Toyota Land Cruiser FJ: ఆఫ్‌రోడ్ SUVలను ఇష్టపడేవారికి టయోటా అదిరిపోయే న్యూస్ చెప్పింది. ప్రముఖ ల్యాండ్ క్రూయిజర్ ఫ్యామిలీ నుంచి కొత్త SUV టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJ త్వరలో భారత మార్కెట్లోకి అడుగు పెట్టనుంది. ఇది దేశీ మార్కెట్లోకి వస్తే మహీంద్రా స్కార్పియో N, థార్ రాక్స్, ఫోర్స్ గుర్ఖా లాంటి SUVలకు గట్టి పోటీ ఇవ్వనుంది. టయోటా 2025 అక్టోబర్ లో ప్రపంచవ్యాప్తంగా ఈ SUVని ఆవిష్కరించింది. ఆకట్టుకునే డిజైన్, ఆఫ్ రోడ్ సామర్థ్యాలతో ఇప్పటికే ఆటోమొబైల్ రంగంలో ఆసక్తిని పెంచుతోంది.
ల్యాండ్ క్రూయిజర్ FJను చూడగానే ఆఫ్‌రోడ్ ప్రయాణాల కోసం రూపొందించిన SUV అని అర్థమవుతుంది. బాక్సీ డిజైన్, బలమైన బాడీ క్లాడింగ్, భారీ బంపర్లు దీని ప్రత్యేకతలు. ఇందులో 18 ఇంచుల అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, సైడ్ స్టెప్స్, LED హెడ్‌లైట్లు, LED ఫాగ్ ల్యాంప్స్ అందించారు. వెనుక వైపు స్పేర్ వీల్ తో పాటు పక్కకు తెరుచుకునే టెయిల్‌గేట్‌ను ఏర్పాటు చేశారు. ఇవన్నీ SUVకి క్లాసిక్ ల్యాండ్ క్రూయిజర్ లుక్‌ను అందిస్తున్నాయి.
ఇంటీరియర్‌లో 12.3 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఇంచుల TFT డిస్‌ప్లే ఉన్నాయి. వైర్‌లెస్ కనెక్టివిటీతో పాటు వెంటిలేటెడ్, హీటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీటు వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. భద్రత కోసం ఏడు ఎయిర్ బ్యాగులు, లెవల్-2 ADAS, ABS, EBD, 360 డిగ్రీల కెమెరా, ముందు వెనుక పార్కింగ్ సెన్సార్లను అందించినట్లు సమాచారం.
ఈ SUVలో 2.7 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 164 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందుబాటులోకి రానుంది. డీజిల్ ఇంజిన్ ఆప్షన్ మాత్రం ప్రస్తుత వివరాల్లో కనిపించడం లేదు. ఈ SUV టయోటా IMV ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి రూపొందింది. ఇదే ప్లాట్‌ఫామ్‌ను ఫార్చ్యూనర్, ఇన్నోవా, హిలక్స్ లాంటి మోడళ్లలోనూ ఉపయోగిస్తున్నారు.
టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJని భారత్‌లో 2028లో విడుదల చేసే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ఛత్రపతి సంభాజీనగర్‌లోని కొత్త ప్లాంట్‌లో స్థానికంగా తయారు చేసే అవకాశాలపైనా చర్చ జరుగుతోంది. అయితే భారత మార్కెట్ విడుదలపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ధర విషయానికి వస్తే, దీని ప్రారంభ ధర సుమారు రూ.35 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. భారత్‌లోకి వస్తే ల్యాండ్ క్రూయిజర్ కుటుంబంలో అందుబాటు ధర కలిగిన మోడల్ కానుంది. ఈ SUV ఎప్పుడు భారత రోడ్లపైకి వస్తుందోనని ఆఫ్‌రోడ్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also: అక్టోబర్ లో కార్ల అమ్మకాల జోరు, ఏ కంపెనీ ఎన్ని కార్లు అమ్మిందంటే?