Pithapuram: దక్షిణ కాశీగా విరజిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం.. పిఠాపురంలోని పాదగయ క్షేత్రంలో అధికారుల నిర్లక్ష్యం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక ప్రక్క హోమం జరుగుతుండగానే.. రశీదు పుస్తకాలను బస్తాలలో తీసుకొచ్చి హోమగుండంలో పడేసి కాల్చడం పట్ల.. భక్తులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతే కాకుండా రశీదు పుస్తకాలు దహనం చేయడం వెనుక.. ఆలయ సిబ్బంది తప్పిదాలు బూడిద చేయడమేననే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.
హోమ ద్రవ్యాలు మాత్రమే వేసే పవిత్ర హోమగుండంలో.. రశీదు కాగితాలు వేయడం ఘోరమైన అపచారమని అంటున్నారు. ఆలయ ప్రతిష్టతను అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఆలయ సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఆలయ అధికారులు భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం శోచనీయమని వాపోతున్నారు.
Also Read: ఏపీ అసెంబ్లీ సమావేశాలు, ఆ భయంతో జగన్ డుమ్మా
మరోవైపు పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకుని.. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే తరుణంలో.. ఆలయంలో కనీస సౌకర్యాలు లేవని ఆరోపిస్తున్నారు. కోనేరులో స్నానమాచరించిన మహిళా భక్తులకు బట్టలు మార్చుకునేందుకు కూడా.. సరైన సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారని చెబుతున్నారు.