Ananam Narayana on YS Jagan : తిరుపతిలో క్షతగాత్రుల్ని పరామర్శించేందుకు వెళ్లి.. రాజకీయాలు మాట్లాడారని, ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఏపీ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి. ఓ పక్క క్షతగాత్రులు ఆసుపత్రుల్లో ఇబ్బందులు పడుతుంటే.. వారి దగ్గరకు వెళ్లి డబ్బులు పంచి ప్రభుత్వాన్ని విమర్శించమని చెప్పారంటూ సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ నేతల డబ్బుల పంపకాలు సీసీ టీవీల్లో రికార్డ్ అయ్యాయి అని మంత్రి ఆనం వెల్లడించారు.
వైకుంఠ ద్వార దర్శన టికెట్లో క్యూ లైన్లల్లో తొక్కిసలాటలో గాయపడిన క్షతగాత్రుల్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుపతిలోని రిమ్స్ ఆసుపత్రిలో సందర్శించారు. ఈసందర్భంగా.. ఘటనకు పూర్తి బాధ్యులు చంద్రబాబు నాయుడే అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది అని ఆరోపించిన జగన్.. అనేక రాజకీయ విమర్శలకు దిగారు. ఈ విమర్శలపై.. టీడీపీ నాయకుడు, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. జగన్ స్విమ్స్ పర్యటన, క్షతగాత్రుల పరామర్శ అంశంపై సంచలన ఆరోపణలు చేశారు.
జగన్ పరామర్శకు ముందు ఆసుపత్రిలో బాధితులకు డబ్బుల కవర్లు ఇచ్చి చంద్రబాబును తిట్టాలని చెప్పారన్న మంత్రి ఆనం..డబ్బుల కవర్లు ఇస్తున్న దృశ్యాలు ఆసుపత్రి సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయంటూ ఆరోపణలు చేశారు. జగన్ చుట్టూ ఉండే దుష్ట చతుష్టయంలోని సభ్యులు ఈ పని చేశారంటూ విమర్శించారు. అలాంటి వ్యక్తుల వల్లే జగన్ ఘోరంగా ఓడిపోయారని, మళ్లీ అలాంటి నాయకుల్ని వెంటబెట్టుకుని తిరగడం సిగ్గుచేటు అంటూ ఆగ్రహించారు.
రాష్ట్రంలో ఏదైనా సంఘటన జరిగినప్పుటు.. అధికార, ప్రతిపక్షాలు అక్కడికి వెళ్లడం, బాధితుల్ని పరామర్శించడం జరుగుతుందని.. అందులో తప్పేమి లేదన్నారు. కానీ.. పని కట్టుకుని బాధితులకు డబ్బులు ఇచ్చి అధికార పక్షాన్ని తిట్టించడం ఏంటని ప్రశ్నించారు. కవర్లు ఇచ్చి ముఖ్చమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడమని చెప్పిన విషయాన్ని అక్కడి డాక్టర్లు, సిబ్బంది కూడా గుర్తించారని వెల్లడించారు.
తిరుమల దేవస్థానాన్ని వైసీపీ హయంలో భ్రష్టుపట్టించిన నలుగురు వ్యక్తులే నిన్న జగన్ తో ఉన్నారని విమర్శించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.. జగన్ అసుపత్రికి వెళ్లేసరికి ఆసుపత్రిలో 18 మంది ఉన్నారన్నారు. జగన్ వెంట ఉన్న దుష్ట చతుష్టయంలోని ఒకరు జగన్ కంటే ముందు ఆసుపత్రి లోపలికి వెళ్లి.. ఈ తప్పుడు పనికి పాల్పడ్డారని ఆరోపించారు.
ఏం జీవితాలు అయ్యా మీవి? ఈ మానవ సమాజంలో ఉండదగిన వాళ్లేనా మీరు అంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తిత్వమున్న వాళ్లు మృగాల మధ్య పెరగాల్సిన వాళ్లని, రాష్ట్ర ప్రజల కర్మకాలి సమాజంలో తిరుగుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఓ పక్క చనిపోయిన వాళ్లు, మరో పక్క క్షతగాత్రులు బాధపడుతుంటే.. శవాల మధ్య పేలాలు వేరుకున్నారంటూ దుయ్యబట్టారు.
రిమ్స్ ఆసుపత్రి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి తిరుమల నెయ్యి గురించి మాట్లాడారని.. గత వైసీపీ ఐదేళ్ల పాలనలో అన్ని దేవాలయాల్లో నాణ్యత లేని పదార్థాలను వినియోగించారంటూ ఆగ్రహించారు. పవిత్రమైన దేవాలయ ప్రసాదాలను అపవిత్రం చేశారంటూ విమర్శించారు. తిరుమలలో నెయ్యి కల్తీ విషయాన్ని బయటపెట్టిందే కూటమి ప్రభుత్వమని.. అలాంటిది తమ ప్రభుత్వంపై జగన్ ఏమని ఆరోపించగలడని అన్నారు.
Also Read : రద్దీ గురించి తెలిసినా ఎందుకు జాగ్రత్త పడలేదు.. తొక్కిసలాటకు కారణాలివే అంటున్న జగన్..
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో అన్న ప్రాసాదాలు, లడ్డు నాణ్యతను ఎంత మెరుగుపరిచామో భక్తుల్ని అడిగితే తెలుస్తుందని అన్నారు. భక్తుల మనోభావాలు కాపాడుతామని, సామాన్య భక్తులకు శ్రీవారిని చేరువ చేస్తామంటూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు.