Chandrababu with Pawan: రేపో మాపో హస్తిన పర్యటనకు బయలుదేర నున్నారు సీఎం చంద్రబాబు. మూడు రోజులపాటు అక్కడే మకాం వేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించి ఏయే అంశాలు చర్చించాలన్న దానిపై సీఎం చంద్రబాబు-డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య సమావేశం జరిగింది. దాదాపు గంటపాటు జరిగిన సమావేశంలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం.
గంటపాటు ఏం జరిగింది?
సోమవారం సాయంత్రం అసెంబ్లీ ఛాంబర్‌లో సీఎం చంద్రబాబు-డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య భేటీ జరిగింది. ఇరువురు నేతల మధ్య దాదాపు గంట పాటు సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. ఉన్నట్టుండి అసెంబ్లీ ఛాంబర్ లో సమావేశం వెనుక అసలేం జరిగింది? ఏయే అంశాలు చర్చకు వచ్చాయి అనేదానిపై నేతలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. కాకపోతే ఎమ్మెల్సీ ఎన్నికపై ప్రధానంగా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది.
మే నుంచి రెండు లేదా మూడు పథకాలను కూటమి సర్కార్ ప్రారంభేందుకు సిద్ధమైంది. తల్లికి వందనం, అన్నదాత పథకాలపై ఇరువురు నేతలు చర్చించినట్టు సమాచారం. ఓ వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేస్తూ కేటాయింపులు జరిపినట్టు పవన్ అభిప్రాయ పడినట్లు తెలుస్తోంది.
చర్చంతా వాటిపైనే?
అలాగే ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల ఎన్నికపై చర్చించినట్టు తెలుస్తోంది. ఐదు సీట్లపై ఏ విధంగా ముందుకెళ్లాలి? బీజేపీకి పరిస్థితి ఏంటి అన్నదానిపై చర్చించారట. విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ సీటు బీజేపీకి కేటాయిస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేశారట. ఎంపీ సీటును మనం తీసుకుని, బీజేపీ ఓ ఎమ్మెల్సీ సీటు ఇస్తే ఎలా బాగుంటుందని అన్నారు.
ALSO READ: చంద్రబాబు సర్కార్ కు భారీ షాక్
దీనివల్ల కేంద్రం నుంచి మరిన్ని నిధులు తెచ్చుకోవడానికి వీలు కుదురుతుందని అంచనా వేశారట. చివరి అంశంగా ఎమ్మెల్సీ సీట్లు పరిస్థితి గురించి చర్చించారు. తొలుత నాగబాబు సీటు ఇచ్చి, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలని డిసైడ్ అయ్యారట. ఆ తర్వాత మిగతా అభ్యర్థులపై ఇరువురు నేతలు చర్చించారు. మిగతా నాలుగింటిలో బీజేపీ ఒకటి కేటాయిస్తే.. మిగతా మూడు టీడీపీ తీసుకోవాలన్నది ఈ భేటీ సారాంశంగా తెలుస్తోంది.
ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో జనసేన రెండు కోరినట్టు సమాచారం. బీజేపీ ఒకటి అడుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై చంద్రబాబు, పవన్ సమాలోచనలు చేశారు. ఐదు స్థానాలు కూటమికే దక్కనున్న నేపథ్యంలో ఎక్కువమంది పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం రాని నేతలు, టికెట్ త్యాగం చేసిన నేతలు వీటిని ఆశిస్తున్నారు.
10న నామినేషన్
ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 10న వరకు నామినేషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంది. 11న నామినేషన్ల పరిశీలనకు, 13న నామినేషన్ల ఉపసంహరణ జరగనుంది. ఏకగ్రీవంగా జరిగితే ఓకే. లేకుంటే ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఫలితం వెలువడనుంది. జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, అశోక్ బాబు, యనమల రామకృష్ణుడు పదవీకాలం మార్చి 29తో ముగియనుంది.
ఢిల్లీకి సీఎం చంద్రబాబు
రేపో మాపో ఢిల్లీకి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షాలతో సీఎం చంద్రబాబు కీలక భేటీలు నిర్వహించనున్నట్లు సమాచారం. అలాగే మిగతా కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ సీట్లపై చర్చించ నున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ టూర్ నుంచి రాగానే ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా వెల్లడికానుంది.