పవన్ కల్యాణ్ ఆషామాషీ రాజకీయ నాయకుడు కాదు. పార్టీ పెట్టిన వెంటనే ఆయన అధికారంలోకి రావాలని కలలు కనలేదు. గతంలో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినా, తన పార్టీ తరపున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే గోడదూకినా పెద్దగా బాధపడలేదు, భయపడి రాజకీయాలను వదిలేయలేదు. అసెంబ్లీకి ఎన్నికయ్యేందుకు పదేళ్లు టైమ్ పట్టినా ఓపికగా ఎదురు చూశారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి డైరెక్ట్ గా డిప్యూటీ సీఎం అయ్యారు. అలాంటి నాయకుడు పార్టీ గురించి ఇంకెంతగా ఆలోచిస్తారో అర్థం చేసుకోవచ్చు. అవును, పవన్ కల్యాణ్ జనసేన విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదు, జనసేన నాయకుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉన్నారాయన.
నాయకులపై ఫోకస్..
ఎన్నికల్లో గెలవాలంటే పార్టీ అధినాయకుడి కరిష్మా ఒక్కటే సరిపోదు, స్థానిక నేతల బ్యాక్ గ్రౌండ్ కూడా చూస్తారు ఓటర్లు. కొన్నిసార్లు మాత్రం ఒక వేవ్ లో కొట్టుకుపోవచ్చు, తొలిసారి అవకాశం రావొచ్చు, కానీ అధికారంలోకి వచ్చాక మంచి పనులు చేస్తేనే ప్రజలు రెండోసారి వారి గురించి ఆలోచిస్తారు. సరిగ్గా ఇదే విషయంపై పవన్ ఫోకస్ పెట్టారు. 2024లో 100 శాతం స్ట్రైక్ రేట్ తో జనసేన రికార్డ్ బ్రేక్ చేసింది. మరి 2029లో దాన్ని నిలబెట్టుకోవాలంటే నాయకులంతా ప్రజల వద్ద మంచి పేరు తెచ్చుకోవాలి. లేకపోతే కేవలం పవన్ కల్యాణ్ పేరు చెబితేనో, కూటమి సామర్థ్యం చూసో ఓట్లు రావు. అందుకే జనసేన తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై ఫోకస్ పెట్టారు పవన్. 2029నాటికి వారిలో ఏ ఒక్కరిపై కూడా స్థానికంగా వ్యతిరేకత లేకుండా చూసుకోవాలనుకుంటున్నారు.
బీ అలర్ట్..
ఇప్పటికే చంద్రబాబు కూడా టీడీపీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేల పనితీరుని ఏదో ఒక రూపంలో మదింపు చేయడం ప్రారంభించే ఉంటారు. వివిధ రకాల సోర్స్ ల ద్వారా నివేదికలు తెప్పించుకోవడంలో చంద్రబాబు దిట్ట. ఇప్పుడు పవన్ కూడా అదే పని చేస్తున్నట్టు తెలుస్తోంది. జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుని ఆయన మదింపు చేస్తున్నారు. అంతే కాదు ఎమ్మెల్యేలు, ఎంపీల బంధువులెవరైనా స్థానికంగా వారి పేరు చెప్పుకుని అవినీతికి పాల్పడుతున్నారా అనే విషయాలపై కూడా నివేదికలు తెప్పించుకుంటున్నారట. ఇసుక, మద్యం వ్యాపారాల్లో ఎవరైనా జోక్యం చేసుకుంటున్నారా..? ఎవరిపై అవినీతి ఆరోపణలు వినపడుతున్నాయి, ఎవరు సమస్యల పరిష్కారంలో ముందున్నారు.. అనే విషయాలను తెలుసుకుంటున్నారు.
కొందరిలో ఆందోళన..
పార్టీ అధినేత.. నాయకుల గురించిన సమాచార సేకరించి, విశ్లేషించి ఎన్నికల్లో టికెట్లు కేటాయించడం సహజమే. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది కాకముందే పవన్ కల్యాణ్ రంగంలోకి దిగడం ఇక్కడ విశేషం. పార్టీకి ఏమాత్రం చెడ్డపేరు రాకూడదనే ఉద్దేశంతోటే పవన్ కాస్త ముందుగా సమాచారం సేకరిస్తున్నారు. దీంతో కొంతమంది నేతల్లో టెన్షన్ మొదలైందని తెలుస్తోంది. సొంత పార్టీ నేతలు తప్పు చేసినా వారిపై వేటు వేసేందుకు పవన్ ఏమాత్రం వెనకాడబోరని ఇటీవల రెండు మూడు ఉదాహరణలు చెబుతున్నాయి. జనసేన ఆదర్శంగా నిలవాలని పవన్ చేస్తున్న ప్రయత్నాన్ని మెచ్చుకోవాల్సిందే. ఇలాంటి వడపోతలు ఉంటేనే నేతలు ఆదర్శంగా ఉంటారు.