Kondapalli Srinivas: వైఎస్సార్‌సీపీ పూర్తి అవాస్తవాలతో కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు, యువతలో అపోహలు సృష్టించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. విజయనగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం , మాజీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
పారదర్శకతకు నిదర్శనం మెగా డీఎస్సీ
ఉమ్మడి రాష్ట్రంలోనైనా, నవ్యాంధ్రలోనైనా ఉపాధ్యాయ ఉద్యోగాల సృష్టికర్త అంటే చంద్రబాబు నాయుడే గుర్తుకొస్తారని మంత్రి తెలిపారు. ఆయన గతంలో 9 సార్లు డీఎస్సీ నిర్వహించి 1.80 లక్షలకు పైగా టీచర్ ఉద్యోగాలు సృష్టించారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపైనే తొలి సంతకం పెట్టి, మాట ప్రకారం 16 వేల పోస్టులను భర్తీ చేసిందని చెప్పారు. ఈ భర్తీని అడ్డుకోవడానికి గత పాలకులు 230కి పైగా కేసులు వేసినప్పటికీ.. ఆన్సర్ షీట్లు, ఫలితాలు, ఎంపిక జాబితాలను ఆన్‌లైన్‌లో ఉంచి పారదర్శకత నిరూపించుకున్నామని తెలిపారు.
జగన్‌ను వైసీపీ ఎందుకు ప్రశ్నించలేదు..?
విజయనగరం జిల్లాలోనే 583 మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించారని, ఎంత పారదర్శకంగా జరిగిందో వారిని అడిగితే తెలుస్తుందన్నారు. ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా, 8 వేల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన జగన్‌ను వైసీపీ నేతలు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. వోక్స్‌వ్యాగన్ వ్యవహారంతో రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసి ఆ ప్రాజెక్ట్ మహారాష్ట్రకు వెళ్లేలా చేసిన బొత్స, తన స్థాయికి తగినట్టు గౌరవప్రదంగా మాట్లాడాలని, తక్షణమే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రేపు వైఎస్సార్‌సీపీ తలపెట్టిన ధర్నాను ప్రజలు తిరస్కరిస్తారని స్పష్టం చేశారు.
భోగాపురం విమానాశ్రయ ఏర్పాట్లు..
భోగాపురం అంతర్జాతీయ హరిత విమానాశ్రయం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా 3 లక్షల మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాకపోకలు, ట్రాఫిక్, ఆహార వసతుల్లో ఎక్కడా లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈ ఎయిర్‌పోర్ట్ రాకతో విశాఖ-ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఐటీ, ఫార్మా, బయోటెక్నాలజీ, స్టీల్, ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్లు మరింత వృద్ధి చెంది వేలాదిమంది స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. భూసేకరణ నిర్వాసితులకు సంబంధించి వైజాగ్ ట్రైబ్యునల్‌లోని 20 కేసుల పరిష్కారానికి జడ్జి నియామకం పూర్తయిందని పేర్కొన్నారు. హైకోర్టులోని 50 కేసులను కూడా వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
Also Read: సింగరేణిని నాశనం చేశారు.. KCR, కాంగ్రెస్‌లపై విరుచుకుపడ్డ కిషన్ రెడ్డి!