95 లక్షలు స్వాహా.. కేటుగాడు అరెస్ట్!