Mother Killed Son: మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని మరోసారి రుజువైంది. ఆస్తి ముందు కన్న బంధం కూడా నిలబడదని తేలిపోయింది. ఏపీలో జరిగిన ఈ దారుణ ఘటనే అందుకు నిదర్శనం. నవమాసాలు మోసి కన్న కొడుకును ఓ ఎకరం భూమి కోసం తల్లే అతి దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన నంద్యాల జిల్లా మోతుకూరులో జరిగింది. మోతుకూరు గ్రామానికి చెందిన వెంకట శివమ్మకు 13 ఎకరాల భూమి ఉంది. అందులో తన ఇద్దరు కొడుకులు సుధాకర్, శివాజీలకు చెరో 5 ఎకరాలు రాసిచ్చింది. ఇంకా తన పేరిట మూడు ఎకరాలు ఉంచుకుంది.
అయితే భూముల కేటాయింపులో సుధాకర్‌కు వచ్చిన 5 ఎకరాల్లో ఒక ఎకరం శివాజీ భూమిగా నమోదైంది. అప్పులు తీర్చుకోవడానికి ఆ భూమిని అమ్ముకోవాలని సంతకం చేయాలని శివాజీని సుధాకర్ పలుమార్లు కోరాడు. శివాజీ సంతకం పెట్టడానికి నిరాకరించడంతో వారి మధ్య ఆస్తి తగాదా తలెత్తింది. ఈ విషయంపై అన్నదమ్ములు పలుమార్లు ఘర్షణ పడ్డారు.
ఇటీవల పెత్తర్ల అమావాస్య సందర్భంగా తల్లి వెంకట శివమ్మ చిన్న కొడుకు శివాజీ ఇంటికి వచ్చింది. తల్లి వచ్చిన విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన సుధాకర్ మరోసారి ఆస్తి విషయంపై తమ్ముడితో గొడవకు దిగాడు. అయితే కాసేపటి తర్వాత సుధాకర్ అనుమానాస్పదరీతిలో మృతి చెందాడు. అత్త, మరిది ఇద్దరూ కలిసి తన భర్తను హత్య చేశారని మృతుడి భార్య పోలీసులను ఆశ్రయించింది. తన భర్తను తల్లి వెంకట శివమ్మ కంట్లో కారం చల్లి, చీరతో ఉరి వేసి హత్య చేసిందని ఆరోపించింది.
అత్త శివమ్మతో పాటు మరిది శివాజీ, అతని కుమార్తెలు అందరూ కలిసి తన భర్తను దారుణంగా హత్య చేశారని జ్యోతి పోలీస్ ఫిర్యాదులో పేర్కొంది. ఆస్తి వివాదంపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశామని, అత్త, మరిదిని స్టేషన్‌కు పిలిపించినా వారు రాలేదని జ్యోతి తెలిపింది. ఆస్తి పంచినట్లే పంచి అతని వాటాకు వచ్చిన భూమిని అమ్ముకోవడానికి వీలు లేకుండా చేశారని ఆమె ఆరోపించింది. ఆ విషయంపై అడగడానికి వెళ్లిన భర్తను అత్త, మరిది హత్య చేశారని తెలిపింది.
Also Read: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. సుధాకర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేవలం ఒక ఎకరం పొలం కోసం కన్న కొడుకును చంపుకోవడం ఏంటని గ్రామస్థులు నివ్వెరపోతున్నారు. రక్త సంబంధాల కన్న ఆస్తులే ముఖ్యమైపోతున్నాయని చర్చించుకుంటున్నారు.