BigTV English

TDP Mahanadu: మరో 40 ఏళ్లు మాదే..! కడప మహానాడు తర్వాత లోకేష్‌కు పార్టీ బాధ్యతలు?

TDP Mahanadu: మరో 40 ఏళ్లు మాదే..! కడప మహానాడు తర్వాత లోకేష్‌కు పార్టీ బాధ్యతలు?

పార్టీ భవిష్యత్ నిర్మాణం దిశగా లోకేశ్ వ్యూహాలు

మహానాడు అన్నాక తీర్మానాలు ప్రవేశపెట్టడం కామన్. వాటిని అమల్లో పెట్టడం కామనే. కానీ ఈసారి కొంచెం స్పెషల్. అందులో లోకేష్ మార్క్ కనిపించబోతోంది. యువగళం పాదయాత్రతో టీడీపీ శ్రేణుల్లో ఒక ఉత్సాహం తీసుకొచ్చిన లోకేశ్.. పార్టీ భవిష్యత్ నిర్మాణం దిశగా ఆలోచనలకు పదును పెట్టారు. ఈ క్రమంలోనే పార్టీని మరో 40 ఏళ్లపాటు నడిపించడానికి అవసరమైన ప్రణాళికలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారా..? పార్టీ మూల సిద్దాంతం స్ఫూర్తితో ప్రస్తుత ప్రజా అవసరాలకు తగ్గట్లు పార్టీలో కీలక విధాన మార్పులు రానున్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. కొత్త విధానాలతో పార్టీకి కొత్త లుక్ రాబోతోందంటున్నారు.


సరికొత్త బాటలో మహానాడుకు ప్లాన్

గతానికి భిన్నంగా టీడీపీ పండుగైన మహానాడును నిర్వహించాలనేది లోకేష్ అభిప్రాయంగా కనిపిస్తోంది. పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి.. దాన్ని సమర్థంగా నడుపుతూ కార్యకర్తల మనస్సులో ప్రత్యేక ముద్ర వేయించుకున్నారు లోకేష్. ప్రస్తుతం, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. పార్టీకి కొత్త ఉత్తేజం తీసుకొచ్చే దిశగా పార్టీని పరుగులు పెట్టించేందుకు అవసరమైన మార్పులు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. కూడు, గూడు, గుడ్డ అనేది ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని స్థాపించిన నాటి మూల సిద్దాంతం. ఆ స్ఫూర్తి నుంచి మారుతున్న కాలానికి తగ్గట్లుగా పార్టీ విధానపరమైన మార్పులు తేవాలన్నది లోకేష్ ఆలోచన.

మారుతున్న కాలానికి తగ్గట్లే కొత్త వ్యూహాలు

కాలం మారుతోంది.. ప్రజల అవసరాలు మారుతున్నాయి.. వారి ఆలోచన విధానం కూడా మారుతోంది. ఎన్టీఆర్ హయాంలో ఆత్మాభిమానం, చంద్రబాబు హయాంలో ఆత్మవిశ్వాసం అనే నినాదాలు రాజకీయ సమీకరణాలనే మార్చేశాయి. ఇప్పుడు ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజలకు పార్టీకి కార్యకర్తలకు మంచి భవిష్యత్తును అందించే లక్ష్యంతో సరికొత్త నినాదాన్ని రూపొందించాల్సిన టైం వచ్చిందన్న చర్చ జరుగుతోంది. అన్ని వర్గాలను ప్రతిబింబించేలా విధానాలు రూపొందించేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో నారా లోకేష్ ఆరు కీలక అంశాలను కడప మహానాడులో ప్రతిపాదించబోతున్నట్టు తెలిసింది. మహిళలు, రైతులు, యువత, సామాజిక న్యాయం, కార్యకర్తల సంక్షేమం వంటి అంశాలపై లోకేష్ ఫోకస్ పెట్టారంటున్నారు. తనదైన స్టైల్లో ఓ ఐడియాలజీని లోకేష్ తెర మీదకు తెచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.

