సార్వత్రిక ఎన్నికల వేళ పవన్ కల్యాణ్ లో ఫుల్ ఫైర్ చూశాం. ప్రచారంలో ఆయన దూకుడు చూశాం. కూటమి అధికారంలోకి వచ్చి పవన్ డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టిన తర్వాత మాత్రం ఆయన కాస్త సైలెంట్ అయ్యారు. వైసీపీలో కొంతమంది నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నా చూస్తూ ఊరుకున్నారు. కనీసం కౌంటర్లు కూడా ఇవ్వట్లేదు. సందర్భం లేని విషయాల్లో కూడా కొంతమంది వైసీపీ నేతలు పవన్ పేరు తీసుకొచ్చి మరీ విమర్శిస్తున్నారు. అయినా పవన్ బదులివ్వట్లేదు. తాజాగా హరిహర వీరమల్లు రిలీజ్ సమయంలో ఆయన విమర్శకుల నోళ్లు మూయించేలా సమాధానం ఇచ్చారు. చాలా రోజుల తర్వాత పవన్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు.
రోజాకు కౌంటర్..
ఇటీవల పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేస్తూ వైసీపీ నేత రోజా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పవన్ ఏ ఊరికెళ్తే, తాను ఆ ఊరివాడినంటూ చెప్పుకుంటారని, అందులో లాజిక్ ఏంటని ఆమె ప్రశ్నించారు. వైసీపీ సోషల్ మీడియా కూడా ఇదే విషయంపై పవన్ ని ట్రోల్ చేస్తోంది. ఈ ట్రోలింగ్ పై పవన్ ఘాటుగా స్పందించారు. తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి అని అందుకే తనకు ఊళ్లు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు పవన్. పవనం లాగా తాను ఊళ్లు తిరిగితే, తనను విమర్శించేవారు బావిలో కప్పల్లా అక్కడే ఉన్నారని కౌంటర్ ఇచ్చారు. బావిలో కప్పలు అంటూ పవన్ వైరి వర్గాన్ని టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలో వచ్చే విమర్శల్ని పవన్ సునిశితంగా పరిశీలిస్తుంటారనే విషయం ఈ సమాధానంతో రుజువైంది.
ఆ ప్రశ్నకు కూడా..
డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ పాలనను వదిలేసి సినిమాలు చేస్తున్నారంటూ వైసీపీ సోషల్ మీడియా విమర్శలు చేసింది. ఈ విమర్శలకు కూడా పవన్ సమాధానమిచ్చారు. తానేమీ రోజుల తరబడి సినిమాలకోసం కాల్షీట్లు కేటాయించలేదని, కేవలం రోజుకి రెండు గంటలు మాత్రమే సినిమా షూటింగ్ లకు హాజరయ్యానని చెప్పుకొచ్చారు. తన వ్యక్తిగత సమయాన్ని మాత్రమే సినిమాలకు కేటాయించానన్నారు పవన్. పాలనను పట్టించుకోవడం లేదంటూ తనపై వైసీపీ చేస్తున్న విమర్శలకు పవన్ గట్టిగానే బదులిచ్చారు. అంతే కాదు తాను కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేదని చెప్పారు. అంటే పవన్ తిరిగి సినిమాల్లోకి వెళ్తున్నారంటూ వైసీపీ చేస్తున్న విమర్శల్లో పస లేదని తేలిపోయింది. తన ప్రాధాన్యత పరిపాలనకేనంటూ ఆయన చెప్పకనే చెప్పారు. సినిమా షూటింగ్ ల తర్వాత పవన్ పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాలపై కూడా ఫోకస్ పెడతారని తెలుస్తోంది.
చాన్నాళ్లకు..
ఎన్నికల సమయంలో కూడా పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. ఎలక్షన్ తర్వాత కూడా ఆయన లిమిటెడ్ గానే ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలు ఇచ్చిన ఆయన.. చాలా విషయాలను మీడియాతో పంచుకున్నారు. సినిమాలే కాదు, రాజకీయాల గురించి కూడా మాట్లాడారు. తాను ఇక సినిమాలకు దూరం కావాల్సి వస్తుందని తేల్చి చెప్పారు. అయితే నిర్మాతగా తన సరికొత్త ప్రయాణం కొనసాగుతుందన్నారు.