AP flexi War: వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా కొన్ని ఫ్లెక్సీలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసిన నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా ఆ ఫ్లెక్సీల్లో ఉన్న డైలాగ్స్‌ను ఉద్దేశించి, సినిమా డైలాగ్‌లు సినిమా హాలు వరకే బాగుంటాయి. వాటిని రియల్ లైఫ్‌లో అనుసరించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు.
పవన్ వ్యాఖ్యలలో తీవ్రత కనిపించింది. ఎవరు ఉన్నా సరే… చట్టాన్ని గౌరవించాలి. నిబంధనలకు లోబడి ఉండాలి. సినిమాల్లో చెప్పిన మాటలను నిజ జీవితంలో నెరవేర్చాలనే ప్రయత్నం చేస్తే అది వ్యవస్థను గౌరవించకపోవడం కాదా? అంటూ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రతీ ఒక్కరూ తాము అనుసరించాల్సిన నియమాలు ఉన్నాయని, వాటిని ఉల్లంఘించడం ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలగవచ్చని పవన్ హెచ్చరించారు.
జగన్ పర్యటనకు సంబంధించిన ప్రచార ఫ్లెక్సీల్లో రప్పా రప్పా తలలు నరకుతాం వంటి డైలాగులు కనిపించడం రాజకీయంగా వేడెక్కించిన అంశంగా మారింది. దీనిపై స్పందించిన పవన్, ఇలాంటి డైలాగ్‌లు చట్టవ్యవస్థను తక్కువ చేసి చూపించే ప్రయత్నంగా మారతాయని అభిప్రాయ పడ్డారు. రాష్ట్రంలో ప్రజలు భయంతో ఉండే పరిస్థితి లేదని చెప్పే నాయకులు, ఇటువంటి మాటలతోనే ప్రజల్లో భయాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
ఆసాంఘిక శక్తులపై పవన్ ఘాటుగా స్పందించారు. రౌడీషీట్లు తెరిచి వారిని అదుపు చేస్తాం. శాంతిని భంగం చేసే వారికి ఉపేక్ష ఉండదు. ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవు. ఇది నా వ్యక్తిగత కోపం కాదు. ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే అని పవన్ తెలిపారు. అంతేగాక, అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటం కూడా నేరం అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు.
పవన్ మరో కీలక వ్యాఖ్య చేస్తూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు తారుమారు కావడానికి నాయకులు ఇచ్చే బాడీ లాంగ్వేజ్, వారిది భావోద్వేగాలకు తావిచ్చే మాటలు కారణమవుతాయి. ఇవి నియంత్రించాలంటే నాయకులే ముందుగా నైతిక బాధ్యత తీసుకోవాలి. ప్రజలను రెచ్చగొట్టే విధంగా వాగడాలు అసలు కుదరదని తెలిపారు.
Also Read: వివాదంలో బీజేపీ ఎమ్మెల్యే
ఇటీవల వైఎస్సార్ సీపీ నేతలు మాట్లాడే తీరు, వారి ఆత్మవిశ్వాసానికి మించి అధికార దుర్వినియోగంతో కూడిన నడవడికలు ప్రజలలో భయం కలిగిస్తున్నాయని జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. పవన్ వ్యాఖ్యల పట్ల రాజకీయ వర్గాలు మిక్స్‌డ్ రియాక్షన్స్ ఇస్తున్నప్పటికీ, ప్రజలు మాత్రం ఈ వివాదాస్పద ఫ్లెక్సీలు అవసరమా? అనే కోణంలో చర్చిస్తున్నారు. ఒకటే ప్రశ్న అందరిలో.. అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన సమయంలో ‘రౌడీ’గా ప్రవర్తించే భాష అవసరమా? అనే వైఖరి కనిపిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇకపోతే రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం కూడా ఈ ఫ్లెక్సీలపై సమాచారాన్ని సేకరిస్తోందని సమాచారం. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేసిన పల్నాడు పోలీసులు, ప్రజలను రెచ్చగొట్టేలా ఉండే ఫ్లెక్సీలపై చర్యలు తీసుకోవాలని, ఫ్లెక్సీ సంస్థలకూ హెచ్చరికలు ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
మొత్తానికి జగన్ పర్యటనలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కించింది. పవన్ వ్యాఖ్యలతో మళ్లీ చర్చ రాజకీయం కంటే సమాజంలో శాంతి, చట్టాన్ని గౌరవించాలనే అంశంపైకి వెళ్లింది. నాయకులు మాటలతోనే మార్పు తేవాలి.. మార్గదర్శకులు కావాలనే పవన్ సూచనతో ఈ అంశం మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది.