BigTV English

Singayya Case: సింగయ్య కేసులో మళ్లీ పాత వ్యూహం?

Singayya Case: సింగయ్య కేసులో మళ్లీ పాత వ్యూహం?

Singayya Case: ఒక సామాన్య మహిళను జగన్ తన నివాసానికి పిలిపించుకుని మాట్లాడడం వెనుక పెద్ద స్కెచ్చే ఉందంటున్నారు. తాను నిందితుడిగా ఉన్న కేసుకు సంబంధించి మృతుడు సింగయ్య భార్యతో ఆయన భేటీ అవ్వడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. జగన్‌తో భేటీ తర్వాత ఆమె టీడీపీపై అనుమానాలు వ్యక్తం చేయడంతో వివేకా హత్యను అప్పటి ఎన్నికల్లో తనకు అనుకూలంగా వాడుకోవడానికి ప్రయత్నించినట్లే.. సింగయ్య మరణాన్ని కూడా తన పొలిటికల్ మైలేజ్ పెంచుకోవడానికి ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


జగన్ పర్యటనలో కారు కింద పడి సింగయ్య మృతి

మాజీ సీఎం జగన్ గుంటూరు జిల్లా పర్యటనలో ఆయన ప్రయాణిస్తున్న కారు కింద పడి సింగయ్య అనే వృద్దుడు మరణించారు. ఆ వివాదం ముదిరి దానిపై రాజకీయ రచ్చ తీవ్రస్థాయికి చేరింది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఇష్యూ చల్లారిపోయిందనుకున్న ప్రతిసారీ.. మళ్లీ రాజుకుంటూ మొదటికొస్తోంది. ఈ కేసు విచారణలో ఉండగానే.. జగన్ స్వయంగా సింగయ్య భార్యతో పరామర్శ పేరుతో భేటీ అవడంపై.. అనేక విమర్శలు వస్తున్నాయి. పోలీసులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లిలో సింగయ్య భార్యతో జగన్ సమావేశమయ్యారు.


భేటీ తర్వాత లూర్ద్ మేరీ వివాదాస్పద వ్యాఖ్యలు

మృతుడు సింగయ్య భార్య లూర్ద్ మేరీతో జగన్ భేటీ తర్వాత.. ఆమె చేసిన వ్యాఖ్యలే.. ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తన భర్త ప్రమాదం తర్వాత బతికే ఉన్నాడని.. మాట్లాడాడని.. కానీ అంబులెన్స్‌లోనే ఏదో జరిగిందనే అనుమానం వ్యక్తం చేసింది. అంతేకాదు.. టీడీపీకి చెందిన కొందరు తమ ఇంటికి వచ్చి.. లోకేశ్ పేరు చెప్పి.. తమకు అనుకూలంగా మాట్లాడాలంటూ బెదిరించారని కూడా ఆరోపించారు. పోలీసులు కూడా తమపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించింది. దాంతో ఈ ఇష్యూ కొత్త టర్న్ తీసుకుంది.

ఇంత వరకు ఘటనపై మాట్లాడని లూర్ద్ మేరీ

జగన్ ను కలిసే ముందు వరకు ఆమె ఇటువంటి వ్యాఖ్యలు ఎక్కడా చేయలేదు. ఘటన జరిగి దాదాపు రెండు వారాలు దాటింది. ఇంతకాలం మీడియా ముందుకు వచ్చి ఆమె మాట్లాడిన సందర్భాలు లేవు. సింగయ్య భార్యని జగన్ కలవడం, ఆమె మీడియాతో మాట్లాడిన తీరు చూశాక.. పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఓ కేసు విచారణలో ఉండగా.. నిందితుడిగా ఉన్న వ్యక్తి.. బాధితుల కుటుంబ సభ్యులను కలవడం, వారి ద్వారా తమకు అనుకూలంగా ప్రకటనలు చేయించడం చట్టవిరుద్ధమని అంటున్నారు.

