Nara Lokesh: తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ కీలకపాత్ర పోషిస్తున్నారా? నిత్యం కేంద్ర పెద్దలతో టచ్‌లో ఉండేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారా? లభించిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా? రాత్రికి రాత్రి ఆయన హస్తినకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
మంత్రి నారా లోకేష్ ఆదివారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. ఉన్నట్లుండి లోకేష్ ఢిల్లీ వెళ్లడం వెనుక కారణాలేంటి? ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణను బీజేపీ హైకమాండ్ ఎంపిక చేసింది. గత రాత్రి బీజేపీ ప్రకటన చేసింది. సోమవారం ఆయన తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి లోకేష్ కూడా హాజరుకానున్నారు.
ఉప రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవంగా జరుగుతుందా? ఇండియా కూటమి బరిలో ఉంటుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఎన్డీయే కావాల్సిన మెజార్జీ ఉంది. దీంతో రేపో మాపో ఎన్డీయే కూటమి భేటీ కానుంది. ఈ సమావేశానికి మిత్రులను బీజేపీ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ ఢిల్లీ వెళ్లారని అంటున్నారు.
ఒకవిధంగా చెప్పాలంటే పార్టీ కార్యక్రమాల్లో అధినేత చంద్రబాబు కంటే లోకేష్ యాక్టివ్గా ఉంటున్నారు. పార్టీ వ్యవహారాలు కావచ్చు.. కేంద్రం నుంచి నిధుల విషయంలో కావచ్చు.. మంత్రి నారా లోకేష్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నారని ఆ పార్టీలో కొందరు నేతల మాట.
ALSO READ: చంద్రబాబు కన్నెర్ర.. ముగ్గురికి మూడింది?
గతంలో ప్రధాని మోదీ ప్రత్యేకంగా భేటీ అయిన చినబాబు.. ఆనాటి నుంచి పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా తొలుత అడుగులు వేస్తున్నారు. ఈ లెక్కన పార్టీలో లోకేష్ పాత్ర క్రమంగా పెరుగుతోందని అంటున్నారు. ఈ కార్యక్రమం తర్వాత సోమవారం పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు మంత్రి లోకేష్.
సెమీ కండక్టర్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ని ఏపీకి మంజూరు చేసిన కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి కృతజ్ఞతలు చెబుతారు. ఇంకోవైపు కేంద్ర రోడ్డు రవాణా- రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ కానున్నారు. ఇటీవల ఓకే చేసిన ప్రాజెక్టుల పనులు ఎంతవరకు వచ్చాయి? ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోనున్నారు.
నెల్లూరు జిల్లాలో రామాయపట్నం ఓడరేవు సమీపంలో బీపీసీఎల్ ప్రాజెక్టును విషయంలో మద్దతు కోరేందుకు పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలవనున్నారు. ఓడరేవులు-షిప్పింగ్ -జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్‌తో భేటీ కానున్నారు. ఆయా మంత్రులకు సంబంధించి ఇప్పటికే అపాయింట్మెంట్ తీసుకున్నారు.
జలమార్గాల మంత్రిత్వ శాఖ నుండి అంతర్గత జలమార్గాల ప్రాజెక్టులను చేపట్టడానికి కేంద్రం మద్దతు కోరనున్నారు. ఆ తర్వాత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, విదేశాంగ మంత్రి జైశంకర్‌లతో సమావేశం కానున్నారు. ఆయా మంత్రులతో పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు.
దీనికితోడు ఏపీ ప్రభుత్వం తరఫున చేపట్టనున్న వివిధ ప్రాజెక్టుల ప్రతిపాదనలను వారి దృష్టికి తీసుకురానున్నారు. మంగళవారం ఏపీకి రానున్నారు మంత్రి లోకేష్. దీని తర్వాత గురువారం ఢిల్లీకి వెళ్తున్నారు సీఎం చంద్రబాబు. ఆ మరుసటిరోజు పలువురు కేంద్రమంత్రులతో ఆయన భేటీ కానున్నారు.