Nandigam Suresh arrested: చేసిన పాపాలు ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా వెంటాడతాయని పెద్దలు చెబుతారు.. సరిగ్గా వైసీపీ నేతల విషయంలో అదే జరిగింది.. జరుగుతోంది. టీడీపీ ప్రధాన ఆఫీసు దాడి కేసులో నిందితుల కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. తాజాగా మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను గత రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మరో ముగ్గురు నిందితులు పరారీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
వైసీపీ నేతలకు కష్టాలు మొదలయ్యాయి. అరాచకాలకు పాల్పడిన నేతలపై చంద్రబాబు సర్కార్ దృష్టి సారించింది. మంగళగిరిలోని టీడీపీ ఆఫీసు దాడి కేసులో నిందితుల కోసం వేట మొదలుపెట్టింది. ఈ కేసులో నిందితులు పెట్టుకున్న ముందస్తు బెయిల్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగేశారు.
ALSO READ: ఏపీకి భారీ విరాళం.. రూ. 120 కోట్లు.. ఎవరిచ్చారంటే?
న్యాయస్థానం తీర్పు తర్వాత నిందితులు ఏపీని వదిలి వివిధ ప్రాంతాలకు వెళ్లిపోయారు. పోలీసులు అరెస్టు చేస్తారని భావించి నిందితులంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బుధవారం రాత్రి గుంటూరు జిల్లాలోని ఉద్దండరాయుని పాలెంలోని నందిగం సురేష్ ఇంటికి తుళ్లూరు పోలీసులు వెళ్లారు. ఆయన అక్కడ లేకపోవడంతో పావు గంటపాటు వెయిట్ చేసి వెనుదిరిగారు.
సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా మాజీ ఎంపీ ఎక్కడున్నారో పోలీసులు ట్రేస్ చేశారు. డీఎస్పీ మల్లికార్జునరావు ఆధ్వర్వంలోని ఓ బృందం హైదరాబాద్ వెళ్లింది. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్‌లోని మియాపూర్ ప్రాంతంలో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను అదుపులోకి తీసుకుంది. అక్కడి నుంచి విజయవాడ తరలించింది.
మాజీ ఎంపీ అరెస్ట్‌పై పోలీసులు ఇంకా ప్రకటన చేయలేదు. మరోవైపు ఈ కేసులో నిందితులుగా లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురామ్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. బెజవాడ వరద పరిస్థితి నుంచి తేరుకున్నాక అరెస్ట్ చేద్దామని పోలీసులు భావించారట.
బెజవాడ వరదలో కొందరు వైసీపీ నేతలు ప్రభుత్వంపై విషం చిమ్మేలా కుట్రకు పాల్పడినట్టు వార్తలు వస్తున్నాయి. బాధితులను బోట్ల ద్వారా బయటకు తీసుకొచ్చేందుకు భారీ మొత్తంలో డబ్బులు గుంజారని సమాచారం. దీంతో వరద బాధితులు చంద్రబాబు సర్కార్‌పై మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంలో ప్రభుత్వం సైలెంట్ అయ్యింది.
ఈ వ్యవహారం చివరకు సీఎం చంద్రబాబు చెవిలో పడింది. బుధవారం మధ్యాహ్నం మీడియాతో ముందుకొచ్చిన సీఎం చంద్రబాబు.. బోట్ల వ్యవహారంపై సీరియస్‌గా స్పందించారు. ప్రైవేటు బోట్ల యజమానులు వరద బాధితుల నుంచి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే.. కేసు పెట్టి అరెస్ట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
ఈలోగా టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితులకు న్యాయస్థానం బెయిల్ రిజెక్ట్ చేయడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగేశారు. మరో విషయం ఏంటంటే.. బోట్ల యజమానులంతా టీడీపీ ఆఫీసు దాడి కేసులో నిందితుల అనుచరులని తేలింది. ఇదే అదునుగా భావించి పోలీసులు రంగంలోకి దిగేశారు. చంద్రబాబు సర్కార్‌పై బురద జల్లాలని భావించారు అడ్డంగా ఇరుక్కుపోయారు. ఈ కేసులో తానేమీ చేయలేనని జగన్ అన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఏం చెయ్యాలో తెలియక ఆయా నేతలు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. చివరకు అజ్ఞాత బాట పట్టారు.
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్టు దృశ్యాలు.#APnews #Ysrcp #NandigamSureshArrest #NewsUpdates #Bigtv @YSRCParty @ysjagan @NandigamSuresh7 https://t.co/8jb2SONhXw pic.twitter.com/CNBHEZLUIA
— BIG TV Breaking News (@bigtvtelugu) September 5, 2024