కార్యకర్తల సంక్షేమం అంశాలపై ఫోకస్

దేశంలో, ప్రపంచంలో తెలుగువారికి ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం ఉంది. అయితే మారుతున్న కాలానికి తగ్గట్లు తెలుగుజాతి ఖ్యాతిని విశ్వవ్యాపితం చేసేందుకు, మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లేలా ఏం చేయాలన్నది రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారు మంత్రి నారా లోకేష్. తెలుగువారు ఎక్కడున్నా, ఏ రంగంలో ఉన్నా నెంబర్ వన్ గా ఎదగాలనే లక్ష్యంతో నా తెలుగు కుటుంబం అనే ఐడియాలజీని ప్రతిపాదిస్తారంటున్నారు. ఇక రెండోది.. స్త్రీ శక్తి. మహిళా సాధికారత, మహిళా శక్తిని చాటేలా స్త్రీశక్తి పేరుతో మద్దతు ఇవ్వనున్నారు. తెలుగుదేశం కారణంగానే మహిళలకు ఆస్తి హక్కు వచ్చిందని, స్త్రీ శక్తిని మరింత బలోపేతం చేసి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేలా ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు.

పేదరిక నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ అమలు

పేదరికం లేని సమాజం కోసం ప్రత్యేక అజెండా రెడీ చేస్తున్నారు. ఇప్పటికే పీ4 విధానాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నారు. వీటితో పాటు పేదరిక నిర్మూలనకు ప్రత్యేకమైన కార్యాచరణ అమలు చేయనున్నారు. బీసీలకు వెన్నుదన్నుగా నిలవడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని, ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కులాలకు సామాజిక సమన్యాయంపై ఐడియాలజీని రూపొందించే అవకాశం ఉంది. ప్రతి వర్గానికి న్యాయం చేసేలా సోషల్ రీ ఇంజినీరింగ్ చేయనున్నారు. అటు పార్టీలో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు అవసరమైన చర్యలు, ఐడియాలజీపై చర్చిస్తారు. భారత్ బలం యువశక్తే.

టీడీపీ పార్టీకి మొదటినుంచీ వెన్నుదన్నుగా నిలుస్తున్న కార్యకర్తలు

ఇక రైతుల రైతుల జీవితాలు మార్చేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం, సాంకేతికంగా రైతును బలోపేతం చేయడం, సబ్సిడీలు ఇచ్చి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పంటలు పండించేలా చేయడంపై దృష్టిపెట్టనున్నారు. టీడీపీకి కోటి మంది క్రియాశీల సభ్యులు ఉన్నారు. సో తెలుగుదేశం పార్టీకి మొదటినుంచీ వెన్నుదన్నుగా నిలుస్తున్న కార్యకర్తల సంక్షేమం కోసం, వారికి చేయూత అందించేలా కొత్త కార్యక్రమాన్ని ఇదే మహానాడు వేదికగా పట్టాలెక్కించబోతున్నారు.

ఎవరూ ఊహించని విధంగా ఈసారి పసుపు పండుగ

2024 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత జరుగుతున్న మహానాడు ఇది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కూటమికి 164 సీట్లతో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రికార్డు స్థాయిలో 93 శాతం స్ట్రైక్ రేటు వచ్చింది. ఈ విజయోత్సాహంతో ఎవరూ ఊహించని విధంగా ఈసారి పసుపు పండుగ మహానాడు జరగబోతోందంటున్నారు. టీడీపీ 43వ మహానాడు కడపలో నిర్వహించడం చరిత్రాత్మకమని, ఈ వేదిక నుంచి రాయలసీమ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచేయబోతున్నామన్నారు టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు.

