Amaravati : అమరావతి 2.0. ఆంధ్రుల కలల రాజధానికి పునర్‌నిర్మాణం. జస్ట్ డేట్ ఛేంజ్. అప్పుడు 2015 అక్టోబర్ 22. ఇప్పుడు 2025 మే 2. పదేళ్లు గిర్రున తిరిగిందంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్. ప్రధాని మోదీనే. ముఖ్యమంత్రి చంద్రబాబే. ప్రతిపక్షంలో ఉన్నది జగనే. ఇంకేం మారలేదు. ఆశల పల్లకి అలానే ఉంది. అయితే, ఆనాటికి ఈనాటికి ఎంతో తేడా ఉంది.
అమరావతి వైభవం
జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. మూడు ముక్కలు చేసిన రాజధానిని మళ్లీ ఒక్కటి చేశారు. ఆనాడు బుడిబుడి అడుగుతు. ఇప్పుడు వేగంగా పరుగులు. అప్పుడు కేవలం కాగితాల్లోనే ఉండేది అమరావతి. ఇప్పుడు రాజధానిలో అనేక రోడ్లు, భవనాలు. లేటెస్ట్‌గా ప్రపంచ బ్యాంకు నుంచి 6వేల కోట్లకు పైగా నిధులు సమకూరాయి. చకచకా పనులు జరగనున్నాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆ శుభకార్యానికి శ్రీకారం చుట్టబోతోంది ఏపీ సర్కార్.
ఈసారైనా…?
2015లో.. ఎన్నో ఆశలతో.. అమరావతి గడ్డపై కాలు మోపారు ప్రధాని మోదీ. విభజన హామీ మేరకు భారీగా నిధులు గుమ్మరిస్తారని అనుకున్నారు అంతా. కానీ, పిడికెడు మట్టి, చెంబెడు నీళ్లు మాత్రం ఇచ్చి వెళ్లారంటూ విమర్శలు మూటగట్టుకున్నారు. ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ అవుతాయా ఏంటి.. అని ఆంధ్రులు తమకు తాము సర్ధి చెప్పుకున్నారు. ఇప్పుడదే మోదీ.. అదే ప్రధాని హోదాలో.. మళ్లీ అమరావతి బాట పట్టారు. ఈసారైనా…? అంటూ ఏపీ వాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు. తప్పేం లేదు. ఏపీ విభజన చట్టంలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుందని రాసుంది. ఏపీ కూటమి ప్రభుత్వంలో బీజేపీ సైతం భాగస్వామిగా ఉంది. మంత్రి పదవులు కూడా అనుభవిస్తోంది. కేంద్రంలో టీడీపీ నెంబర్ 2 పార్టీగా బలంగా ఉంది. మోదీ, చంద్రబాబుల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక, మోదీకి వీరాభిమాని అయిన పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇంతటి పాజిటివ్ వైబ్‌లో.. ఈసారైనా.. ప్రధాని మోదీ నుంచి అమరావతికి ఏదైనా పెద్దగా ఆశించడంలో తప్పేముంది.. థింక్ బిగ్ అంటున్నారు ఆంధ్రులు.
జగన్‌కు ఛాన్స్ ఇస్తారా?
జగన్‌తో సహా ప్రముఖులు అందరికీ ఆహ్వానాలు పంపింది ఏపీ ప్రభుత్వం. మరి, ఈ కార్యక్రమానికి జగన్ వస్తారా? డుమ్మా కొడతారా? ప్రధాని అమరావతిపై వరాల జల్లు కురిపిస్తే ఇక ప్రతిపక్షానికి పని లేకుండా పోతుంది. అదే, మోదీ మాటలకే పరిమితమైతే.. జగన్‌కు మంచి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. అందుకే, అమరావతి పునర్ ప్రారంభోత్సవ కార్యక్రమం రాజకీయంగానూ ఎంతో ఇంపార్టెంట్ అంటున్నారు.