Tata Kuno EV: భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు టాటా మోటార్స్ సరికొత్త ప్లాన్స్ వేస్తోంది. ఇందులో భాగంగా ఎంజీ విండ్సర్ ఈవీకి పోటీగా సరికొత్త మిడ్ సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకురాబోతోంది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ కారుకు ‘కూనో’ అనే కోడ్‌నేమ్ పెట్టింది. 2027-28 ఫైనాన్షియల్ ఇయర్ లో దీనిని మార్కెట్ లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. సుమారు 4.3 మీటర్ల పొడవుతో రానున్న ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ, టాటా ఈవీ లైనప్ లో నెక్సాన్ ఈవీ కంటే పైన, సియెర్రా ఈవీ కంటే దిగువన ఉండనుంది. అయితే ‘కూనో’ అనేది ప్రస్తుతం ప్రాజెక్టుకు పెట్టిన కోడ్‌నేమ్ మాత్రమే. మార్కెట్లోకి వచ్చే సమయంలో ఇదే పేరుతో విడుదల చేస్తారా? లేదా? అనేది చూడాలి.
టాటా కూనో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కంపెనీకి చెందిన Acti.ev ప్రత్యేక ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించే అవకాశం ఉంది. ఈ ప్లాట్‌ఫామ్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ (FWD), రియర్ వీల్ డ్రైవ్ (RWD), ఆల్ వీల్ డ్రైవ్ (AWD) వంటి విభిన్న పవర్‌ట్రెయిన్ లేఅవుట్లకు సపోర్టు చేస్తుంది. ఈ ప్లాట్ ఫామ్‌లో ఫ్లాట్ ఫ్లోర్, బ్యాటరీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్థలం ఉండటంతో క్యాబిన్లో ఎక్కువ స్థలాన్ని అందించే అవకాశం ఉంది. కుటుంబ అవసరాలకు అనుగుణంగా విశాలమైన ఇంటీరియర్‌ను అందించడం ద్వారా ఎంజీ విండ్సర్ ఈవీకి గట్టి పోటీ ఇవ్వాలని టాటా భావిస్తోంది.
ఈ కొత్త ఎలక్ట్రిక్ కారును గుజరాత్ లోని టాటా మోటార్స్ సనంద్ ప్లాంట్ లో తయారు చేసే అవకాశం ఉంది. ఏడాదికి 80,000 నుంచి లక్ష యూనిట్ల వరకు ఉత్పత్తి సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అయితే, దీనిపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. టాటా మోటార్స్ 2031 ఆర్థిక సంవత్సరం నాటికి తన ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిని ప్రస్తుతం ఉన్న ఆరు మోడళ్ల నుంచి 10 మోడళ్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కూనో కూడా టార్గెట్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
కూనో బ్యాటరీ సామర్థ్యం, మోటార్ పవర్, డ్రైవింగ్ రేంజ్ వివరాలను టాటా ఇంకా వెల్లడించలేదు. అయితే కర్వ్ ఈవీ, సియెర్రా ఈవీ మోడళ్లలోని బ్యాటరీ, మోటార్ టెక్నాలజీని ఇందులో ఉపయోగించే అవకాశం ఉంది. ప్రస్తుతం కర్వ్ ఈవీలో 55kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 502 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. సియెర్రా ఈవీలో 65kWh, 75kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. వీటితో గరిష్ఠంగా 665 కిలోమీటర్ల వరకు రేంజ్ లభిస్తుందని ప్రకటించారు. కూనోలో కూడా ఇలాంటి బ్యాటరీ ఆప్షన్లు ఉంటాయా? అనేది వేచి చూడాలి.
టాటా కూనో ధరలపై ఇంకా స్పష్టత లేదు. అయితే, కర్వ్ ఈవీ, సియెర్రా ఈవీ మధ్య స్థానంలో ఉండేలా దీని ధరను నిర్ణయించే అవకాశం ఉంది. ప్రస్తుతం కర్వ్ ఈవీ ధరలు రూ.17.19 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, సియెర్రా ఈవీ ధర రూ.18.79 లక్షల నుంచి రూ.25.99 లక్షల వరకు ఉంది.
Read Also: దక్షిణాఫ్రికాలో టాటా పంచ్ రిలీజ్.. భారత్‌తో పోలిస్తే ధర ఎక్కువా? తక్కువా?