డైనమిక్ లీడర్ షిప్ ను ప్రోత్సహించే దిశగా అడుగులు

టీడీపీలో యువ నాయకత్వానికి, కొత్త ముఖాలకు అవకాశం కల్పించే లక్ష్యం కనిపిస్తోంది. డైనమిక్ లీడర్ షిప్ ను ప్రోత్సహించే దిశగా అడుగులు పడుతాయంటున్నారు. యువతను ఆకర్షించే వ్యూహంతో టీడీపీ ఉంది. ప్రతి నెలా ఒక సంక్షేమ పథకాన్ని అమలు చేయాలనే క్యాలెండర్ రూపొందించాలనుకుంటున్నారు. ఈ చర్య రాజకీయంగా ప్రజలతో నేరుగా సంబంధాలు పెంచుకోడానికి, ప్రభుత్వ ఇమేజ్‌ను బలోపేతం చేయడానికి ఉపయోగపడబోతోంది. చంద్రబాబు నాయకత్వంలో ఈ మహానాడు ద్వారా పార్టీ ఐక్యతను, రాష్ట్ర అభివృద్ధి ఎజెండాను బలంగా ప్రదర్శించే అవకాశం ఉంది. కడపలో ఈ కార్యక్రమం ద్వారా పార్టీని రాయలసీమలో మరింత బలోపేతం చేయడం, 2029 ఎన్నికలకు ముందస్తు వ్యూహాలను రూపొందించడం మెయిన్ టార్గెట్.

తెలుగువారి చరిత్రలో ఎన్టీఆర్‌ ప్రత్యేకత

మహానాడులో 4 ఉమ్మడి తీర్మానాలు.. తెలుగువారి చరిత్రలో ఎన్టీఆర్‌ ప్రత్యేకత, తెలుగువారి చరిత్రలో చంద్రన్న ముద్ర, అమరులైన టీడీపీ కార్యకర్తలు, నాయకులకు ఘన నివాళి, కార్యకర్తల సంక్షేమం ఇవి కీలకంగా మారుతాయి. మహానాడు టీడీపీ సైద్ధాంతిక బలాన్ని, ఎన్టీఆర్ వారసత్వాన్ని గుర్తు చేస్తుంది. కడపలో జరపడం ద్వారా ఈ గుర్తింపును రాయలసీమ ప్రజలతో మరింత దగ్గర చేసేలా ప్రణాళిక రచించారు. ఇది రాజకీయంగా మాత్రమే కాక, సామాజికంగా కూడా టీడీపీ పట్ల అట్రాక్షన్ ను పెంచేలా ప్లాన్ చేస్తున్నారు.

కడప మహానాడులో మంత్రి నారా లోకేష్ మార్క్ కనిపించబోతోందా?

కడప మహానాడులో మంత్రి నారా లోకేష్ మార్క్ కనిపించబోతోందా? గతానికి భిన్నంగా మహానాడు నిర్వహణకు ఆలోచనలు రెడీ చేశారా? మారుతున్న కాలానికి తగ్గట్లుగా పార్టీ ఆలోచనల్లో మార్పులపై ప్రతిపాదనలు పెట్టబోతున్నారా .. అంటే అవునన్న సమాధానాలే వస్తున్నాయి. సంప్రదాయ విధానాలకు ఫ్యూచర్ జెనరేషన్ థాట్స్ జోడించబోతున్నారు. 6 అంశాలతో పార్టీకి కొత్త లుక్ తెచ్చేలా స్ట్రాటజీ వర్కవుట్ చేశారంటున్నారు. ఇంతకీ అవేంటి? మహానాడు రూపురేఖలను మార్చబోతున్నాయా?

27, 28, 29 తేదీల్లో కడప వేదికగా టీడీపీ మహానాడు

ఈనెల 27, 28, 29 తేదీల్లో కడప వేదికగా టీడీపీ మహానాడు జరగబోతోంది. పబ్బాపురం వద్ద 125 ఎకరాల స్థలంలో మహానాడు నిర్వహించనున్నారు. రైట్ బయటి నుంచి చూస్తే ఇదే మ్యాటర్. కానీ ఇదే మహానాడు చాలా మలుపులకు వేదిక కాబోతోంది. అసలు మహానాడు కడపలో నిర్వహించడమే ఈ సారి పెద్ద హైలెట్. అంతకు ముందు కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలో మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటింది. వైఎస్ జగన్ సొంత జిల్లా. అయినప్పటికీ ఆ కోటను బద్దలు కొట్టింది టీడీపీ. మెజార్టీ స్థానాల్లో గెలిచి సత్తా చాటింది. ఇది రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చింది. సో వచ్చే ఎన్నికల్లోనూ ఇదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేసే దిశగా ఈ లొకేషన్ ను మహానాడు వేదికగా ఎంచుకోవడం ఒక స్ట్రాటజీ.

