Bhupal Reddy: కర్నూలు జిల్లా బనగానపల్లెలో చోటుచేసుకున్న ఏఆర్ కానిస్టేబుల్ పై దాడి ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. దేవాలయం ప్రాంగణంలో భద్రతా విధుల్లో నిమగ్నమైన ఏఆర్ కానిస్టేబుల్‌పై ఏపీ రోడ్లు, భవనాలశాఖ మంత్రి బీజీ జనార్ధన్ రెడ్డి సోదరుడు బీసీ మదన భూపాల్ రెడ్డి చేయి చేసుకోవడం పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరైన చోట, ఒక ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుడు శాంతిభద్రతల పరిరక్షణలో ఉన్న పోలీసుని బెదిరించడం, దౌర్జన్యం చేయడం హేయమైన చర్యగా చెబుతున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అక్కడ ఏఆర్ కానిస్టేబుల్ తన విధుల్లో తలమునకగా ఉన్నాడు. ఈ క్రమంలో మదన భూపాల్ రెడ్డి అక్కడికి చేరుకోగా, రద్దీ కారణంగా ఆలయ ప్రాంగణంలో ప్రవేశానికి కొంత ఆలస్యం అయినట్లు సమాచారం. దీనిపై ఆగ్రహించిన ఆయన, కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నాడు. ఈ చర్యను చూసిన భక్తులు, స్థానికులు ఆశ్చర్యపోయారు. ఆ స్థానికతలో ఇది పెద్ద దుమారం రేపింది.
ప్రజాప్రతినిధుల వైఖరిపై విమర్శలు:
ఈ ఘటనలో మంత్రి సోదరుడి వైఖరిపై ప్రజలు, రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. “ఈ ఘటన కూటమి ప్రభుత్వ తీరుకు నిదర్శనమా?” అనే చర్చ మొదలైంది. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారనే విమర్శలు న్యాయసమ్మతంగా వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన నాయకులు ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి పోలీసులు, అధికారులు, సాధారణ ప్రజలపై కూడా చేతులు వేసే స్థాయికి దిగజారారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నా పోలీసు శాఖ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన వినిపించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకే రక్షణ లేకపోతే, సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి?” అనే ప్రశ్నలు మొదలయ్యాయి. పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఈ ఘటనపై తక్షణమే విచారణ చేపట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.