ఏపీలో సంచలనంగా మారిన ప్రభుత్వ కాలేజీ ర్యాగింగ్ ఘటనపై మంత్రి నారా లోకేష్ సీరియస్ గా స్పందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపడతామని చెప్పారు. ఈ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, దీనిపై ప్రస్తుతం సమగ్ర దర్యాప్తు జరుగుతోందని చెప్పారాయన. నాగరిక సమాజంలో ఇలాంటి దారుణమైన హింసకు స్థానం లేదన్నారు. ఇలాంటి ఘటనలు ఇకపై ఎవరూ చేయకుండా చూసేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తాను అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు లోకేష్.
I am deeply disturbed by reports of this incident. A comprehensive investigation is underway. Such reprehensible conduct has no place in a civilised society. I have directed that prompt and exemplary legal action be taken to ensure such acts are not repeated.…
— Lokesh Nara (@naralokesh) August 10, 2025
అసలేం జరిగింది..?
దాచేపల్లిలోని ప్రభుత్వ బీసీ హాస్టల్ లో ఈ దారుణం జరిగింది. నారాయణపురం జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని కొందరు సీనియర్లు, మరికొందరు స్నేహితులతో కలసి చిత్రహింసలకు గురి చేశారు. తీవ్రంగా కొడుతూ తిడుతూ అతడిని హింసించారు. అంతే కాదు, కరెంట్ షాక్ ఇవ్వాలనిప ప్రయత్నించడం మరింత సంచలనంగా మారింది. ఈ దారుణమంతా వారిలో ఒకరు సెల్ ఫోన్ లో రికార్డ్ చేయడంతో అసలు విషయం ఆలస్యంగా బయటపడింది. ఇంటర్ విద్యార్థిపై దాడి చేసిన వారిలో ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ బాధిత విద్యార్థి, దాడికి పాల్పడిన విద్యార్థులు.. అందరూ మైనర్లు కావడంతో ఈ కేసు విషయంలో పోలీసులు జాగ్రత్తగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వారి వివరాలను బయటకు వెల్లడించలేదు. అయితే బాధిత విద్యార్థి తల్లిదండ్రులు తమ బిడ్డకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగడం సంచలనంగా మారింది.
ప్రేమ వ్యవహారమే కారణమా..?
ఏపీలో ర్యాగింగ్ ఘటనలు అరుదు, అందులోనూ ప్రభుత్వ కాలేజీల్లో ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి. సోషల్ మీడియా ప్రభావంతో ఆ దాడి ఘటనను స్నేహితులు వీడియో తీసుకునిమరీ రాక్షసానందం పొందారు. ఆ వీడియోనే వారిని చివరకు పోలీసులకు పట్టించింది. వీడియో బయటకు రావడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చివరకు బాధిత విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో దాడిచేసిన వారిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన పూర్వాపరాలు తెలుసుకుంటున్నారు. ప్రేమ వ్యవహారంలో గొడవలు రావడంతో ఈ దాడి జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించినట్టు తెలుస్తోంది.
మత్తుపదార్థాల ప్రభావం..
దాడికి పాల్పడినవారు ఆ ఘటన జరిగిన సమయంలో మత్తులో ఉన్నారనే అనుమానాలు కూడా ఉన్నాయి. తరచూ ఆ విద్యార్థులు మత్తుపదార్థాలు సేవిస్తుంటారనే సమాచారాన్ని కూడా పోలీసులు సేకరించారు. గతంలో కూడా వారు ఓ దివ్యాంగ విద్యార్థిపై దాడి చేసినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరికోసం గాలిస్తున్నారు. దాడి ఘటనపై శుక్రవారమే హాస్టల్ వార్డెన్ కు బాధిత విద్యార్థి సమాచారం ఇవ్వగా.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. శనివారం నుంచి దాడి ఘటనకు చెందిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇలాంది దారుణాలు ఇకపై రిపీట్ కానివ్వబోమని ఆయన చెప్పారు.