ఈసారి అంతకు మించి మహానాడు ప్రోగ్రామ్

మహానాడు అనగానే మినీ మహానాడులు నిర్వహించడం, అక్కడి నుంచి వచ్చిన తీర్మానాలను తీసుకోవడం, పార్టీలో వ్యవహారాలపై మాట్లాడుకోవడం, భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకోవడం ఇవే జరుగుతూ వస్తున్నాయి. కానీ ఇప్పుడు అంతకు మించి మహానాడు ఉండబోతోందన్న హైప్ మాత్రం క్రియేట్ అయింది. ఎప్పటి మాదిరి కాదు.. రొటీన్ అంతకంటే కాదు.. ఫ్యూచర్ జెనరేషన్ ఆలోచనలకు తగ్గట్లుగా పార్టీ నిర్మాణం, భవిష్యత్ లక్ష్యాలు, యువతకు, మహిళలకు అవకాశాలు, స్మార్ట్ ప్రోగ్రెస్, కార్యకర్తలకు మరింత చేరువయ్యేలా అడ్వాన్స్ డ్ యాప్ కనెక్టివిటీ ఇవన్నీ కీలకం కాబోతున్నాయి.

తెలుగుదేశం శ్రేణులకు ఇది పండగ కార్యక్రమం

మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఏటా మహానాడు నిర్వహిస్తూ వస్తున్నారు. గతేడాది సార్వత్రిక ఎన్నికలు జరగడంతో ఈ కార్యక్రమం నిర్వహించలేదు. నిజానికి ప్లీనరీ అనో.. పేరు ఏదైనా రాజకీయ పార్టీలు కార్యక్రమాలు నిర్వహించుకుంటాయి. అయితే టీడీపీలో మాత్రం మహానాడు మహా స్పెషల్. ఇక్కడ రాజకీయమే కాదు.. ఇదొక పండగా జరుపుకుంటారు. తొలి రోజు.. పార్టీ ప్రతినిధుల సభ, పార్టీ సంస్థాగత నిర్మాణం, విధివిధానాలు, భవిష్యత్‌ కార్యాచరణపై క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తారు. రెండో రోజు ప్రతినిధుల సభతోపాటు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన ముసాయిదా తీర్మానాలపై చర్చిస్తారు. ఇక మూడో రోజు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు.

పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంపు

నిజానికి మహానాడు రెండు రోజులే జరుగుతుంటుంది. కానీ ఈ దఫా మాత్రం 3 రోజులు షెడ్యూల్ ఫిక్స్ చేశారు. పార్టీ ఎజెండాను విస్తృతంగా చర్చించేందుకు, ఎక్కువ మంది కార్యకర్తలను ఒకచోట చేర్చేందుకు అవకాశం వీలు కలగనుంది. ఇది పార్టీ సంస్థాగత బలాన్ని ప్రదర్శించడమే కాక, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయాన్ని పెంచుతుంది. ఇదొక కీ అప్డేట్. సుమారు 16 తీర్మానాలను మహానాడులో పెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. వీటి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఏపీ నుంచి 13 లేదా 14 ముసాయిదా తీర్మానాలు ఉంటాయని, తెలంగాణ నుంచి 5 తీర్మానాల వరకు ఉంటాయని, ఉమ్మడిగా 4 తీర్మానాలు ఉంటాయంటున్నారు.

