Pawan Kalyan In Ippatam Village : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామ పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో ప్రభుత్వం కొందరి ఇళ్లను కూల్చివేసిన విషయం తెలిసిందే. అయితే జనసేన ఆవిర్భావ సభకు తమ స్థలం ఇచ్చినందుకే ఇళ్లను కూల్చివేసారని బాధితులు అంటున్నారు. బాధితుల పక్షాన ప్రశ్నించడానికి జనసేన అధినేత ఇళ్లను కూల్చివేసిన ప్రదేశానికి వెళ్లారు. పవన్ వెంట జనసైనికులు, టీడీపీ సానుభూతిపరులు కలిసి నడిచారు. ఈ సమయంలో పవన్ అక్కడికి చేరుకోకముందే అనేక మంది పోలీసులు మోహరించారు.
రోడ్డు విస్తరించే క్రమంలో ఇళ్లు కూల్చివేసినట్లు ప్రభుత్వ అధికారులు వివరణ ఇచ్చుకున్నారు. జనసేన మీద కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇళ్లు కూల్చివేసినట్లు జనసైనికులు అంటున్నారు. ఇప్పటం గ్రామ పర్యటనలో పవన్ కామెంట్స్ జనసైనికుల్లో జోష్ పెంచాయి. ఎన్‌కౌంటర్లకే భయపడను.. అలాంటిది అరెస్టులకు భయపడతానా అని పవన్ అన్నారు.
ఇప్పటం గ్రామంలో కూల్చివేసిన ఇళ్లను జనసేనాని పరిశీలించారు. పవన్‌కు మద్దతుగా అనేక మంది జనసైనికులు ఇప్పటం గ్రామానికి చేరుకున్నారు. రోడ్డు విస్తరణ అని ఇళ్లు కూల్చివేస్తున్నారు.. అదే రోడ్డులో ఉన్న వైఎస్‌ఆర్ విగ్రహం ఎందుకు కూల్చలేదని ప్రశ్నించారు. గుంతలు పూడ్చలేరు కానీ ఇళ్లు కూలుస్తారా అని మండిపడ్డారు పవన్. వైఎస్ఆర్ సీపీ వాళ్లకి చెబుతున్నా.. మా సభకు ఇప్పటం గ్రామస్తుల స్థలం ఇచ్చారని ఈ కుట్ర చేసి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇడుపులపాయలో మేము హైవే వేస్తాం.. మా మట్టిని కూల్చారు.. మీ కూల్చివేత తథ్యం అని హెచ్చరించారు