Indian Railways Food: వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు దేశ వ్యాప్తంగా విస్తరించాయి. మొత్తం 135కు పైగా వందేభారత్ రైళ్లు ప్రజలకు సేవలను అందిస్తున్నాయి. అత్యంత వేగం, అత్యాధునిక సేవలతో ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్నిఅందిస్తున్నాయి. మిగతా రైళ్లతో పోల్చితే వందేభారత్ రైళ్లలో ఫుడ్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు రైల్వే అధికారులు చెప్తూనే ఉన్నారు. చెప్పే మాటలకు, గ్రౌండ్ లెవల్ లో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఇప్పటికే చెడిపోయిన ఆహార పదార్థాలను అందించి రైల్వే సంస్థ అభాసుపాలు కాగా, తాజాగా మరోసారి గడువు తీరిన డ్రింక్స్ ప్రయాణీకులకు అందించడం దుమారం రేపింది.
గడువు తీరిన డ్రింక్స్ అందించిన క్యాటరింగ్ సిబ్బంది
రైళ్లలో ఆహార భద్రతపై ఆందోళనలు లేవనెత్తుతున్న వేల.. కేరళలోని వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించే ప్యాసింజర్లకు గడువు ముగిసిన జ్యూస్ అందించారు. ఈ విషయాన్ని ప్రయాణీకులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రయాణీకులకు అందించిన జ్యూస్ ప్యాకెట్ మార్చి 24 నాటికి గడవు తేదీ ముగిసింది. ఈ జ్యూస్ ప్యాకెట్ కు సంబంధించి ఫోటోను నెటిజన్లతో పంచుకున్నారు. ఈ ఫోటోలను చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర వందేభారత్ రైళ్లలోనూ ఫుడ్ పరిస్థితి ఇలాగే ఉందంటున్నారు ప్రయాణీకులు. దేశంలోనే అత్యాధునిక రైళ్లుగా చెప్పుకునే వందేభారత్ లోనే ఫుడ్ విషయంలోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇతర రైళ్లలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. రైళ్లలో క్యాటరింగ్ సేవలు రోజు రోజుకు మరింత దిగజారుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కలుషిత ఆహారాన్ని అందించేందుకు ప్రయత్నం
ఈ సంవత్సరం ప్రారంభంలో.. కేరళలోని వందే భారత్ రైలులోని క్యాటరింగ్ సిబ్బంది కలుషితమైన ఆహారాన్ని అందించేందుకు ప్రయత్నించారని ప్రయాణీకులు రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. తిరువనంతపురం స్టేషన్ లో డెలివరీ టైమ్ లో ఫుడ్ ప్యాకెట్లు ప్లాట్ ఫారమ్ పై పడటంతో.. కొన్ని ఓపెన్ అయ్యాయి. వాటిలో ఆహారం చెడిపోయినట్లు ప్రయాణీకులు గుర్తించారు. క్యాటరింగ్ సిబ్బంది ఫుడ్ ఫ్యాకెట్లను తిరిగి ప్యాక్ చేసి కాసరగోడ్‌కు వెళ్లే రైలులోకి లోడ్ చేశారు. ఈ విషయాన్ని గుర్తించి, రైల్లోని ప్రయాణీకులు ఫుడ్ ప్యాకెట్లను పరిశీలించడంతో అసలు కథ బయటకు వచ్చింది. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ జరిపి క్యాటరింగ్ సిబ్బంది పై చర్యలు తీసుకున్నట్లు రైల్వే ప్రకటించింది.
కుళ్లిన మాంసం, చెడిపోయిన గుడ్లు
ఇక ఈ నెల మొదటి వారంలో వందేభారత్ రైళ్లకు ఫుడ్ సరఫరా చేసే క్యాటరింగ్ సెంటర్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. ఎర్నాకుళంలోని కడవంత్రలో కార్పొరేషన్ లైసెన్స్ లేకుండా పనిచేస్తున్న క్యాటరింగ్ సెంటర్ లో కుళ్ళిన మాంసం, చెడిపోయిన గుడ్లు సహా గడువు ముగిసిన ఆహారా పదార్థాలకు సంబంధించిన వస్తువులను గుర్తించారు. ఈ యూనిట్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ తో సహా అనేక రైళ్లకు భోజనం సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. వరుస ఘటనల నేపథ్యంలో రైల్వేలో వందేభారత్ లో ఫుడ్ సేఫ్టీపై ప్రయాణీకులలో ఆందోళన వ్యక్తం అవుతోంది.