Pawan Kalyan: టికెట్ కొనాల్సిందే.. రావాల్సిందే.. తలసేమియా బాధితులకు అండగా ఉండాల్సిందే అంటూ నారా భువనేశ్వరి చెప్పిన మాటలు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఎలాగైతే భువనమ్మ చెప్పిందో సేమ్ టు సేమ్ అలాగే చేశారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కార్యక్రమానికి హాజరు కావడమే కాకుండా పెద్ద కానుకను కూడా ప్రకటించారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ 28వవార్షికోత్సవం సందర్భంగా తలసేమియా బాధితుల కోసం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో యుఫోరియా మ్యూజికల్ నైట్ ను శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అంతా తానై వ్యవహరించారు. ఈ కార్యక్రమం గురించి గతంలో మీడియా ముందు భువనేశ్వరి మాట్లాడుతూ.. సీఎం అయినా, డిప్యూటీ సీఎం అయినా కార్యక్రమానికి టికెట్ కొని రావాల్సిందేనని తేల్చి చెప్పారు. తలసేమియా బాధితుల కోసం చేపట్టిన బృహత్తర కార్యక్రమం కావడంతో ఊహించని స్పందన వచ్చిందని చెప్పవచ్చు.
అయితే కార్యక్రమం మొత్తంలో అందరి కళ్లు పవన్ కళ్యాణ్ పైనే ఉన్నాయి. ఇటీవల అనారోగ్యానికి గురైన పవన్, ఆలయాల సందర్శనకు కేరళ, తమిళనాడు వెళ్లి వచ్చారు. బిజిబిజీగా పవన్ గత నాలుగు రోజులుగా ఆలయాలను సందర్శించారు. అయితే చివరి నిమిషం వరకు పవన్ వస్తారా లేదా అన్నది కాస్త అభిమానులకు అనుమానంగా ఉన్నట్లు చర్చ సాగింది. కానీ పవన్ తన పర్యటన ముగించుకొని నారా భువనేశ్వరికి మాట ఇచ్చినట్లుగానే, కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సంధర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలను మెచ్చుకున్నారు. ఆ తర్వాత తన వంతుగా తలసేమియా బాధితులకు అండగా నిలిచేందుకు ఏకంగా రూ. 50 లక్షలను విరాళంగా ప్రకటించారు. రూ. 1500 టికెట్ మాత్రం కొనుగోలు చేయలేదని, నారా భువనేశ్వరి వద్దన్నారని తన సిబ్బంది చెప్పినట్లు పవన్ అన్నారు. రూ. 50 లక్షలు విరాళం ప్రకటించిన పవన్ పెద్ద మనసు చాటుకున్నారని నారా భువనేశ్వరి ఈ సంధర్భంగా ప్రశంసించారు.
పవన్ ప్రసంగం సాగుతున్న సమయంలో సైలెంట్ గా ఉన్న సభ, విరాళం ప్రకటించగానే చప్పట్లతో మారుమ్రోగింది. మొత్తం మీద పవన్ కార్యక్రమానికి హాజరు కావడంతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారని పవన్ అభిమానులు సంబరపడ్డారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు ఇవే..
ప్రపంచాన్ని వణికించిన కోవిడ్-19 మహమ్మారి బాధితులను ఆదుకోవడాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ సవాలుగా స్వీకరించిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. లోకేష్ మాట్లాడుతూ.. క్లిష్టమైన సమయంలో అవసరమైన వారికి అండగా నిలచింది. మాస్క్‌లు, మందులు, ఆక్సిజన్‌ను పంపిణీ చేశామన్నారు. కోవిద్ బాధితుల ప్రాణాలను రక్షించడానికి ట్రస్ట్ కార్యకర్తలు అహరాహం శ్రమించారని, మా ప్రయత్నాలు అక్కడితో ఆగలేదు. కోవిడ్-19 కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి అంత్యక్రియల కోసం కూడా మేము సాయం అందించామని లోకేష్ తెలిపారు. దానాలన్నింటిలో కీలకమైన రక్తదానంలో ఎన్టీఆర్ ట్రస్ట్ కీలకపాత్ర వహిస్తోందన్నారు.
ఇప్పటివరకు 8.70 లక్షల మంది రోగులకు రక్తాన్ని అందించడం ద్వారా ట్రస్ట్ లక్షలాది బాధితల ప్రాణాలను కాపాడిందని సభలో తెలిపారు. తలసేమియా, జన్యుపరమైన రుగ్మతతో బాధపడుతున్న 200 మంది పిల్లలు ట్రస్ట్ నుండి రక్తాన్ని పొందుతున్నారని, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ మందులను కూడా అందిస్తోందన్నారు. ఇప్పటివరకు 13వేల ఆరోగ్య శిబిరాలు, రూ.23 కోట్ల విలువైన మందులను పంపిణీ చేసింది. ట్రస్ట్ ఆధ్వర్యాన సంజీవని ఆరోగ్య క్లినిక్‌లు, నాలుగు మొబైల్ బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. అవసరమైన వారికి ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తున్నామని, 2,020 మంది అనాథలు పూర్తిగా ఉచిత వసతి, విద్యను ఎన్టీఆర్ ట్రస్ట్ అందిస్తున్నట్లు లోకేష్ ప్రకటించారు.