ISKCON Bangladesh | బంగ్లాదేశ్ లో మతరాజకీయాలు మిన్నంటుతున్నాయి. హిందువులు, ఇతర మైనారిటీలపై గత కొన్నినెలలుగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో హిందూ దేవాలయాలపై దాడులకు వ్యతిరేకంగా నిరసన చేసిన ఇస్కాన్ పూజారి చిన్మోయి కృష్ణ దాస్ ని గత వారం దేశద్రోహం ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా పూజారి చిన్మోయి కృష్ణ దాస్ సహా ఇస్కాన్ సంస్థకు చెందిన 17 మంది కార్యకర్తల బ్యాంక్ అకౌంట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం శుక్రవారం నవంబర్ 29, 2024న ఫ్రీజ్ చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది.
బంగ్లాదేశ్ ప్రభుత్వ అధికారులు కొన్ని రోజుల క్రితమే హై కోర్టులో ఇస్కాన్ (ISKCON – International Society for Krishna Consciousness)పై దేశంలో నిషేధం విధించాలని కోరుతూ పిటీషన్ వేశారు. కానీ హై కోర్టు ఇస్కాన్ పై నిషేధం విధించడం కుదరదని స్పష్టం చేసింది. కొంతమంది హిందూ నాయకుల అనుచరులు, భద్రతా బలగాల మధ్య కొన్ని రోజుల క్రితం జరిగిన హింసాత్మక ఘర్షణలో ఇస్కాన్ తరపున వాదించే లాయర్ చనిపోవడంతో దేశంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇస్కాన్ తరపున కేసు వాదించేందుకు అంగీకరించినందుకే ఆ లాయర్ ని హత్య చేశారని ఇస్కాన్ కార్యకర్తలు ఆరోపణలు చేస్తున్నారు.
Also Read: జో బైడెన్ మతిమరుపుపై రాహుల్ గాంధీ కామెంట్లు.. తమకే సంబంధం లేదని చెప్పిన కేంద్రం
ఈ పరిణామాల మధ్య బంగ్లాదేశ్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యునిట్ (బంగ్లాదేశ్ ఆర్థిక నిఘా విభాగం) ఇస్కాన్ అకౌంట్లు ఉన్న బ్యాంకులకు గురువారం నవంబర్ 28న నోటీసులు జారీ చేసింది. ఇస్కాన్ కు చెందిన 17 మంది సభ్యుల బ్యాంక్ అకౌంట్లలో 30 రోజుల వరకు ఎటువంటి లావాదేవీలు చేయరాదని నోటిసుల్లో పేర్కొన్నట్లు స్థానిక వార్త పత్రిక ‘ప్రొథొం ఆలో’ కథనం ప్రచురించింది.
దీంతో పాటు సెంట్రల్ బంగ్లాదేశ్ బ్యాంక్, ఇతర బ్యాంకులన్నీ ఇస్కాన్ అకౌంట్లకు సంబంధించిన లావాదేవీలు, ఇస్కాన్ వ్యాపార వివరాలు అన్నీ మరో మూడు రోజుల్లో తెలపాలని.. ఆదేశాలు జారీ చేసింది.
అక్టోబర్ 30న ఇస్కాన్ కు చెందిన 19 మందిపై చట్టోగ్రామ్ కోత్వాలి పోలీస్ స్టేషన్‌లో దేశద్రోహం కేసు నమోదు అయింది. ఈ 19 మందిలో పూజారి చిన్మోయి కృష్ణ దాస్ కూడా ఉన్నారు. హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఇస్కాన్ చేసిన ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాని అవమానించారని వీరిపై ఆరోపణలున్నాయి.
బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతని జాగ్రన్ జోటె సంస్థకు ప్రతినిధి కూడా అయిన పూజారి చిన్మోయి కృష్ణ దాస్ రాజధాని ఢాకాలోని షాజలాల్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ నుంచి సోమవారం నవంబర్ 25, 2024న దేశద్రోహం ఆరోపణలపై అరెస్టు చేశారు. ఆయన బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేసినా చట్టోగ్రామ్ కోర్టు దాన్ని తిరస్కరించింది. దీంతో మంగళవారం ఆయన అనుచరులు భారీ స్థాయిలో నిరసనలు చేపట్టారు.
పూజారి చిన్మోయి కృష్ణ దాస్ అరెస్ట్‌ని భారతదేశ ప్రభుత్వం విమర్శలు చేసింది. హిందువులు, ఇతర మైనారిటీల భద్రత కోసం చర్యలు చేపట్టాలని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి సూచించింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా కూడా పూజారి చిన్మోయి కృష్ణ దాస్ ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇస్కాన్ లాయర్ హత్యను ఆమె ఖండించారు.