
Pawan Kalyan latest news(AP political news):
విశాఖ జిల్లాలో మాజీ సైనికుడు మోపాడ ఆదినారాయణపై జరిగిన దాడిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. సైనికుడిగా దేశ రక్షణ కోసం సేవలు అందించిన ఆదినారాయణ తన గ్రామంపై బాధ్యతతో ప్రభుత్వ ఆస్తులను కాపాడటానికి ప్రయత్నిస్తే వైసీపీ నేతలు హత్యాయత్నానికి తెగబడటంపై మండిపడ్డారు. భారత్ ను శత్రుదేశాల నుంచి కాపాడిన సైనికుడు స్థానిక గూండాల నుంచి ముప్పును ఎదుర్కొంటున్నారన్నారు.
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం రైతులపాలెంకు చెందిన ఆదినారాయణపై వైసీపీ సర్పంచి అనుచరులు దాడి చేస్తే పోలీసులు స్పందించలేదని పవన్ మండిపడ్డారు. నిందితులపై హత్యాయత్నానికి సెక్షన్లు పెట్టకుండా కేవలం దాడిగా కేసు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ నాయకులు ప్రభుత్వ భూములను కబ్జా చేసి రెవెన్యూ రికార్డులు మారుస్తున్నారని జిల్లా అధికారులకు ఆదినారాయణ ఫిర్యాదు చేసిన విషయాన్ని జనసేనాని గుర్తు చేశారు. ఈ క్రమంలో ఆయనపై దాడి జరిగిందన్నారు. భూ కబ్జాదారులు బరితెగిస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో ప్రభుత్వమే సహజ వనరులను ధ్వంసం చేస్తోందని ఆరోపించారు. విలాసవంతమైన గృహాలు నిర్మించుకుంటోందని విమర్శించారు. ప్రజా ప్రతినిధులు ఆస్తులు కొల్లగొడుతుంటే వారి బాటలోనే అనుచరులు కబ్జాలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని.. యథా పాలకుడు తథా అనుచరులు అన్న చందంగా వైసీపీ పాలన ఉందని పవన్ కల్యాణ్ ఘాటు విమర్శలు చేశారు.
మాజీ సైనికుడు ఆదినారాయణపై దాడి చేసిన నిందితులను అరెస్టు చేయడానికి పోలీసులు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలని జనసేనాని డిమాండ్ చేశారు. మాజీ సైనికుడికే ఏపీలో రక్షణ కల్పించలేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. గతేడాది తిరుపతిలో జనవాణి నిర్వహిస్తే ప్రసాద్ అనే సైనికుడు తన భూమిని వైసీపీ వాళ్లు కబ్జా చేసి వేధిస్తున్నారని తన దృష్టికి తీసుకొచ్చారని పవన్ గుర్తు చేశారు. ఏపీలో సైనికులు, మాజీ సైనికులను ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో ఈ ఘటనలే నిదర్శనమన్నారు. విశాఖ ఘటనను కేంద్రీయ సైనిక్ బోర్డు దృష్టికి తీసుకెళ్తామన్నారు. మాజీ సైనికుడు ఆదినారాయణ కుటుంబానికి జనసేన అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు.
Pawan Kalyan : భీమవరంలో వారాహి యాత్ర .. పవన్ స్పీచ్ పై సర్వత్రా ఆసక్తి..