YS Jagan Tirupati Visit : ఎంతో విశిష్టమైన వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలలో స్వామి వారి దర్శనం టికెట్ల కోసం ఎన్ని వేల మంది ప్రజలు వస్తారో టీటీడీ తో సహా అధికార యంత్రాంగం మొత్తానికి తెలుసని.. అలాంటప్పుడు ఎందుకు సరైన జాగ్రత్తలు తీసుకోలేదని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కారణంగానే జరిగిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన బాధితుల్ని పరామర్శించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.
వైకుంఠ ఏకాదశి దర్శనాలకు ఎన్ని లక్షల మంది వస్తారని అందరికీ తెలుసని.. అలాంటి దర్శనం టికెట్ల కోసం పోటీ సైతం అంటే ఉంటుందని తెలిపారు. ఈ విషయం.. ఎవరికీ కొత్త కాదని.. అలాంటప్పుడు ప్రమాదం ఎందుకు జరిగిందని అడిగారు. టీడీడీ కౌంటర్ల దగ్గర పోలీస్ భద్రత, ప్రోటోకాల్ నిబంధనల్ని ఎందుకు పాటించలేదని ప్రశ్నించారు.
ఓ ముఖ్యమైన కార్యక్రమానికి భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన జిల్లా యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు తన వెంట తిప్పుకున్నారని.. ఆయన 6, 7, 8 తేదీల్లో కుప్పంలో పర్యటించడంతో అధికారులంతా ఆయన భద్రతా ఏర్పాట్లు చేయడంతోనే సరిపోయిందని వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు.. ఈ ఘటనకు కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు, భద్రతా చర్యలు చేపట్టకుండానే టికెట్లను జారీ చేసేందుకు ప్రయత్నించడంతో.. ఈ ప్రమాదం చోటుచేసుకుందని అన్నారు.
ప్రమాదం జరిగిన తర్వాత కూడా.. ప్రభుత్వం, పోలీసులు సరైన వివరాలు అందించడం లేదని ఆగ్రహించిన వైసీపీ అధినేత జగన్.. విష్ణు నివాసం దగ్గర, బైరాగిపట్టెడ రెండు చోట్ల ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ప్రమాదానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి టీటీడీ అధికారులు, చైర్మన్లు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వారితో పాటు.. ఈ ఘటనకు కారకులుగా.. జిల్లా ఎస్పీ, కలెక్టర్, రెవెన్యూ సిబ్బందిని చేర్చాలని.. వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
అధికారులకు, టీటీడీ పాలక మండలి సభ్యులకు.. ముఖ్యమైన రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన లేకపోయిందన్నారు. సామాన్య భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి, ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేయాలని కనీస బాధ్యత లేకుండా వ్యవహరించడం దారుణమన్నారు. క్యూలైన్లల్లో గంటలకు కొద్దీ నిలబడ్డ సామాన్యులకు కనీసం మంచినీళ్లు, మజ్జిగ వంటివి కూడా సరఫరా చేయలేదని, వారిని పూర్తిగా గాలికొదిలేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ హయంలో బాగా చేశాం
గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి కార్యక్రమాలు గొప్పగా నిర్వహించామంటూ తెలిపిన మాజీ సీఎం జగన్.. తమ హయాంలోనే సామాన్య భక్తులందరికీ చాలా జాగ్రత్తగా, భద్రంగా చూశామంటూ తెలిపారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని.. ప్రస్తుత ఘటనకు ప్రధాన ముద్దాయి ప్రభుత్వమే అని ఆరోపించారు. చనిపోయిన ప్రతి ఒక్కరికి కనీసం రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని, తీవ్రంగా గాయపడిన వారందరికీ ప్రభుత్వం తరఫున వారికి రూ. 5 లక్షలు పరిహారం అందించాలని, వారికి వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు.
Also Read : తిరుమల సాక్షిగా పవన్ సీరియస్ వార్నింగ్.. ఇకపై ఆ విధానం పూర్తిగా రద్దు చేయాల్సిందే..
ఈ మొత్తం ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీటీడీ చైర్మన్, ఈవో, డిప్యూటీ ఈవో.. లను బాధ్యులుగా చేయాలన్నారు. తిరుమల పవిత్రతను, తిరుమల గౌరవాన్ని నీరుగార్చే ఇలాంటి ప్రయత్నాలు జరగడం దారుణమన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి.. దోషులందరినీ శిక్షించాలని డిమాండ్ చేశారు.