లీగల్ ఒపీనియన్ తీసుకోవడానికి నిర్ణయించిన పోలీసులు

ఆమెను, కుటుంబసభ్యులను నివాసానికి పిలించుకుని ఇలా మాట్లాడించడం కేసు దర్యాప్తును ప్రభావితం చేసే ప్రయత్నంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై.. గుంటూరు ఎస్పీ లీగల్ ఒపీనియన్ తీసుకుంటామని కూడా చెప్పినట్లు తెలుస్తోంది. అంటే.. వైఎస్ జగన్ చర్యలు చట్టప్రకారం ఎంతవరకు సమంజసం అనే దానిపై న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఒకవేళ.. ఇదంతా చట్ట విరుద్ధమని తేలితే.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయిన సీఎం

కేసు నుంచి తప్పించుకునేందుకే.. సింగయ్య భార్యని బెదిరించి.. మేనేజ్ చేసి.. తమకు అనుకూలంగా మాట్లాడిస్తున్నారని.. తెలుగుదేశం నేతలు విమర్శిస్తున్నారు. ఇది.. నీచ రాజకీయమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు సైతం తప్పుడు ప్రచారాలతో ఎప్పటికీ రాజకీయాలు చేయలేరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కారు కింద పడిని వ్యక్తిని.. కుక్కపిల్ల మాదిరిగా పక్కన పడేసే వెళ్తారా? ఇప్పుడు సింగయ్య భార్యని పిలిపించి.. బెదిరించి.. రాజకీయం చేయాలని చూస్తున్నారని, ఏమీ చేయలేని వాళ్లే శవ రాజకీయాలు చేస్తుంటారని చంద్రబాబు ఫైర్ అయ్యారు.

ఎఫ్ఐఆర్ కొట్టేయాలని కోర్టులో పిటీషన్ వేసిన జగన్

వైసీపీ నేతలు మాత్రం సింగయ్య భార్య స్వచ్ఛందంగానే జగన్‌ని కలిశారని అంటున్నారు. ఆమె వ్యక్తం చేసిన అనుమానాలు.. తమ వాదనకు బలం చేకూరుస్తున్నాయని.. వాదిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కావాలనే జగన్‌ని ఇరికించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. మరోవైపు.. ఈ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ని కొట్టేయాలని వైఎస్ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తదుపరి చర్యలు, అరెస్ట్‌పై రెండు వారాల పాటు స్టే విధించింది న్యాయస్థానం. అది జగన్‌కి తాత్కాలికంగా ఊరటనిచ్చినట్లైంది.

వివేకా హత్యపై సునీతతో మాట్లాడించిన జగన్

ఈ ఎపిసోడ్ చూస్తూ గతంలో వైయస్ వివేకానంద రెడ్డి మరణం గుర్తుకొస్తుందంటున్నారు. 2019 ఎన్నికల ముందు జరిగిన వివేకా హత్యపై ఆయన కుమార్తె డాక్టర్ వైఎస్ సునీతతో పదేపదే మీడియా సమావేశాలు పెట్టించిన వైసీపీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయించింది. అయితే అన్న జగన్ మైండ్‌గేమ్ గ్రహించిన సునీత ప్రస్తుతం ఆయనపై న్యాయపోరాటం చేస్తున్నారనుకోండి.. అది వేరే విషయం.

ఇప్పుడు కూడా దాదాపుగా సింగయ్య మరణం లో అదే వ్యూహాన్ని వైసీపీ అమలు చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె ప్రెస్ మీట్ కు కొంత మంది వైసీపీ కార్యకర్తలు కూడా వచ్చి సోషల్ మీడియాలో వాటిని వైరల్ చేసుకునేలా ముందే ప్లాన్ చేశారని తెలుగు తమ్ముళ్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తమ్మీద సింగయ్య మరణానికి సంబంధించి జగన్‌పై కేసు నమోదైనప్పటి నుంచి రాజకీయ రచ్చ కామన్ అయిపోయింది.

Related News

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Railways: రైల్వే ప్రాజెక్టులపై దృష్టి.. అవన్నీ జరిగితే ఏపీకి తిరుగుండదు

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Big Stories

×