ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తానని మోసం చేశారని, పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసినా తనకు కనీసం గౌరవం ఇవ్వలేదన్నారు. జగన్ వైఖరి, ఆయన చేసిన మోసం వల్లే తాను పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు.
గతంలో కూడా చాలామంది వైసీపీని వీడినా జగన్ పై పెద్దగా విమర్శలు చేయలేదు. అయితే రోజులు గడిచే కొద్దీ వారి విమర్శల్లో పదును పెరుగుతోంది. ఉదాహరణకు విజయసాయిరెడ్డి మొదట్లో వ్యవసాయం చేసుకుంటానన్నారు. తర్వాత జగన్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడటం మొదలు పెట్టారు. ఇంకొంతమంది మాత్రం పార్టీ మారిన తర్వాత సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే జగన్ వ్యవహార శైలి వల్ల నిజంగానే హర్ట్ అయిన వారు మాత్రం తమ గోడు వెళ్లబోసుకోకుండా ఉండలేకపోతున్నారు. ఈ లిస్ట్ లో మర్రి రాజశేఖర్ ఉన్నారు.
టార్గెట్ జగన్..
కేవలం జగన్ తప్పుడు హామీల వల్లే తాను హర్ట్ అయ్యాయని చెప్పుకొచ్చారు మర్రి రాజశేఖర్. తనను మోసం చేయడమే కాకుండా, అవమానించేలా ప్రవర్తించారన్నారు. 2009లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా తాను కేవలం వైఎస్ఆర్, జగన్ పై ఉన్న అభిమానంతోనే వైసీపీలో చేరానన్నారు మర్రి రాజశేఖర్. ఆ నాలుగేళ్లు తాను అధికారానికి దూరంగా ఉండి, జగన్ కోసం పనిచేశానని, కానీ తనను ఆయన గుర్తించలేదన్నారు. 2009నుంచి ఆయన వైసీపీనే అంటిపెట్టుకుని ఉన్నారు. కానీ జగన్ మాత్రం ఆయనకు కేవలం ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సరిపెట్టారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక మర్రికి మంత్రి పదవి గ్యారెంటీ అని అందరూ అనుకున్నారు. కానీ అది కూడా సాధ్యం కాలేదు. జగన్ లెక్కల్లో ఆయన మిస్ అయ్యారు.
చిలకలూరి పేట నియోజకవర్గాన్ని 2019లో జగన్ విడదల రజినికి కేటాయించారు. అప్పట్లో ఆమె విజయం కోసం పనిచేస్తే.. మర్రిని మంత్రిని చేస్తానన్నారు. ఆ మాట నమ్మిన ఆయన, విడదల రజిని గెలుపుకోసం కృషి చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చినా మంత్రి పదవిపై మాత్రం మాట తప్పారు జగన్. ఇక 2024 ఎన్నికల తర్వాత కూడా మర్రికి పార్టీలో అవమానాలు ఎదురయ్యాయని అంటున్నారు. విడదల రజినిని చిలకలూరిపేట నుంచి తప్పించి గుంటూరుకి పంపించారు. ఆ సమయంలో చిలకలూరి పేటలో మర్రిని సంప్రదించకుండానే అభ్యర్థిని నిర్ణయించారు. తీరా ఓటమి తర్వాత కొన్నిరోజులు ఆ నియోజకవర్గ బాధ్యత మర్రికి అప్పగించారు. ఆ తర్వాత మళ్లీ సీన్ మారింది. విడదల రజినికి ఆ బాధ్యతలు కేటాయిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ హర్ట్ అయ్యారు.
టీడీపీలోకి..
వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్ త్వరలో తాను టీడీపీ కండువా కప్పుకోబోతున్నట్టు స్పష్టం చేశారు. ఎలాంటి హామీలు, షరతులు లేకుండానే తాను టీడీపీలో చేరబోతున్నట్టు చెప్పారు మర్రి రాజశేఖర్. అయితే ఆయనకంటే ముందు రాజీనామాలు చేసిన ఎమ్మెల్సీల విషయంలో మండలి చైర్మన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు మర్రి రాజీనామా ఏమవుతుందో, ఎప్పటికి ఆమోదం పొందుతుందో చూడాలి.