Perni Nani: స్థానిక ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఒకవైపు ఎన్నికల వాతావరణం, మరోవైపు వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదంపై ప్రచారం నడుస్తుండటంతో మాజీ మంత్రి పేర్ని నాని అమరావతిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇటువంటి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
యలహంక ప్రాపర్టీ వివాదం..
యలహంక ప్రాపర్టీ వివాదంపై స్పందిస్తూ.. ఆ ఆస్తి వైఎస్ జగన్ అత్తగారైన డాక్టర్ సుగుణమ్మగారిదని పేర్ని నాని స్పష్టం చేశారు. కడప, అనంతపురం జిల్లాల్లో ఎంతో పేరున్న వైద్యులుగా ఆ రోజుల్లోనే స్థితిమంతులుగా ఉన్నందున బెంగళూరులో వారు ఈ స్థలాన్ని కొనుగోలు చేశారని వివరించారు. 20 ఏళ్ల క్రితమే జగన్ కంపెనీ ఆ స్థలాన్ని లీజుకు తీసుకుని, నిర్మించిన రెండు గెస్ట్‌హౌస్‌లకు ఇప్పటికీ బిల్లులు చెల్లిస్తోందని, MOUలో కూడా ఈ ఆస్తి ప్రస్తావన లేకపోయినా తనది అనడం భావ్యం కాదని పేర్కొన్నారు.
బాబు సైన్ ఇస్తే చాలు.. షర్మిల సీన్‌లోకి వచ్చేస్తుంది!
అలాగే షర్మిల వ్యవహార శైలిని తప్పుబడుతూ, చంద్రబాబుకు ఎప్పుడు రాజకీయ లబ్ధి అవసరమైతే అప్పుడు ఆమె తెరపైకి వస్తున్నారని నాని ఆరోపించారు. వైఎస్సార్ మరణం తర్వాత కూడా చెల్లెలిపై ప్రేమతో జగన్ రూ. 230 కోట్లు ఇచ్చారని, ఈ రోజుల్లో పాతికేళ్ల తర్వాత కూడా ఇలా ఇచ్చే అన్న ఎక్కడైనా ఉంటాడా అని ప్రశ్నించారు. సెక్యూరిటీ కారణాల వల్ల యలహంక వద్ద పెళ్లి వద్దని ముందే చెప్పినా, అక్కడ కార్డులు కొట్టించి రచ్చ చేయడం వెనుక అంతర్యం ఏమిటని ఆయన నిలదీశారు.
చంద్రబాబు చెల్లెళ్లు ఇద్దరూ ఎక్కడున్నారు?
మరోవైపు చంద్రబాబు సొంత కుటుంబ ఆస్తుల పంపిణీపై పేర్ని నాని ప్రశ్నల వర్షం కురిపించారు. బహిరంగంగానే లక్ష కోట్ల ఆస్తి ఉందని చెప్పుకునే చంద్రబాబు, తన తమ్ముడికి, ఇద్దరు చెల్లెళ్లకు ఎంత వాటా ఇచ్చారో చెప్పాలన్నారు. అంతేకాకుండా హైదరాబాద్ మాదాపూర్‌లోని 7 ఎకరాల విలువైన భూమిని లోకేష్‌కు మాత్రమే గిఫ్ట్‌గా ఎందుకు ఇచ్చారని, మిగిలిన కొడుకు, కూతుళ్ల పిల్లలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
సూపర్ సిక్స్ ఘోర వైఫల్యం!
చివరగా, కూటమి ప్రభుత్వ పాలన పూర్తి స్థాయిలో విఫలమైందని పేర్ని నాని విమర్శించారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలతో పాటు మేనిఫెస్టోలోని 143 హామీలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని, రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలకు చెప్పుకోవడానికి ఏమీ లేకే, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, జగన్‌పై విషప్రచారం చేయడానికి ఈ రకమైన కుట్రలు పన్నుతున్నారని ఆయన ముగించారు.
Also Read: ఓటు వేసి వెళ్లిపోవాల్సిందే..! జగన్ కు DIG వార్నింగ్