Mega DSC notification: ఏపీలో నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఏప్రిల్ మొదటివారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామన్నారు. స్కూళ్లు రీఓపెన్‌లోగా నియామకాలు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణతో డీఎస్సీ భర్తీ చేస్తామన్నారు సీఎం. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో చంద్రబాబు మాట్లాడారు.
మేలో తల్లికి వందనం ఇస్తామన్నారు చంద్రబాబు. త్వరలోనే విధి విధానాలు ప్రకటస్తామని చెప్పారు. ఎంత మంది పిల్లలున్నా ఇస్తామన్నారు. అలాగే రాష్ట్రాన్ని పునర్మించే ప్రక్రియ చేపట్టాం అన్నారు. సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలన ప్రజలకు అందాలని తెలిపారు. ప్రజలు ఆనందంగా ఉండాలంటే.. సంక్షేమ కార్యక్రమాలు తప్పవు అని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు జరగాలంటే.. రెవెన్యూ కావాలని చెప్పారు. సమస్యల పరిష్కారంలో కలెక్టర్లది కీలక పాత్ర అని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ ఫైల్ పై సైన్ చేసినట్టుగా సీఎం గుర్తు చేశారు. ఏప్రిల్ మొదటి వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణతో డీఎస్సీ భర్తీ చేస్తామన్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కలెక్టర్లు పరీక్షను పర్ఫెక్టుగా నిర్వహించాలని సూచించారు. రెండ్రోజులపాటు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. దాంతో పాటు గ్రామాలు, పట్టణాల్లో నీటి సరఫరా, ఆదాయ మార్గాలు, రెవెన్యూ సమస్యలపై కీలక సూచనలు చేశారు.
టీచర్ పోస్టులలో.. మెజారిటీ పోస్టులు టీడీపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినవేనని చంద్రబాబు తెలిపారు. టీచర్ జాబ్స్ 80 శాతం టీడీపీ ప్రభుత్వాలు ఉన్నప్పుడే భర్తీ చేసినవని చెప్పారు. మెగా డీఎస్సీ ప్రక్రియ ఏప్రిల్లో ప్రారంభమై.. జూన్ నెలలో పాఠశాలలు ప్రారంభించేలోగా ట్రైనింగ్ పూర్తి చేసి ఆతర్వాత పోస్టింగులు ఇస్తామని తెలిపారు.
కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి విడుదల చేయనున్న మెగా డీఎస్సీ నోటికేషన్‌లో.. ఎస్‌జీటీ 6,371 పోస్టులు, పీఈటీ 132 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్స్ 7725 పోస్టులు, టీజీటీ 1781 పోస్టులు, పీజీటీ 286 పోస్టులు, ప్రిన్సిపల్స్ పోస్టులు 52 ఉండనున్నాయి.
మరోవైపు.. పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు ఆర్ధిక భారం పడకుండా చూడాలన్నారు సీఎం చంద్రబాబు. అందుకు ఆపరేషన్ మోడల్‌లో నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. గోదావరి జలాలను పోలవరం నుంచి లిఫ్టుల ద్వారా తరలించేందుకు విద్యుత్ అవసరం ఉంటుంది. ప్రాజెక్టు ప్రాంతంలోనే పంప్డ్ స్టోరేజ్, సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పడం ద్వారా ఉత్పత్తి చేసి భారం తగ్గించవచ్చని చెప్పారు. దీనిపై సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు ఈ ఏడాది జూన్ 20 నాటికి పూర్తి చేయాలన్నారు. అక్టోబర్ 20 కల్లా ప్రాజెక్టుకు CWC ఆమోదం పొందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పర్యావరణ అనుమతులు కూడా పొంది, త్వరగా పనులు ప్రారంభించాలని చెప్పారు.
Also Read: వైసీపీకి మరో షాక్.. కూటమికే విశాఖ మేయర్ పీఠం?
పోలవరం-బనకచర్ల అనుసంధానానికి మొత్తం 81 వేల 9 వందల కోట్ల రూపాయలు ఖర్చుకానుంది. ఈ అనుసంధానం ద్వారా రోజుకు 2 TMCలు డిశ్చార్జ్ అవుతుంది. 368 కిలోమీటర్లు ఓపెన్ కెనాల్ ద్వారా నీరు తరలిస్తారు. మెయిన్ టన్నెల్ 20.50 కిలోమీటర్లు ఉండగా, సిద్ధాపురం జంట టన్నెల్స్ 6.60 కిలోమీటర్లు, పైపులైను 17 కిలోమీటర్ల వరకు నిర్మిస్తారు. ఇందుకోసం మొత్తం 9 లిఫ్ట్‌లు వినియోగిస్తారు. 3 వేల 3 వందల 77 మెగావాట్ల విద్యుత్ అవసరం కానుంది. ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు 15 వేల 3 వందల ఎకరాల అటవీ భూమితో కలిపి.. మొత్తం 54 వేల ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది. అలాగే బొల్లాపల్లి రిజర్వాయర్ కోసం 5 గ్రామాల్లో 18 నివాస ప్రాంతాల వారికి పునరావాసం కల్పించాల్సి ఉంది. ఈ అనుసంధాన ప్రక్రియను ప్రభుత్వం మొత్తం 3 సెగ్మెంట్లుగా చేపట్టనుంది.
పోలవరం-బనకచర్ల అనుసంధానం పూర్తయితే రాష్ట్రానికి ఎన్నో లాభాలు కలుగనున్నాయి. మొత్తం 12.4 లక్షల హెక్టార్లకు సాగునీరు అందుతుంది. కాలువ ప్రవహించే సుమారు 400 కిలోమీటర్ల పొడవునా ఉన్న గ్రామాలకు తాగునీటి సమస్య తీరడంతో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయి. అలాగే 430 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. బొల్లాపల్లి రిజర్వాయర్‌లో మత్స్య సంపద.. ఇలా వివిధ మార్గాల్లో ఏడాదికి రూ.12 వేల 294 కోట్ల సంపదను సృష్టించవచ్చని అధికారులు అంచనా వేశారు.