Pithapuram: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు. ఎవరు.. ఎప్పుడు.. ఏ పార్టీ వైపు వెళ్తారో ఊహించలేము. ఒకప్పుడు శత్రువులు.. మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా మిత్రులు కావచ్చు. అందుకు పిఠాపురం నియోజక వర్గమే ఓ ఎగ్జాంఫుల్. ఒకప్పుడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ పేరు ఎత్తుగానే తీవ్రస్థాయిలో విరుచుకుపడే వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు జనసేన గూటికి చేరారు.
పిఠాపురంలో వైసీపీకి షాక్
ఏపీలో వైసీపీ క్రమంగా ఖాళీ అవుతోంది. ఓ వైపు ఆ పార్టీలోని కీలక నేతలపై కేసులపై కేసులు నమోదు అవుతున్నాయి. ఒక కేసు తర్వాత మరొకటి రెడీ అవుతున్నాయి. దీంతో ఆ పార్టీకి చెందిన వివిధ నియోజకవర్గాల నేతలు ఆలోచనలో పడ్డారు. ఎన్నికలకు ముందు మరో పార్టీలో చేరే బదులు.. ఇప్పుడు చేరిపోతే బెటరని కొందరు నేతలు అంచనా వస్తున్నారు.
అలాంటి వారిలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు ఒకరు. ఒకవిధంగా చెప్పాలంటే పిఠాపురంలో వైసీపీకి ఊహించని ఝలక్ అన్నమాట. తాజాగా సోమవారం డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌తో సమావేశమయ్యారు మాజీ ఎమ్మెల్యే దొరబాబు. ఆయనతోపాటు కుమార్తె, అల్లుడు కూడా పవన్ కళ్యాణ్‌ను కలిశారు. పార్టీలో చేరేందుకు పవన్ కళ్యాణ్‌తో దొరబాబు చర్చలు జరిపారు.
ఆయన్ని పార్టీలోకి తీసుకునేందుకు పవన్ కళ్యాణ్ అంగీకరించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మార్చి 14న పిఠాపురంలో జరగబోయే జనసేన పార్టీ ప్లీనరీ సమావేశం లోపే దొరబాబు జనసేన గూటికి రానున్నారు. దీంతో వైసీపీతో ఆయనకున్న బంధం తెగిపోయింది.
ALSO READ: చంద్రబాబు-పవన్ మధ్య ఏం జరిగింది?
వచ్చే ఎన్నికల కోసం గ్రౌండ్ ప్రిపేర్
గత ఎన్నికల్లో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మ పోటీ చేయాలని భావించారు. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండడంతో తన సీటును ఆయన త్యాగం చేశారు. పవన్ గెలుపు వెనుక కీలక పాత్ర పోషించారాయన. రేపో మాపో వర్మ ఎమ్మెల్సీగా ఎన్నిక కానున్నారు. ఒకప్పుడు దొరబాబు-వర్మ వేర్వేరు పార్టీలో ఉండేవారు. ఇప్పుడు ఇద్దరు నేతలు ఒకే పార్టీలో చేరారు.
రాబోయే రోజులు ఈ నేతలిద్దరు ఆయా పార్టీల నుంచి ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. దొరబాబు-వర్మ ఇద్దరు బలమైన నేతలు కావడంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికలకు వెస్ట్ గోదావరి నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాల మాట.
వెస్ట్‌పై పవన్ ఫోకస్
2019 ఎన్నికల్లో భీమవరం పోటీ చేసి ఓడిపోయారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇప్పుడు అదే నియోజకవర్గంపై అధినేత కన్నేసినట్టు అంతర్గత సమాచారం. పిఠాపురంలో తాను చేసిన, చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు చూపించి పోటీ చేయాలన్నది ఆయన భావనగా చెబుతున్నారు. ఆయన వెస్ట్ నుంచి బరిలోకి దిగితే ఉభయ గోదావరి జిల్లాలో జనసేనకు ఎక్కువ సీట్లు వస్తాయన్నది ఆ పార్టీ నేతలు అంచనా.
జనసేన పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే స్కెచ్ వేసినట్టు కనిపిస్తోంది. అదే జరిగితే వైసీపీ ఖాళీ కావడం ఖాయమనే వాదన లేక పోలేదు. వైసీపీ నుంచి వలసల జోరు కంటిన్యూ అయితే వచ్చే ఎన్నికల నాటికి ఫ్యాన్ పార్టీకి కష్టాలు తప్పవనేది ఆ పార్టీ నేతల మాట.