Home Guard Fraud: ఉద్యోగం వస్తుందన్న ఆశను ఆసరాగా చేసుకుని, అమాయకుల నుంచి లక్షలాది రూపాయలు కాజేసిన ఒక నకిలీ హోంగార్డు భాగోతం తిరుపతిలో వెలుగుచూసింది. ఉద్యోగాల పేరిట రూ.6.95 లక్షలు వసూలు చేసి, చేతులు దులుపుకోవాలని చూసిన నిందితుడిని అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగింది?
నెల్లూరు జిల్లా చేజర్ల మండలం మడపల్లికి చెందిన గుండుబోయన నరేష్, తాను నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డుగా పనిచేస్తున్నట్లు బాధితులకు పరిచయం చేసుకున్నాడు. హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి, తిరుపతికి చెందిన లోకేష్ అనే వ్యక్తి నుంచి రూ.4.95 లక్షలు, సత్తి అనే మరొకరి నుంచి రూ.2 లక్షలు వసూలు చేశాడు. డబ్బులు తీసుకున్నాక, వారి చేతిలో నకిలీ అపాయింట్‌మెంట్ ఉత్తర్వులు పెట్టి పరారయ్యాడు.
విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు
అపాయింట్‌మెంట్ లెటర్లు నకిలీవని తేలడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు, అక్టోబర్ 2న తిరుపతిలోని అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ క్రమంలో నిందితుడు నరేష్ గత ఏడాది కాలంగా విధులకు గైర్హాజరవుతున్నట్లు తేలింది. అంతేకాకుండా, ఇతను గతంలో కూడా పలువురిని ఉద్యోగాల పేరుతో మోసం చేసి డబ్బులు గుంజినట్లు విచారణలో వెల్లడైంది.
నిందితుడు అరెస్ట్ ..
ప్రస్తుతం అలిపిరి పోలీసులు నిందితుడు నరేష్‌ను అరెస్టు చేసి, ఈ రాకెట్‌లో మరికొందరి ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. నిరుద్యోగులు ఇలాంటి ముసుగు వీరుల మాటలు నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Also Read: సామీ.. జీతాలు చెల్లించండి! GHMC అధికారులను నిలదీసిన బీఎంఎస్ నేతలు