Janasena TDP Alert : త్వరలోనే ప్రధాని మోదీ ఏపీ వస్తున్నారు. నవంబర్ 11న విశాఖలో పర్యటించనున్నారు. ఆ మేరకు పీఎం టూర్ ఖరారైంది. 400 కోట్లతో చేపట్టనున్న విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం తదితర కేంద్రప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అదే రోజు విశాఖలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇదీ షెడ్యూల్.
జస్ట్ రైల్వే స్టేషన్ పనుల శంకుస్థాపనకు ఏకంగా ప్రధాని మోదీనే తరలిరావడం ఒకింత ఆశ్చర్యకరమే. ఇటీవల అన్నిపార్టీలు విశాఖ కేంద్రంగా రాజకీయ వేడి రగిలించాయి. మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ సభ జరపడం.. అదే రోజు జనసేనాని పవన్ కల్యాణ్ సైతం విశాఖలో పర్యటించడం.. ఎయిర్ పోర్టులో రెండు పార్టీల మధ్య పరస్పర దాడులు, పోలీస్ కేసులు.. తీవ్ర కలకలం రేపాయి. కట్ చేస్తే, చంద్రబాబు వెళ్లి పవన్ ను కలవడం.. పొత్త సంకేతాలు ఇవ్వడంతో రాజకీయం మరింత రంజుగా మారింది. ఆ తర్వాత జనసేన మీటింగ్ లో పవన్ తన కాలి చెప్పు తీసి చూపిస్తూ.. వైసీపీపై బూతులతో విరుచుకుపడటం.. ఇలా కొన్నిరోజులుగా ఏపీ పాలిటిక్స్ బాగా హీట్ ఎక్కాయి.
ఇలాంటి కీలక సమయంలో ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు వస్తుండటం, బహిరంగ సభ కూడా నిర్వహించనుండటంపై రాజకీయంగా ప్రాధాన్యం పెరిగింది. బీజేపీ, జనసేనల మధ్య బాగా గ్యాప్ వచ్చిన ప్రస్తుత తరుణంలో.. మోదీ స్టేట్ పాలిటిక్స్ పై ఫోకస్ పెంచుతారా? కేవలం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితం అవుతారా? అనేది ఆసక్తికరం.
అఫీషియల్ గా జనసేన, బీజేపీల మధ్య పొత్తైతే ఉందికానీ.. ఆ రెండు పార్టీలు కలిసి పని చేయట్లేదు. రోడ్ మ్యాప్ రచ్చ నడుస్తోంది. అదే సమయంలో పవన్ కల్యాణ్ టీడీపీకి దగ్గరవుతున్నారు. అటు, టీడీపీ బీజేపీ వైపు ఆశగా చూస్తోంది. కమలనాథులు మాత్రం టీడీపీతో చేతులు కలిపేది లేదంటున్నా.. ఓ వర్గం మాత్రం ఆ రెండు పార్టీల మైత్రి కోసం ఢిల్లీ స్థాయిలో గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అందుకే, మోదీ రాక.. టీడీపీ, జనసేనలో అటెన్షన్ క్రియేట్ చేస్తోంది.
ఇటీవల జనసేన, బీజేపీల మధ్య పరస్పర నమ్మకం సడలుతోంది. అయితే, పదే పదే మోదీపై తన నమ్మకాన్ని, అభిమానాన్ని గట్టిగా చాటుకుంటున్నారు పవన్. ఇలాంటి పరిస్థితుల్లో జరగనున్న ప్రధాని మోదీ విశాఖ పర్యటన.. రాజకీయంగా కీలకంగా మారే అవకాశం ఉంది.
మరోవైపు, రాజధాని రైతులు పాదయాత్రగా ఉత్తరాంధ్ర దిశగా కదులుతుండగా.. అమరావతిపై ప్రధాని మోదీ స్పందించే అవకాశం ఉందని అంటున్నారు. అదే జరిగితే రాజకీయం మరింత రంజుగా మారడం ఖాయం.