Ex Minister Roja: తెలంగాణలో రాజకీయం హాట్ గా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శల వర్షం కురుస్తోంది. తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ వైరల్ కాగా.. రాజకీయంగా ప్రకంపనలు సృష్టించందనే చెప్పవచ్చు. తనపై జరుగుతున్న ట్రోలింగ్స్ పై మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ లక్ష్యంగా విమర్శలు సంధించారు. అలాగే హీరో నాగార్జున, హీరోయిన్ సమంతా కుటుంబ అంశాన్ని తెర మీదికి మంత్రి తీసుకువచ్చారు. వ్యక్తిగతమైన కుటుంబ అంశాన్ని.. రాజకీయ విమర్శలకు ఉపయోగించారని ఒక్కసారిగా సోషల్ మీడియా కోడై కూసింది. అంతేకాదు టాలీవుడ్ మొత్తం ఒక్క తాటిపైకి వచ్చి నాగార్జున ఫ్యామిలీకి అండదండగా నిలిచారు. సమంతాకు మెగాస్టార్ చిరంజీవి నుండి.. బాలీవుడ్ నుండి సైతం పలువురు హీరోలు, హీరోయిన్ లు మద్దతు పలికారు.
అలాగే ఏపీకి చెందిన మాజీ మంత్రి రోజా కూడా మద్దతు తెలుపుతూ.. మంత్రి సురేఖ వ్యాఖ్యలను తప్పుబట్టారు. అలాగే మంత్రి కొండా సురేఖపై జరుగుతున్న ట్రోలింగ్స్ పై సమాజం వ్యతిరేకించిందని, సాటి మహిళగా.. తోటి మహిళ మనస్సును గాయపరిచేలా.. మాట్లాడడం ఎంతవరకు సమంజసమని రోజా ట్వీట్ చేశారు. మీకు మీ ప్రత్యర్థులకు ఉన్న రాజకీయ వివాదాల్లోకి సంబంధం లేని మహిళ ను తీసుకురావడం దుర్మార్గం. ఆ పని మహిళ అయిన మీరే చేయటం మరింత బాధిస్తోంది. ఇలాంటి వేదనాభరిత పరిస్థితి నుంచి అక్కినేని కుటుంబం, సమంతా మనో ధైర్యంతో అధిగమిస్తుందని ఆశిస్తున్నట్లు రోజా ట్వీట్ సారాంశం.
ఇక్కడే మాజీ మంత్రి రోజాకు సోషల్ మీడియా నెటిజన్ల నుండి ఎదురుదాడి ఎదురైంది. అలాగే పలువురు టీడీపీ నేతలు సైతం మాజీ మంత్రి రోజాకు నేరుగా ట్వీట్ ట్యాగ్ చేస్తూ పలు ప్రశ్నలు సంధించారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి గురించి.. అసభ్యపదజాలంను పలువురు వైసీపీ నేతలు మాట్లాడారని, అప్పుడు స్పందించని మీరు.. ఇప్పుడు స్పందించడం ఎలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అలాగే అక్కడ కూడా ఒక మహిళ పై వ్యక్తిగత దూషణలు చేశారని, వాటిని ఆ రోజు ఎలా సమర్ధించారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మహిళలపై దాడులు కానీ, అసభ్యకర మాటలు వచ్చినప్పుడు స్పందించి మాట్లాడడం మంచిదే కానీ.. నాడు ఏమయ్యారు అంటూ టీడీపీ సోషల్ మీడియా కోడై కూస్తోంది.
అయితే ఈ విమర్శలకు ఎటువంటి సమాధానం చెప్పని మాజీ మంత్రి రోజా.. వివాదాన్ని పెంచకుండా సైలెంట్ అయ్యారు. కానీ తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఉన్న రాజకీయ వేడి… ఈ కామెంట్స్ తో ఏపీకి తాకినట్లయింది. అలాగే సమంతా, నాగ్ ఫ్యామిలీకి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు పలకడం, అండగా ఉండడంపై ఇవే కామెంట్స్ జూనియర్ ఎన్టీఆర్ కు కూడా నెటిజన్స్ ట్యాగ్ చేయడం విశేషం. ఏది ఏమైనా తెలంగాణ సెగ.. ఆంధ్రకు కూడా తాకిందని చెప్పవచ్చు.