New Ration Card: ఏపీలో ఏ పథకాలు తీసుకున్నా టెక్నాలజీని జోడిస్తున్నారు. దీనివల్ల నిజమైన లబ్దిదారులకు ప్రయోజనం చేకూరుతుంది. దళారీల ఆగడాలకు ఫుల్‌స్టాప్ పడనుంది. అంతేకాదు పథకం వచ్చిన ప్రతీసారీ, కొందరు ఉద్యోగులు చేతివాతం చూపిస్తున్నారనే వాదన కొన్నాళ్లుగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రతీ విషయంలో టెక్నాలజీని ఉపయోగిస్తోంది ఏపీ సర్కార్.
కొత్త రేషన్ కార్డుల పంపిణీకి అంతా రెడీ చేసింది ఏపీ ప్రభుత్వం. వీలైనంత త్వరగా అంటే ఆగస్టులో లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులను అందజేయాలని డిసైడ్ అయ్యింది. స్మార్ట్ కార్డుల తరహాలో కొత్త కార్డులను ఇవ్వనుంది. దీనికి సంబంధించిన కార్డుల డిజైన్ పూర్తి అయ్యింది. తొలిసారి ఆయా కార్డులకు అధునాతన సాంకేతికతను ఉపయోగించి ఇవ్వనుంది.
కొత్త కార్డులకు సంబంధించి మే నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. లక్షా 47 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వాటిని అన్నికోణాల్లో పరిశీలించిన అధికారులు, అర్హతలున్న వారిని ఎంపిక చేసింది. దాదాపు 90 వేల కార్డులను గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే కుటుంబ సభ్యుల విభజన కోసం లక్షా 43 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.
వాటిలో లక్షకు పైగానే కార్డులు మంజారు చేసిందని అధికారులు చెబుతున్నమాట. మిగతా దరఖాస్తులను తిరస్కరించింది. ఈ లెక్కన దాదాపు రెండు లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వనుంది చంద్రబాబు ప్రభుత్వం. దీని తర్వాత ఆయా కార్డు దారులపై నిఘా ఉంటుంది. ఆదాయం ఎక్కువగా ఉన్నట్లు తేలితే రేషన్ కార్డు కట్ అయ్యే అవకాశముందని చెబుతున్నారు.
ALSO READ: రొట్టెల పండుగ ప్రారంభం.. మీ కోరిక తీరాలంటే అక్కడికి వెళ్లండి
రాష్ట్రంలో దాదాపు కోటిన్నర రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్తగా మంజూరు చేసే కార్డులతో పాత కార్డులున్నవారికి స్మార్ట్ కార్డులు ఇవ్వాలని కసరత్తు చేస్తోంది.ఈసారి రేషన్ కార్డులకు టెక్నాలజీని ఉపయోగించనుంది. ఏటీఎం కార్డు తరహాలో స్మార్ట్ కార్డు ఉండనుంది. కొత్త రేషన్ కార్డుల ముందు వైపు ప్రభుత్వ అధికారిక చిహ్నం, కుటుంబ యాజమాని ఫోటోతోపాటు రేషన్ కార్డు నెంబర్, షాపు వివరాలు ఉంటాయి. వెనుక వైపు కుటుంబ సభ్యుల వివరాలు పేర్లతో సహా ఉంటాయి.
స్మార్ట్ రేషన్ కార్డులను ఈ-పోస్ యంత్రాల్లో స్కాన్ చేస్తే ఫ్యామిలీకి సంబంధించిన వివరాలు మొత్తమంతా తెలుస్తాయి. గతంలో రేషన్ సరుకులు ఎప్పుడు తీసుకున్నారు అనే వివరాలు బయటకు తెలుస్తాయి. కొత్త కార్డుల టెండర్ ప్రక్రియ పూర్తి కావడంతో వీటిని ముద్రించే పనిలోపడ్డారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఆగస్టులో రేషన్ స్మార్ట్ కార్డులను పంపిణీ చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన.
పాత రేషన్ కార్డులను కొత్త స్మార్ట్ కార్డులతో భర్తీ చేయనున్నట్లు సమాచారం. వీటికి సంబంధించి మార్పులు చేర్పుల కోసం అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈ సేవలను లబ్దిదారులు పొందవచ్చు. 9552300009 నెంబర్ కు Hi అని మెసేజ్ పెడితే సేవలు కనిపిస్తాయి. మీకు కావాల్సిన ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసినవారు స్టేటస్ కోసం ఏపీ సేవా అధికారిక పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. హోమ్ పేజీలో రైట్‌లో సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ ఉంటుంది. సెర్చ్ బాక్సులో అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే బటన్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది. రేషన్ కార్డు వచ్చిందా లేదా? ఏ దశలో ఉందో తెలిసిపోతుంది.