Pawan Kalyan: దేశంలో భాషల విభేదాలు, హిందీపై దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల మధ్య చర్చలు ఇప్పుడేం కొత్తకాదు. కేంద్ర ప్రభుత్వం హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తోందని.. విపక్షాల విమర్శల మధ్య, ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన హిందీ దివస్ కార్యక్రమంలో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు తెర తీశాయి. హిందీని బలవంతంగా రుద్దడం కాదు, హిందీని సౌహార్దంగా అంగీకరించండి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
హిందీ భాషపై పవన్ కల్యాణ్ చక్కటి దృక్పథం
హిందీను ప్రేమిద్దాం.. మనదిగా భావిద్దాం. హిందీ జబర్దస్త్ వస్తువు ఏమీ కాదు. మన దేశంలో జర్మన్, ఫ్రెంచ్ వంటి భాషలు నేర్చుకుంటూ పోతే, మనదేశానికే చెందిన హిందీ భాషను నేర్చుకోవడంలో ఏంటి అభ్యంతరం? అని ప్రశ్నించారు.
భాషల వైవిధ్యం – దేశ విభజన కాదు
మన దేశంలో ఎన్నో భిన్న సంస్కృతులు, భాషలు ఉన్నాయి. వాటన్నిటి మధ్య కూడా ఓ కామన్ లింక్‌గా హిందీ పనిచేస్తుంది. విదేశీయులు మన దేశానికి వచ్చి మన భాషలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. మరి మనమే హిందీని నేర్చుకోవడంలో భయపడటం ఎందుకు అని ప్రశ్నించారు పవన్. భాషలు సంస్కృతి భాగమని పేర్కొంటూ, ప్రతి భాష జీవ భాష. మాతృభాష మన అమ్మ అయితే, హిందీని పెద్దమ్మగా భావిద్దాం అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు పవన్ కళ్యాణ్.
రాజకీయాలకు హిందీ భాషను బలిగా చేయడం సరికాదు
హిందీని వ్యతిరేకించడం ద్వారా భవిష్యత్ తరాల అభివృద్ధిని.. అడ్డుకుంటామంటూ పవన్ కల్యాణ్ హెచ్చరించారు. పర్శియన్, ఉర్దూ లాంటి విదేశీ మూలాల నుంచి వచ్చిన భాషలను మనం అంగీకరించగలుగుతున్నాం. మరి మన దేశపు భాష అయిన హిందీని ఎందుకు వ్యతిరేకించాలి? అని ఎదురు ప్రశ్న వేశారు.
సినిమాలు, వ్యాపారంలో హిందీ ప్రాముఖ్యత
పవన్ కల్యాణ్ తన వ్యాఖ్యల్లో మరో ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 31 శాతం సినిమాలు హిందీలో డబ్ అవుతున్నాయి. వ్యాపార రంగాల్లో హిందీ భాష వాడకంలోనూ విస్తృత స్థాయిలో ఉంది. కానీ హిందీని నేర్చుకోవడంపై మాత్రం ఇంకా అభ్యంతరాలు ఎందుకు అని ఆయన అన్నారు.
చరిత్రలో దక్షిణాది పాత్ర గుర్తుచేసిన పవన్
హిందీ మనది కాదు అనే భావనను తప్పుబడుతూ, పవన్ కల్యాణ్ దేశ చరిత్రలో దక్షిణాదివారి పాత్రను గుర్తుచేశారు. బెంగాలీ భాషలో రచించిన గీతం జాతీయ గీతంగా నిలిచింది. దక్షిణాదికి చెందిన అబ్దుల్ కలాం మిస్సైల్ మ్యాన్ అయ్యారు. దక్షిణాది వ్యక్తి రూపొందించిన జెండా భారత జాతీయ పతాకంగా మారింది. ఇవన్నీ మనకు గర్వకారణాలు. మనమందరం ప్రాంతీయతపై కాక, జాతీయతపై దృష్టిపెట్టాలి అని స్పష్టం చేశారు.
Also Read: పార్టీలో ఉంటూ చాప కింద నీరులా.. అడ్డంగా బుక్కైన రామారావు
హిందీపై విమర్శలు – తర్కమేనా?
తమ మాటల్లో పవన్ కల్యాణ్ స్పష్టత ఇచ్చారు. హిందీ భాషపై వ్యతిరేకతను బలవంతపు రాజకీయ విమర్శలుగా మారుస్తున్నారు. ఇది దేశ భవిష్యత్‌పై ప్రభావం చూపుతుంది. హిందీని ఓ భయంకర శక్తిగా కాకుండా, అనుసంధాన భాషగా చూస్తే దేశ ఐక్యత బలపడుతుందని చెప్పారు పవన్ కళ్యాణ్.