Allu Arjun Arrest – YCP: ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ తొలి పోరాటంతో ప్రజల్లోకి వచ్చింది. కానీ వైసీపీ అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటనే తీరులో జరిగింది ఈ తంతు. ఔను మీరు విన్నది నిజమే. పుష్ప అరెస్ట్ పుణ్యమా అంటూ.. వైసీపీ తొలిపోరాటానికి దెబ్బ పడింది. అదెలాగంటే తెలుసుకుందాం.
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తన ఉనికి కోసం వైసీపీ తెగ ఆరాట పడుతోంది. కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీకి మళ్లీ ఊపిరి పోయాలన్నదే మాజీ సీఎం జగన్ లక్ష్యం. కానీ కూటమి మాత్రం తన పని తాను చేసుకుపోతూ.. సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అంతేకాదు రహదారుల అభివృద్ది, పెట్టుబడుల రాక, పాలనా పరమైన అంశాలపై దృష్టి సారించింది. అయితే కూటమి మోసపు మాటలతో అధికారాన్ని చేజిక్కించుకుందని, ఇచ్చినఅ హామీలను నెరవేర్చలేదంటూ.. వైసీపీ విమర్శల జోరు పెంచింది.
అలాగే పార్టీ క్యాడర్ చేయి జారకుండా, ఇప్పటికే అన్ని జిల్లాల నాయకులతో పలు దఫాలు జగన్ సమావేశాలు సైతం నిర్వహించారు. 11 సీట్లతో భారీ షాక్ తిన్న వైసీపీకి పూర్వ వైభవం రావాలంటే నిరంతరం ప్రజల్లో ఉండాలని జగన్ భావించారు. అనుకున్నదే తడవుగా ప్రత్యేక కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమయ్యారు జగన్. ఈ దశలో డిసెంబర్ 13న రైతు పోరంటూ ముందుగా షెడ్యూల్ ప్రకటించారు. అన్ని జిల్లాలలో శుక్రవారం కలెక్టర్ కార్యాలయాల వద్ద రైతులతో నిరసన తెలపాలన్నది వైసీపీ ధ్యేయం. అలాగే రైతులు వచ్చారు.. నాయకులు వచ్చారు.. పోరాటం సాగింది. అలాగే అన్ని జిల్లాల కలెక్టర్స్ కి రైతుల సమస్యలు పరిష్కరించాలని వినతులు కూడా అందజేశారు.
పలు జిల్లాలలో సక్సెస్ కాగా, మరికొన్ని జిల్లాలలో అంతగా ప్రభావం చూపలేదని తెలుస్తోంది. అయితే జగన్ మాత్రం.. దగాపాలనపై రైతన్నల తొలిపోరాటం విజయవంతమైంది. కూటమి చేస్తున్న మోసాలను నిలదీస్తూ, అన్యాయాలను ప్రశ్నిస్తూ రైతన్నలు ఇవాళ రోడ్డెక్కారు. రైతులకు తోడుగా నిలిచిన వైయస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు అందరికీ అభినందనలు. ఆరునెలల కాలంలోనే చంద్రబాబుపై ప్రజావ్యతిరేకతకు ఇవ్వాళ్టి కార్యక్రమం అద్దంపట్టింది. దీన్ని అడ్డుకోవడానికి చంద్రబాబు పోలీసులను ఉపయోగించుకుని పార్టీ నాయకులపైన, రైతులపైన హౌస్ అరెస్టులకు, బెదిరింపులకు దిగినా ఎక్కడా వెనకడుగు వేయకుండా, వారు తమ డిమాండ్లు వినిపించడం హర్షణీయమంటూ ట్వీట్ చేశారు.
Also Read: Allu Arjun Arrest: ఇది రేవంత్ సర్కార్.. బిగ్ బాస్ విన్నరైనా.. నేషనల్ అవార్డ్ అందుకున్నా.. ఒకే న్యాయం
ఇది ఇలా ఉంటే రాక రాక ప్రజల్లోకి వైసీపీ వస్తే, అదే రోజు హీరో అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో ప్రచారం అంతగా సాగలేదని టాక్. కూటమిని టార్గెట్ చేస్తూ.. వైసీపీ రోడ్డెక్కినా ప్రజల చూపు బన్నీ వైపు మళ్లింది. అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా అంతగా వైసీపీ పోరాటం కనిపించలేదట. తామేదో అనుకుంటే ఇక్కడ ఏదో జరిగిందంటూ.. వైసీపీకి చెందిన సెకండరీ క్యాడర్ చెప్పుకుంటున్నారట. మొత్తం మీద ఇలా పుష్ప అరెస్ట్ విషయం.. వైసీపీ తొలిపోరాటంపై ఎఫెక్ట్ చూపిందన్న మాట.