Jagan: జెన్ జీ ఉద్యమంతో బెంబేలెత్తుతోంది మోదీ సర్కార్. ఈ క్రమంలో వివేకా హత్య కేసును మళ్లీ తెరపైకి తెచ్చారు సునీత. ఏకంగా రాష్ట్రపతికి లేఖ రావడంపై వైసీపీలో కలవరం మొదలైంది. దీంతో వైసీపీ అధినేత జగన్‌కు కొత్త సమస్య మొదలైందా? రానున్న రోజుల్లో ఇబ్బందికర పరిస్థితులు తప్పవా? ఇదే ప్రశ్న ఆ పార్టీ నేతల్లో మొదలైంది.
వివేకానంద హత్య కేసు ఫుల్‌స్టాప్ పడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. గడిచిన ఏడేళ్లుగా దీనిపై సునీత ఎడతెగని పోరాటం చేస్తున్నారు. న్యాయస్థానాలను పదే పదే పిటిషన్లు వేసినా న్యాయం జరగలేదని భావించారు ఆమె. ఈ నేపథ్యంలో నేరుగా రాష్ట్రపతికి లేఖ రాయడం వైసీపీలో కలవరం మొదలైంది. మరోవైపు జెన్ జీ ప్రతినిధులను ఆమె కలిసే ప్రయత్నం చేస్తున్నట్లు ఢిల్లీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇంతకీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సునీత రాసిన లేఖలో ముఖ్యమైన అంశాలను ఒక్కసారి చూద్దాం. వివేకానంద హత్య కేసులో దర్యాప్తు పూర్తిగా కొలిక్కి రాలేదని ప్రస్తావించారు. ఏడేళ్లు దాటినా న్యాయం జరగలేదని, నేరానికి ఉపయోగించిన ఆయుధం ఆచూకీ లభించలేదని పేర్కొన్నారు. హత్య వెనుక కుట్రపై మరింత దర్యాప్తు అవసరమని అందులో అభిప్రాయపడ్డారు.
దర్యాప్తు, న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవాలన్న ఉద్దేశం లేదని చెబుతూనే, మిగిలిన అంశాలు పరిశీలించేలా సంబంధిత అధికారులకు సూచించాలని అందులో పేర్కొన్నారు. 2019 మార్చి 15న పులివెందులలో వివేకా తన నివాసంలో హత్యకు గురయ్యారు. తొలుత అనుమానాస్పద మృతిగా పరిగణించారు. ఆ తర్వాత హత్య కేసుగా మార్చారు. ఆనాటి ప్రభుత్వం మూడు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసింది.
దర్యాప్తు తీరుపై ఆందోళన వ్యక్తంచేస్తూ కేసు సీబీఐకి అప్పగించాలని హైకోర్టును ఆశ్రయించానని పేర్కొన్నారు. 2020 జులై 9న సీబీఐ కేసు నమోదు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణను ఏపీ నుంచి తెలంగాణకు తరలించారు. ఈ కేసుపై హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో విచారణ కొనసాగుతోందన్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధం దొరకలేదని, నగదు లావాదేవీలపై దర్యాప్తు చేయాలని అందులో ప్రస్తావించారు.
హత్య వెనుక కుట్ర సమాచారం ఎప్పుడు, ఎలా బయటకు వెళ్లిందన్న విషయాలపై పరిశీలన అవసరమన్నారు. దర్యాప్తులో కొన్ని అంశాలు పూర్తిస్థాయిలో పరిశీలించలేదని సీబీఐ కోర్టు స్వయంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజాప్రతినిధి హత్య కేసులో ప్రజల విశ్వాసం నిలిచేలా నిజానిజాలను పూర్తిస్థాయిలో వెలికి తీయాల్సిన అవసరం ఉందని రాసుకొచ్చారు. వినతిని పరిశీలించి సీబీఐ- కేంద్ర హోంశాఖకు పంపాలని పేర్కొన్నారు.
ALSO READ: కల్వర్టులోకి దూసుకెళ్లిన ట్రావెల్ బస్సు, స్పాట్‌లో 20 మంది ప్రయాణికులు
సునీత లేఖ విషయం తెలియగానే వైసీపీలో అలజడి మొదలైంది. అసలే జెన్ జీ ఉద్యమంతో మోదీ సర్కార్‌కు ఉలిక్కిపడుతోంది. ఎప్పుడు.. ఏ రూపంలో ఆందోళనకు దిగుతారేమోనన్న భయం వెంటాడుతోంది. ఈ క్రమంలో వివేకా కేసు గురించి రాష్ట్రపతికి సునీత లేఖ రాయడంతో ఈ కేసు దర్యాప్తు జోరందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. లేకుంటే జెన్ జీ ప్రతినిధులతో కలిసి సునీత ఆందోళనకు దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. అదే జరిగితే కేంద్రం-జగన్‌కు ఇబ్బందులు తప్పవపోవచ్చని నేతలు అంటున్నారు.