AP Politics: మాటకారిగా పేరుగాంచిన ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారధి వివాదాల్లో చిక్కుకుంటున్నారు. నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వ్యవహారించిన తీరు, కులమతాల గురించి ప్రస్తావించడం వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్యే పార్థసారథితో పాటు పక్కనే ఉన్న కూటమి నాయకులు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ దళిత సంఘాల ఆగ్రహానికి గురవుతున్నాయి. అసలు ఆదోనిలో జరుగుతున్న క్యాస్ట్ పాలిటిక్స్ ఏంటి? ఎమ్మెల్యే అంతలా ఎందుకు టార్గెట్ అవుతున్నారు?
అదోని ఎమ్మెల్యే పార్థసారథి సమక్షంలో ధనాపురంలో గ్రామసభ
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోని సమీపంలో ధనాపురం గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారధి ముఖ్యఅతిధిగా కూటమినేతలు గ్రామంలో ఉన్న గుడి కట్టపై గ్రామసభ ఏర్పాటు చేశారు. గ్రామంలో ఉన్న సమస్యలను కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే చర్చించారు. సభ జరుగుతున్న సమయంలో గ్రామ సర్పంచుని ఎమ్మెల్యే పార్థసారథి సభా వేదికకు ఆహ్వానించారు. అక్కడే ఎమ్మెల్యే వ్యవహారించిన తీరు వివాదస్పదమైంది.
ఎమ్మెల్యే పిలిచినా వేదిక పైకి రావడానికి సంశయించిన సర్పంచ్
బీజేపీ ఎమ్మెల్యే స్వయంగా గ్రామ స్పరంచ్ చంద్రశేఖర్‌ను వేదికపైకి పిలవగా ఆయన రావడానికి సంశయించారు. సర్పంచ్ వెనుకా ముందు ఆలోచించడంపై ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడిన మాటలు, ప్రవర్తించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో నెగిటివ్‌గా వైరల్ అవుతుంది. పార్థసారథి పక్కనే ఉన్న కూటమి నాయకురాలు గుడిసె కృష్ణమ్మ ఆయనకు సర్పంచ్ చంద్రశేఖర్ ఎస్సీ అని చెప్పడం…సర్పంచ్‌ను సభా వేదికపైకి పిలవకుండా …సభా వేదిక ముందు నిల్చబెట్టడడంపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ నడుస్తోంది.
ఎమ్మెల్యేపై దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు
సాక్షాత్తు ఎమ్మెల్యే సమక్షంలోనే ఒక దళిత సర్పంచుకు అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. సాక్షాత్తు ఎమ్మెల్యే సమక్షంలో ఒక దళిత సర్పంచ్, గ్రామ ప్రథమ పౌరుడికి అవమానం జరుగుతుంటే ఎమ్మెల్యే పార్థసారథి ఏమాత్రం పట్టించుకోకుండా పార్టీ నాయకులు సూచించిన విధంగా నడుచుకోవడం రాజకీయంగా పెను దుమారాన్ని రేకెత్తిస్తోంది. ఒక దళిత సర్పంచ్ పట్ల బిజెపి ఎమ్మెల్యే పార్థసారథి చేసిన వ్యాఖ్యలు కూటమినేతలు చేసిన వ్యాఖ్యల తీరుపై నెటిజన్లు తమదైన స్టైల్ లో కౌంటర్లు ఇస్తున్నారు. ప్రజల సమక్షంలో ఒక దళిత సర్పంచుకు జరిగిన అవమానాన్ని తీవ్రంగా పరిగణించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తగిన న్యాయం చేయాలని దళిత సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు.
మొదటి సారి పోటీ చేసి ఎమ్మెల్యే అయిన పార్థసారథి
మొత్తానికి ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వ్యవహార తీరు కూటమి పార్టీల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికలలో పొత్తుల్లో భాగంగా ఆదోని సీటు బీజేపీకి దక్కడంతో.. పార్థసారథి పోటీ చేసి కూటమి వేవ్‌లో మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో పార్థసారథి వైసీపీ నుంచి పోటీకి తీవ్ర ప్రయత్నాలు చేశారంట. అప్పట్లో డబ్బు సంచులతో లోటస్‌పాండ్‌లోని జగన్ నివాసం చుట్టూ ప్రదక్షిణలు చేసినా టికెట్ దక్కలేదంటున్నారు. ఇప్పుడు పార్థసారథి ఎమ్మెల్యే అయ్యారో లేదో అప్పటినుంచి కూటమి సీనియర్ నేతలను అందర్నీ పక్కనపెట్టారని ఆదోని నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే మీనాక్షినయుడు, గుడిసు కృష్ణమ్మ వర్గాలు
స్థానిక బీజేపీ నేతలు సైతం పార్థసారథి తమను పట్టించుకోవడం లేదని పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారంట. ఆదోనిలో ఇప్పటికే కూటమి పార్టీల మధ్య మూడు ముక్కలాట నడుస్తోందంట. అందులో ప్రధానంగా తెలుగు తమ్ముళ్లలో రెండు గ్రూపులు ఉన్నాయంట. ఓ గ్రూపు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు నేతృత్వంలో, మరో వర్గం గుడిసె కృష్ణమ్మ సారథ్యంలో సొంత అజెండా నడిపిస్తున్నాయంట. ఇక జనసేన పార్టీ ఇంచార్జ్ మల్లప్పది సెపరేటు గ్రూపంట. ప్రస్తుతం బిజెపి ఎమ్మెల్యే పార్థసారధికి గుడిసె కృష్ణమ్మతో తప్ప మిగిలిన నేతలతో సఖ్యత లేదంటున్నారు.
Also Read: బీజేపీ, కాంగ్రెస్ ఫెవికాల్ బంధం
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పార్థసారథి
ఇటీవల కర్నూలు జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మల రామానాయుడుకి మీనాక్షి నాయుడు అనుచరులు బీజేపీ ఎమ్మెల్యే కలుపుకుని పోవడం లేదని ఫిర్యాదు చేసి.. ఇన్చార్జ్ మంత్రిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఆదోని బిజెపి ఎమ్మెల్యే పార్థసారధి తీరుపై కూటమినేతలు అగ్గిమీద గుగ్గిలవుతున్నారట. ఎన్నికల్లో గెలిచిన అనంతరం పార్టీ సీనియర్ నేతలను పట్టించుకోకుండా తమదైన స్టైల్ లో సోషల్ మీడియా వేదికగా పోస్టింగ్లు పెడుతూ హడావుడి చేస్తున్నారాయన. అదే సోషల్ మీడియా ఎంత మంచి చేస్తుందో అంతే చెడు చేస్తుందని తాజాగా దళిత సర్పంచ్ విషయంలో జరిగే ఘటనే నిదర్శనమని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది.
Story By Apparao, Bigtv