Rishabh Pant: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 లో భాగంగా సోమవారం రోజు రాత్రి విశాఖపట్నంలో నువ్వా నేనా అన్నట్టు సాగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక వికెట్ తేడాతో లక్నో సూపర్ జెంయిట్స్ పై విజయం సాధించింది. ఇప్పటివరకు ఐపీఎల్ లో జరిగిన మూడు మ్యాచ్లు ఏకపక్షంగా సాగగా.. ఢిల్లీ – లక్నో మ్యాచ్ మాత్రం ఉత్కంఠగా సాగింది.
ఏ మాత్రం ఆశ లేని స్థితిలో పెద్దగా పేరు తెలియని అశుతోష్ వర్మ, విప్రాజ్ నిగమ్ లు సంచలన బ్యాటింగ్ తో ఢిల్లీకి మరపురాని విజయాన్ని అందించారు. అలాగే భారీ తేడాతో గెలవబోతున్నామని భావించిన లక్నో చేజేతులా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో పూరన్ {75}, మిచెల్ మార్ష్ {72} పరుగులతో మెరుపు బ్యాటింగ్ చేశారు.
అనంతరం 210 పరుగుల లక్ష్య చేదనకు దిగిన ఢిల్లీ 19.3 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసి గెలుపొందింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అశుతోష్ శర్మ {66*} ఒంటరి పోరుతో అద్భుత బ్యాటింగ్ చేసి జట్టును గెలిపించాడు. లక్నో బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి క్రీజ్ లో పాతుకుపోయాడు. అయితే ఈ మ్యాచ్ లో లక్నో ఒక వికెట్ తేడాతో ఓడిపోవడంతో.. ఈ ఓటమికి ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ కారణమని పలువురు నెటిజెన్లు విమర్శిస్తున్నారు.
అతడు బ్యాటింగ్ లో డక్ అవుట్ అయ్యాడని, ఢిల్లీ చేతిలో ఒక వికెట్ ఉన్నప్పుడు మోహిత్ శర్మ స్టంపింగ్ ని మిస్ చేశాడని, కెప్టెన్సీ లోను విఫలమయ్యాడు అంటూ పోస్టులు చేస్తున్నారు. మ్యాచ్ అనంతరం లక్నో ఓనర్ సంజీవ్ గోయేంకా.. రిషబ్ పంత్ తో కాసేపు మాట్లాడాడు. దీంతో వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో లక్నో ఓనర్ అప్పటి కెప్టెన్ కేఎల్ రాహుల్ మీద ప్రవర్తించిన తీరు కూడా వైరల్ గా మారిన విషయం తెలిసిందే.
అచ్చం అలానే ఇప్పుడు మరోసారి రిషబ్ పంత్ తో లక్నో ఓనర్ చర్చిస్తున్న ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే ఈ మ్యాచ్ లో ఓటమి పై లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మ్యాచ్ అనంతరం స్పందించాడు. తాము ఒత్తిడికి గురయ్యామని, ఈ ఓటమి నుండి గుణపాఠం నేర్చుకుంటామని పేర్కొన్నాడు. ” మా టాప్ ఆర్డర్ బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. ఈ వికెట్ పై మేము చేసిన స్కోరు సరిపోతుందని భావించాము.
ఇక ఓ జట్టుగా మేము ప్రతి మ్యాచ్ నుండి సానుకూల అంశాలను తీసుకోవాలని చూస్తున్నాం. ఆరంభంలో ఢిల్లీ వికెట్లు తీశాము. అయినప్పటికీ ఈ పిచ్ పై బ్యాటింగ్ చేయడం సులువు అని మాకు తెలుసు. రెండు కీలక భాగస్వామ్యాలు ఢిల్లీకి దక్కాయి. అశుతోష్, స్టబ్స్, మరో ఆటగాడు విప్రజ్ చాలా బాగా ఆడారు. మోహిత్ శర్మని స్టంప్ అవుట్ చేసే అవకాశం చేజారింది. అయితే ఆటలో ఇవన్నీ సహజం. వీటిని దృష్టిలో పెట్టుకొని మెరుగైన క్రికెట్ ఆడేందుకు ప్రయత్నం చేయాలి” అని చెప్పుకొచ్చాడు.