AP Mid Day Meal: ఏపీ కూటమి ప్రభుత్వం మరో శుభవార్తను చెప్పింది. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నారా లోకేష్.. తాజాగా విద్యార్థులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్థాయి వరకు మధ్యాహ్న భోజనం పథకం అమలవుతున్న నేపథ్యంలో, ఈ పథకానికి సంబంధించి తాజాగా మరో నిర్ణయాన్ని నారా లోకేష్ తీసుకున్నారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఎందరో విద్యార్థులకు మేలు చేకూర్చాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.
ఏపీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్థాయి వరకు మధ్యాహ్న భోజనం పథకం విజయవంతంగా అమలవుతోంది. ప్రాథమిక స్థాయిలో డ్రాపౌట్స్ పెరగకూడదన్న నిర్ణయంతో ఈ పథకంను ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయి. పేదరికం కారణంగా బాల బాలికలు, పాఠశాలకు వెళ్లకుండా ఉన్నటువంటి పలు సంఘటనలను దృష్టిలో ఉంచుకొని దీనిని ప్రారంభించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విజయవంతంగా పథకం అమలవుతున్న నేపథ్యంలో, మరింతగా విస్తృతం చేసేందుకు మంత్రి నారా లోకేష్ నిర్ణయించారు. అలాగే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతుందా లేదా అంటూ అధికారుల ద్వారా వాకబు చేశారు.
పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు, ఉన్నత స్థాయి చదువు నిమిత్తం ఇంటర్ విద్యను అభ్యసించాల్సి ఉంది. కానీ పదవ తరగతి ఉత్తీర్ణులైన వారి సంఖ్యకు, ఇంటర్మీడియట్ లో ప్రవేశం పొందే విద్యార్థుల సంఖ్యకు వ్యత్యాసం ఉన్న పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మధ్యలోనే చదువు మానివేస్తున్నట్లు గుర్తించిన ప్రభుత్వం, ఇంటర్మీడియట్ కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
ఈ మేరకు మంత్రి నారా లోకేష్ సంబంధిత అధికారులతో చర్చించినట్లు సమాచారం. అలాగే విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించే పాఠ్యాంశాల కోసం ప్రముఖ వక్త, ప్రభుత్వ సలహాదారులు చాగంటి కోటేశ్వరరావు సలహాలను తీసుకోవాలని సంబంధిత అధికారులకు లోకేష్ ఆదేశించారు. ఇంటర్మీడియట్ లో వెనుకబడిన విద్యార్థులకు క్వచ్చన్ బ్యాంక్ అందించాలని నిర్ణయించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బాగా దెబ్బతిన్న చోట్ల మరమ్మతులు చేపట్టాలని కూడా సమావేశంలో లోకేష్ నిర్ణయించారు. త్వరలోనే ఇంటర్మీడియట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు వెలువడనున్నాయి. దీనితో ప్రభుత్వ కళాశాలల్లో కూడా విధ్యార్థుల సంఖ్యను పెంచి, వారి బంగారు భవితకు తోడ్పడాలన్న ప్రభుత్వ ఉద్దేశం నెరవేరినట్లేనని చెప్పవచ్చు.