ఒకే ప్రభుత్వం కంటిన్యూగా ఉంటే కలిగే లాభాల ప్రస్తావన

ఈ మహానాడు వేదికగా కొన్ని విషయాలను జనం దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. వాటిని జనంలో చర్చకు పెట్టేలా ప్లాన్ చేశారు. తొలిరోజే పార్టీ సభ్యత్వం, సంస్థాగత నిర్మాణంపై చర్చిస్తారు. క్లస్టర్‌ యూనిట్‌, బూత్‌, గ్రామ, వార్డు, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీల ప్రాధాన్యతలను వివరిస్తారు. ఆయా కమిటీల్లో మంచి పనితీరు చూపిన నాయకులు, కార్యకర్తలు తమ అనుభవాలను చెబుతారు. అటు రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం కంటిన్యూగా అధికారంలో ఉంటే కలిగే లాభాలను చర్చకు పెడుతారు. గుజరాత్‌లో గత మూడు దశాబ్దాలుగా బీజేపీ అధికారంలో ఉండటంతో అక్కడ సుస్ధిర అభివృద్ధి సాధ్యమైందన్న విషయాన్ని ప్రస్తావించబోతున్నారు. ఏపీలోనూ ప్రభుత్వం మారకుండా కంటిన్యూగా ఉంటే అమరావతి, పోలవరం సహా ఇతర అభివృద్ధి కార్యక్రమాలన్నీ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అవుతాయంటున్నారు.

మహానాడు వేదిక ద్వారా మై టీడీపీ యాప్‌ ఆవిష్కరణ

మరోవైపు పార్టీ, ప్రజలకు మధ్య అనుసంధానానికి మహానాడు వేదిక ద్వారా మై టీడీపీ యాప్‌ ను ఆవిష్కరిస్తారు. ఈ యాప్‌ ద్వారా పార్టీ కార్యకర్తల నుంచి పొలిట్‌బ్యూరో సభ్యుడి వరకు వారి పనితీరును అంచనా వేస్తారు. దీంతో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు లభించనుంది. అలాగే పార్టీ సిద్ధాంతాలను జనంలోకి తీసుకెళ్లడానికి ఈ యాప్‌ ఉపయోగపడనుంది. ఈ మహానాడులో ఇదొక కొత్త ప్రయోగం.

రాయలసీమలో బలాన్ని చాటుకోవడమే టార్గెట్

ఇక వచ్చే ఎన్నికల్లోనూ పక్కాగా గెలుపు లెక్కలు వేసుకుంటున్న టీడీపీ.. అందులో భాగంగానే కడపను మహానాడు వేదికగా ఎంచుకుందంటన్నారు. రాయలసీమ అభివృద్ధి విషయంలో టీడీపీ అధికారంలో ఉన్న ప్రతిసారీ చేసిన కృషిపై ప్రత్యేకంగా చర్చిస్తారు. 2014 నుంచి సీమలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి 12 వేల కోట్లు ఖర్చు చేయడం, కొప్పర్తిలో పారిశ్రామిక హబ్‌, ఓర్వకల్‌ హబ్‌, కియా కార్ యూనిట్, విండ్‌, సోలార్‌ పవర్‌ యూనిట్ల ద్వారా లక్షల్లో ఉద్యోగ, ఉపాధి కల్పన విషయాలు, హార్టికల్చర్‌, పరిశ్రమలు, డెయిరీల అభివృద్ధిపై చర్చించి విషయాలను జనంలోకి తీసుకెళ్తారు. ఇక్కడ మహానాడు పెట్టడం అంటే.. రాయలసీమలో తమ బలాన్ని చాటుకోవడమే మెయిన్ టార్గెట్. ఇది వైఎస్ఆర్‌సీపీ పై రాజకీయ ఆధిపత్యం దిశగా ఒక స్ట్రాటజికల్ పాయింట్. గతంలో టీడీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో మహానాడు జరిగింది. అయితే కడపలో పెట్టడం ద్వారా టీడీపీ తమ రాజకీయ ఉనికిని విస్తరించే ఉద్దేశంతో ఉంది. ఈ స్టెప్ టీడీపీ కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపడంతో పాటే వైఎస్ఆర్‌సీపీకి సవాలుగా నిలుస్తుందంటున్నారు.

మే 29న సుమారు 5 లక్షల మందితో భారీ సభ

2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత జరుగుతున్న కడప మహానాడును భారీ ఎత్తున నిర్వహించాలని టీడీపీ డిసైడ్ అయింది. అందుకే మహానాడు చివరి రోజైన మే 29న సుమారు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. సీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేయనున్నారు. ఈ సభ ద్వారా టీడీపీ బలాన్ని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికలకు రూట్ క్లియర్ చేసేలా పునాదులు బలంగా వేయబోతున్నారు.

 

 

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×